Suryaa.co.in

Andhra Pradesh

పాలన చేతకాక, మాపై నిందలు వేస్తున్నారు

– ధాన్యం సేకరణ, మద్దతు ధర రెండూ లేవు
– నెల్లూరులో వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రెస్‌మీట్‌

నెల్లూరు: ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని, రైతులకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని వైయస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సజావుగా సాగుతోందని సీఎం చంద్రబాబు చెబితే.. ఈరోజు కొన్ని పత్రికలు మాత్రం మాట మార్చి అవకతవకలు, తప్పులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల అంటూ వారి చేతకానితనాన్ని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

ఏదైతేనేం.. ఈరోజు ఈనాడులో వచ్చిన కథనం చూస్తే ప్రభుత్వ అసమర్థతను అంగీకరించిందని అర్థమవుతుంది. కానీ చంద్రబాబు అసమర్థతను దాచిపెట్టి వాస్తవాలను వక్రీకరించి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందే తప్ప, రైతులకు మేలు చేసేలా వ్యవహరించడం లేదు.

వైయస్సార్‌సీపీ నాయకుల మీద కేసులు పెట్టి వేధించడంలో ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల సమస్యల పరిష్కారంపై లేదని మేం చెప్పిన మాటలే నిజమయ్యాయి.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా రూ.13,500కు బదులు రూ.20 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు చేయడం లేదు. అసలు దాని గురించి ఏ నాయకుడూ మాట్లాడడం లేదు. వారు చెప్పిన అన్నదాత సుఖీభవ అనేది చివరికి చంద్రబాబు సుఖీభవ అన్నట్టుగా మారింది.

మద్ధతు ధర దక్కకపోవడానికి వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెప్పిన మీ మాటలే నిజమైతే.. ఈ ఆరు నెలలు ప్రక్షాళన చేయకుండా గాడిదలు కాస్తున్నారా? చంద్రబాబు పదే పదే చెప్పే 40 ఏళ్ల అనుభవం, టెక్నాలజీ, రియల్‌ టైం గవర్నెన్స్, డీప్‌ టెక్‌ ఏమయ్యాయి?.

రైతులకు మేలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకి లేకపోవడం వల్లే వారి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. రైతుల సమస్యలపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేనందునే, ఆ నెపాన్ని గత మా ప్రభుత్వం మీద, అధికారుల మీద నెట్టేసి పబ్బం గడుపుతున్నారు. మీ ప్రాధాన్యాలు అమరావతి మీద ఉంటే, అధికారులను తిడితే ఏం ప్రయోజనం ఉంటుంది?.

ధాన్యం కొనాలని కానీ, రైతులకు మేలు చేయాలని కానీ చంద్రబాబుకి లేదు. అందుకే కాలయాపన కార్యక్రమాలతో తన వైఫల్యాలను అధికారులపైకి నెట్టాలని చూస్తున్నారు. అయితే అనుకూల మీడియాలో కథనాలు రాయించుకున్నంత మాత్రాన మీరు చేసిన పాపాలు తొలగిపోవు. రైతులు మిమ్మల్ని క్షమించరు. మీరు చెప్పిందల్లా రైతులు వింటారనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి ఉండదు. మంత్రి నాదెండ్ల మనోహర్‌కి రైతులు ఎన్నిసార్లు వాట్సప్‌లో హాయ్‌ హాయ్‌ అని మెసేజ్‌లు పెట్టినా పట్టించుకున్న దాఖలాలే లేవు.

జగన్‌ హయాంలోనే రైతులకు గిట్టుబాటు ధర లభించిందని టీడీపీ సానుభూతిపరులు కూడా అంగీకరించారు. ధాన్యం సేకరణ విధానాలు బాగున్నాయని వారు చెప్పారు. రైతుల ఇబ్బందులపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే వైఎస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి వాటిని పరిష్కరించారు. మంచి పనిమంతుడు కాబట్టే వాటిని అధిగమించి రైతులకు అండగా నిలిచారు.

చిత్తశుద్ధితో పని చేసిన సీఎం జగన్‌ అయితే, ప్రెస్‌మీట్ల సీఎం చంద్రబాబు, ఏమీ చేయకుండానే ఆహా ఓహో అని తన భుజాలు తానే తట్టుకుంటున్నాడు. జగన్‌ సీఎంగా ఉండగా బస్తాకు నిర్ధారించిన ధర కన్నా అదనంగా అందుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ నేడు చంద్రబాబు పాలనలో కనీస మద్ధతు ధర కూడా రైతులకు దక్కని పరిస్థితి నెలకొంది. రైతుల కష్టాన్ని దళారులు, మిల్లర్లు కలిసి భోంచేస్తున్నారు. కానీ ఆ నెపాన్ని మాత్రం మాపై నెడుతున్నారు.

LEAVE A RESPONSE