Suryaa.co.in

Political News

తెలంగాణ రాజకీయ నాయకుల దాహం, ఆకలి తీరనిది

– లక్ష మంది కుంభకర్ణులు,లక్ష మంది బకాసురులు కలిస్తే ఒక రాజకీయ నాయకుడు

రామాయణం లోని కుంభకర్ణుడు,మహా భారతం లోని బకాసురుడు కేవలం తమ ఆకలి ని మాత్రమే తీర్చుకునే వారు. కుంభకర్ణుడు ఆరు నెలలు మేల్కొని ఉన్నప్పుడు ఆకలి ఐనప్పుడు మాత్రమే తినేవాడు. మిగతా ఆరు నెలలు నిద్ర పోయేవాడు,ఇక బకాసురుడు ప్రతి రోజూ కేవలం ఆకలి తీరే వరకే తినేవాడు. దాచుకునే అలవాటు వీరికి లేదు.

కానీ తెలంగాణ లోని రాజకీయ నాయకులు, వారిని మించి పోయారు పాలక పక్ష- ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. కార్పొరేటర్ , మేయర్, ఎమ్మెల్యే, ఎంపీ , మంత్రులు ఒక్కొక్కరు వంద కోట్ల నుండి లక్ష కోట్ల దాకా సంపాదించారు. ఐనా వారి దాహం,ఆకలి తీరలేదు. ఇంకా ప్రతి రోజు అక్రమ సంపాదన లోనే మునిగి తేలుతున్నారు. దుబాయ్ అమెరికా లాంటి దేశాలలో హోటల్స్ , భవనాలను కొన్నారు.

తెలంగాణలో ఇతర రాష్ట్రాలలో వందల ఎకరాల భూములు కొన్నారు. ప్రతి ఒక్కరూ పామ్‌హౌసులు , ఇంద్ర భవనాలు కట్టుకున్నారు హైదరబాద్ లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలలో భాగస్వాములు అయ్యారు,ప్రతి పెద్ద కట్టడాలలో వీరి భాగస్వామ్యం ఉంది. అట్లాగే ప్రముఖ వ్యాపార సంస్థలలో కూడా భాగస్వాములు. పెద్ద పెద్ద కమర్షియల్ భవనాలు 90శాతం రాజకీయ నాయకులవే.

వీరి ప్రధాన ఆదాయ వనరులు ప్రభుత్వ,ప్రవేట్ భూముల ఆక్రమణ, సెటిల్ మెంట్లు. మూడు వందల కోట్లకు పైగా ఆదాయం వచ్చే సెటిల్ మెంట్లు మాత్రమే, ప్రముఖ నాయకులు చేస్తున్నారు మూడు వందల కోట్ల లోపు సెటిల్ మెంట్లు PA లు pro లు కొందరు అధికారులు, చిన్న రాజకీయ నాయకులు చేస్తున్నారు,మీరు ఒక భూమికి సంబంధిత డాక్యుమెంట్లు పట్టుకొని కొందరి నాయకుల వద్దకు పోతే తెలుస్తుంది.

పెద్ద పెద్ద ప్రాజెక్టు ఘనులు కూడా వీరి అక్రమ సంపాదన కు మార్గాలు, ప్రముఖ మీడియాను మొత్తం రాజకీయ నాయకులు కొనుక్కున్నారు. వీరి కబంధ హస్తాలలో ఉన్నాయి. అందుకే ఎవ్వరి బాకా వారు ఊదు కుంటారు,వాస్తవాలు చెప్పరు . మాట్లాడరు. ప్రజల తరపున అసలే ఉండరు. రాజకీయ నాయకుల ఆర్థిక నేరాలను అరికట్టే నిఘా సంస్థల కాళ్ళు చేతులు విరగ కొట్టారు. ప్రతి పార్టీకి.. వందల వేల కోట్ల చందా ఎక్కడ నుండి వస్తుంది? కార్పొరేట్ సంస్థలు ఎన్నికలప్పుడు, వందల కోట్ల రూపాయలు చందాలు ఇస్తున్నాయి. వీరికి ఉత్తగనే ఇస్తున్నాయా?

