ఏరువాకకు పిలుపునిచ్చాక…అరువు
గుడ్డను తలకు చుట్టు కుంటాడు రైతు
దేశంలోని తన బిడ్డలు ఆకలి తీర్చేందుకు
సంప్రదాయ సాగుకు నాగలి పడతాడు
బీడు పట్టిన నేలను మెత్తగా దున్నుతూ
కొత్త వరి విత్తనాలను వెదజల్లుతాడు..!
కాలువకు వచ్చే నీరు పంట బోదుకి చేరదు
వరుణుడు మేఘాల వామిలో దాగుతాడు
వంతుల వారీ నీరుతో మడిని పెంచుతాడు
నానా అగచాట్లు పడి అన్నదాతలంతా
వరి నాట్లు ప్రక్రియను సంపూర్తి చేస్తారు..!
పెరుగే పైరులకు ఎరువులు ఏకరువు
చీడల నివారణకు పెట్టుబడులు బరువు
భార్య పైడి నగలు బాంకులలో మురుగు
ప్రభుత్వాల రాయితీలు సంతృప్తి నివ్వవు
తలను తాకట్టును పెట్టి… సాగును చేసేరు రైతన్నలు..!
దిగుబడులు కన్నుల పంటలుగా వున్నా
గిట్టుబాటు ధరలు కర్షకులను వెన్నుపోటు పొడుచు
అందరికీ ఆకలిని తీర్చే అన్నదాతలంతా
ఖాళీ జేబులతో ఖరీఫ్ సాగును ముగిస్తారు
పేరుకు.. రైతే రాజు… మద్దతు ధరలలో
మాత్రం… భూమి పుత్రులు బూజు తెగులు సుమా…!
– జి.సూర్యనారాయణ
6281725659.