– గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు తో పాటు ఎనిమిది ప్రాజెక్టులు అప్పగింత
– ఇప్పటికే సిఆర్డిఏ తో పాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్
రాజధాని అమరావతి నిర్మాణం కోసం మరో సంస్థను ఏర్పాటు చేశారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ తో పాటు పలు ప్రాజెక్టులను ఈ సంస్థ చేపట్టనుంది. ఈ మేరకు మంగళవారం పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ, ఆర్థిక అంశాలు, అప్పులు, చెల్లింపులతోపాటు ఇతర అంశాలన్నిటనీ ఇది పర్యవేక్షించనుంది. కంపెనీ చట్టం కింద ఏర్పాటు చేసే ఈ సంస్థకు పది లక్షల షేర్లను ఒక్కోటి రూ.10 చొప్పున కేటాయించారు. బోర్డు డైరెక్టర్లు నిర్ణయం మేరకు ఈ ధర పెరుగుదల ఉండదనుంది. ఇప్పటికే రాజధాని కోసం ఏర్పాటు చేసిన ఏపీ సిఆర్డిఏతోపాటు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఉంది.
ఇవి కాకుండా వేర్వేరు పేర్లతో సుమారు 14 కంపెనీలు రిజిస్టరయి ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థ ఆధ్వర్యంలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుతో పాటు ఎన్టీఆర్ విగ్రహం, స్మార్ట్ ఇండస్ట్రీస్, ఐకానిక్ వంతెన, స్పోర్ట్స్ సిటీ, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, రోప్ వే, ఇన్నర్ రింగురోడ్డు, కొత్తగా గుర్తించే ఇతర ప్రాజెక్టు లను చేపట్టనున్నారు.
దీనిలో పట్టణాభివృద్ధిశాఖ, ఆర్థికశాఖ, విద్యుత్, ఆర్అండ్బి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు ఎపి సిఆర్డిఎ కమిషనర్ డైరెక్టర్లుగా ఉంటారు. అనంతరం ముగ్గురు ఇండిపెండెంట్ డైరెక్టర్లను ఎన్నుకునేందుకు అవకాశం కల్పించారు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థకు అవసరమైన నిధులు సమకూర్చడం తోపాటు భూములు తనఖా పెట్టే హక్కును కూడా ఇచ్చారు. అలాగే యూజర్ ఛార్జీలు వసూలుకూ అవకాశం కల్పించారు.
కొత్తగా ఏర్పాటయ్యే సంస్థ బాధ్యతలు
కొత్త ప్రాజెక్టులకు నిధుల సేకరణతోపాటు అవసరమైన ప్రాజెక్టులు రూపొందించి వాటికి డిపిఆర్లు తయారు చేయనుంది. పిపిపి, ఈపిసి, హెచ్ఎం వంటి పద్ధతుల్లో కాంట్రా క్టర్లకు నిర్మాణ బాధ్యతలను అప్పగించనుంది.
ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులను అమలు చేసేందుకు వీలుగా పత్రాలు తయారు చేసే బాధ్యతనూ నిర్వర్తించనుంది. పిపిపి పద్దతిలో ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన ప్రణాళికనూ తయారు చేయనుంది. ఇక్కడ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా కార్పొరేట్ సంస్థలనూ ఎంపిక చేసుకునే అవకాశమూ కొత్తగా ఏర్పాటు చేసుకునే సంస్థకు ఇచ్చారు.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208