వారు దోపిడీ చేశారు అని.. వీరు వీరు దోపిడీ చేశారని వారు.. జైలుకు పంపుతామని జైలు కు పోతారని బెదిరిస్తూ ప్రజలను నమ్మిస్తూ ఉంటారు. కాని వారు జైలు కు పోరు, పంపరు. ఒక్కరినో ఇద్దరినో పంపినా దాని వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి, రాజకీయ నాయకుల కేసులు, పెద్ద పెద్ద అధికారుల కేసులు కోర్టులలో తొందరగా తేలవు. అదేమిటో అర్థం కాదు,. శిక్షలు పడటం కూడా అరుదు, అధికార పక్షం అనుకుంటే ప్రతి పక్ష నాయకుల పై కక్ష తీర్చుకునే సౌకర్యం ఉంది.

ప్రతి నాయకుడికి – ప్రతి పార్టీకి ప్రజా సేవ పైన శ్రద్ధ లేదు. కేవలం సంపాదన కోసమే, అధికారం కోసమే రాజకీయాల లోకి వస్తున్నారు. రాజకీయం కూడా వ్యాపారం అయింది, నాయకుడి స్వప్రయోజనం, పార్టీ ప్రయోజనం మాత్రమే ముఖ్యం గా ప్రవర్తిస్తున్నారు ఎక్కడో ఒక నల్ల కాకుల గుంపులలో తెల్ల కాకి ఉన్నట్లుగా, ఎక్కడో ఒక్కరు మంచి వారు ఉన్నారు అన్ని పార్టీలలో.

ఎన్నికలు ఖరీదు అయిపోయినాయి, మీటింగ్ పెట్టాలంటే మీటింగులకు జన సమీకరణ చేయాలంటే, ప్రతి ఒక్కరికీ ఐదు వందల నుండి , వేయి రూపాయలు ఇవ్వాలి. వాహనాలు పెట్టాలి. బీరు తాపియాలి. బిరియాని తినిపించాలి. అట్లైతేనే జనాలు వస్తున్నారు, ఇక నాయకులు మీటింగు లకు తరలి వచ్చే విధానం చూస్తే, రాజులను మించి పోయారు. వేల వాహనాలతో వస్తున్నారు . విపరీతమైన ఖర్చు!

ఉదా:- మునుగోడు ఎన్నిక రాబోతుంది. ఒక్కొక్క ప్రధాన పార్టీ మూడు వందల కోట్ల నుండి, వేయి కోట్లు ఖర్చు పెట్ట బోతున్నాయి. పంచడం ప్రారంభించారు కూడా అందరికి. అన్ని తెలుసు కానీ అరికట్టే వ్యవస్థ లేదు సాక్ష్యం నిలబడదు, పైసలు లేని వారు, మేధావులు సంఘ సంస్కర్తలు, సామాజిక కార్యకర్తలు పోటీ చేసే పరిస్థితి లేదు. పోటీ చేసినా పైసలు ఇవ్వంది ప్రధాన మీడియా ఉపయోగ పడదు( కొన్ని మాత్రమే)ప్రజలు కూడా ఓటు వేయరు. నిజం ప్రచారం చేసి ప్రజలను చైతన్యం చేయాల్సిన జర్నలిజానికి, సంకెళ్లు వేయబడ్డాయి. ఇంకా వేయి యేండ్లు ఐనా ప్రజలు వాస్తవాలు తెలుసుకో లేరు. ఎందుకంటే దొంగలే ఎదుటి వారిని దొంగలు అని అరుస్తున్నారు. కానీ అవకాశం వస్తే అందరూ దొంగలే.
ప్రతి ఒక్కరూ పేద వారి కోసం పోరాటం చేస్తున్నట్లు.. పేద వారి కోసం పథకాలు తెస్తున్నట్లు నటిస్తున్నారు. కానీ అందరూ.. అన్ని పార్టీలు .. అధికారంలో ఉంటే సంపన్నుల కోసమే , కొన్ని వర్గాల కోసమే పని చేస్తున్నాయి.

– నారగొని ప్రవీణ్ కుమార్,
సామాజిక కార్యకర్త

LEAVE A RESPONSE