-
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇదో వి‘చిత్రం’
-
దానిని చూసి విస్తుపోయిన విశాఖ ఎమ్మెల్యేలు
-
ఆయన నా గురువని సమర్ధించుకున్న సచివుడు
-
తమ స్నేహం రాజకీయాలకు అతీతమైనది సెలవిచ్చిన సచివుడు?
-
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఇదో ‘కుల’బంధం
( మార్తి సుబ్రహ్మణ్యం)
బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు చట్టసభలో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఏకైక నాయకుడు ఆయనే. అసెంబ్లీలో వైసీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న జగన్.. అసెంబ్లీని బహిష్కరించారు. ఫలితంగా ఎమ్మెల్యేలు కూడా రావడం మానేశారు. దానితో శాసనమండలిలో కూటమి కంటే ఎక్కువ బలం ఉన్న వైసీపీకి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు.
అంటే ఆ హోదా ప్రకారం ఆయనకు మంత్రులతోపాటు సమానమైన ప్రొటోకాల్ ఉంటుందన్నమాట. ఇటీవలి కాలంలో ఉత్తరాంధ్రపై దృష్టిసారించిన బొత్స, కూటమి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలను తూర్పారపడుతున్నారు. అలాంటి వైసీపీ పక్ష నేత బొత్స కాళ్లను.. సాక్షత్తూ కూటమిలోని మంత్రి ఒకరు మొక్కారని చెబితే మీరు నమ్ముతారా? నమ్మరు కదా? బట్. నమ్మితీరాలి. ఎందుకంటే దానికి టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలే సాక్షులు కాబట్టి.
ఈ ఆసక్తికరమైన, నమ్మలేని నిజానికి వేదిక విశాఖపట్నం ఎయిర్‌పోర్టు లాంజ్. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు విజయవాడ వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ సందర్భంలో వారు వీఐపీ లాంజ్‌లో కూర్చుని కాఫీ తాగుతూ సేదదీరుతున్నారు. అందులో కూటమికి చెందిన మంత్రులు, మాజీమంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట.
అదే సమయంలో మండలిలో విపక్షనేత , మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడికి చేరుకున్నారు. బొత్సను చూసిన ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి, పరుగున వచ్చి బొత్స కాళ్లను మొక్కడం, బొత్స చిరునవ్వుతో మంత్రిగారి తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, హత్తుకోవడం చకచకా జరిగిపోయిందట. ఈ దృశ్యం చూసిన కూటమి ఎమ్మెల్యేలు షాక్ తిన్నారట.
రోజూ తమను నోరారా తిట్టిపోసే వైసీపీ నేత బొత్స కాళ్లకు, తమ మంత్రి వెళ్లి కాళ్లు మొక్కడాన్ని జీర్ణించుకోలేక్పోయారట. అదే విషయాన్ని విశాఖకు చెందిన ఓ ఎమ్మెల్యే మంత్రిగారి ముందే అడిగేశారట. మీరు వెళ్లి ఆయనకు మొక్కడం ఏమిటి? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని మనసులోనిమాటను కక్కేశారట. అందుకా సచివుడు.. ‘‘బొత్స నాకు గురువులాంటి వారు. మాది రాజకీయాలకు అతీతమైన స్నేహం. నాకంటే పెద్దవాడైన బొత్స కాళ్లకు నమస్కరిస్తే తప్పేంట’ని నిర్భయంగా సెలవిచ్చారట.
బాగానే ఉంది. మంత్రిగారికి పెద్దల పట్ల వినయం, భక్తిభావం ఉండటం మంచిదే. మరి అదే సూత్రం ప్రకారం.. టీడీపీ యువ ఎమ్మెల్యేలకు అదే విశాఖ ఎయిర్పోర్టులోనో, గన్నవరం ఎయిర్పోర్టులోనో, కుదిరితే బెంగ ళూరు ఎయిర్‌పోర్టులోనే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఎదురుపడిన సందర్భంలో.. ఉత్తరాంధ్ర మంత్రిగారు, ‘కులానుబంధం’తో బొత్స కాళ్లకు మొక్కిన మాదిరిగానే, టీడీపీ యువ ఎమ్మెల్యేలు కూడా అదే ‘కులానుబంధం’తో.. తమ కంటే వయసులో పెద్దవాడైన జగన్ కాళ్లు మొక్కితే, పార్టీ నాయకత్వం అంతే మౌనంగా ఉంటుందా అన్న ప్రశ్నలు తమ్మళ్ల నుంచి వినిపిస్తున్నాయి.
ఇంతకూ ఇది జరిగింది ఎప్పుడంటే.. ఇటీవలి అసెంబ్లీ సమావేశాల సమయంలోనట. గత రెండురోజుల క్రితం విశాఖలో ఎమ్మెల్యేలు ఓ ఫంక్షన్లో కలిసినప్పుడు వారి లోకాభిరామాయణంలో బొత్స కాళ్లకు తమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రిగారు కాళ్లు మొక్కిన వైనం దొర్లిందట. అదేదో సినిమాలో మీది తెనాలి.. మాది తె నాలే అన్న డైలాగ్ గుర్తుకువస్తే చేసేదేమీలేదు!