– సభలో ప్రతిపక్షం ఉండకూడదనే కూటమి ప్రభుత్వ కుట్ర
– ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తామని భయపడుతున్నారు
– వైయస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దుర్మార్గం
– అసెంబ్లీ బయట వైయస్ఆర్ సీపీ నేతలు
అమరావతి: వైఎస్ఆర్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, సభలోనే ప్రజల గొంతును వినిపించే ప్రతిపక్షంను లేకుండా చేయాలనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వైయస్ఆర్ సీపీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంను బహిష్కరించి, సభ నుంచి బాయ్ కాట్ చేసిన అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో పలువురు నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తే, ఎక్కడ తమ పాలనలోని వైఫల్యాలను ఎత్తి చూపుతారనే భయంతోనే ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గమైన విధానంకు పాల్పడుతోందని అన్నారు. ఎవరెవరు ఏమన్నారంటే…
ప్రజల్లోకి వెళ్ళి పోరాటం చేస్తాం: మండలి నేత బొత్స
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, ప్రజల కష్టాలను ఎత్తి చూపేది ప్రతిపక్షం. అలాంటి ప్రతిపక్షంకు ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గవర్నర్ ప్రసంగంలో దీనిపై డిమాండ్ చేశాం. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, మరొకటి ప్రతిపక్షంగా నిలుస్తున్న వైయస్ఆర్ సీపీ. కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.
దానితో పాటు మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాలను గురించి ప్రశ్నించాం. వైయస్ జగన్ గారు గుంటూరు మిర్చియార్డ్ కు వెళ్ళిన తరువాతే ఈ ప్రభుత్వం రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్ళు చేయడం లేదు. మరోవైపు కేంద్రం స్పందించాలని, కొనుగోలు చేయాలని మాత్రమే అంటున్నారు. మార్క్ ఫేడ్ ద్వారా ఎందుకు మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు సమయం వస్తుంది.
మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు. కానీ మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్ళిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా పెట్టే బడ్జెట్ లోనూ మళ్ళీ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వంను నిలదీస్తాం
ఏపీలో తాలిబన్ల పాలన సాగుతోంది: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైయస్ఆర్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. ప్రతిసారీ గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ అవహేళన చేస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలకు వారేం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే వైయస్ఆర్ సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు.
మా నాయకుడు వైయస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై కోర్ట్ లో కూడా కేసు వేశాం. వైయస్ఆర్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని కూడా గవర్నర్ ని కూడా కోరాం. అయినా కూడా ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి, సభ నుంచి బాయికాట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవిని ఇస్తున్నారు.
వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనూ పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షంకు ఇచ్చాం. గతంలో ఒకే శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ ఇచ్చారు. కానీ కేవలం ఏపీలోని తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతిపక్షం అనేదే లేకుండా పాలన చేయాలని భావిస్తోంది. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ పాలనలోనే కేవలం అధికార పక్షం మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు మనదేశంలో ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తాలిబన్ పాలన సాగిస్తోంది.
మీడియా సంస్థలపై నిషేదం దారుణం: ఎమ్మెల్యే తాడిపర్తి చంద్రశేఖర్
కూటమి ప్రభుత్వ నిరంకుశపాలనకు పరాకాష్ట నాలుగు ముఖ్యమైన మీడియా సంస్థలను నిషేదించడం. ఈ దేశ చరిత్రలోనే నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్ళను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు. కూటమి దుర్మార్గ పాలనను ఎక్కడ ప్రజలకు మీడియా వివరిస్తుందోననే భయంతోనే చానెల్స్ ను బహిష్కరించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి.
దేశంలో ఎక్కడా ప్రతిపక్షం లేని రాష్ట్రం లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో ఉన్న మూడు పార్టీలు అధికారపక్షంగానే ఉన్నాయి. మిగిలిన నాలుగో పార్టీగా ఉన్న వైయస్ఆర్ సీపీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. దేశంలో ఎక్కడా ప్రతిపక్షం లేని రాష్ట్రం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ప్రతిపక్షం లేకుండా పాలన సాగుతోంది. గతంలో ఢిల్లీలో కేవలం ముగ్గురు బీజేపీ తరుఫున ఎమ్మెల్యేలు ఎన్నికైన నేపథ్యంలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. ఏపీలో మాత్రం ఇందుకు నిరాకరిస్తున్నారంటే కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ప్రతిపక్షంగా ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.
అలాగే ప్రజలపై ఏకంగా రూ.15వేల కోట్ల విద్యుత్ భారం మోపారు. రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. మిర్చిరైతు రేటు లేక కుదేలువుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు అరవై శాతం మేర పెరిగాయి. వీటన్నింటి మీద సభలో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.
ప్రతిపక్ష హోదాపై కోర్ట్ లో వేసిన పిటిషన్ కు స్పీకర్ నుంచి కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అప్పు రత్న కన్నా ఇంకా గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.