– ఇది ప్రజాపాలన కాదు .. రైతులను వేధించే పాలన
– వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: మూడెకరాలు ఉన్న రైతులకూ ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 44,82,265 మంది రైతుల ఖాతాలకు, 58.13 లక్షల ఎకరాల గాను రూ.3487.82 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మూడెకరాల లోపు రైతులకు ఎంతోమందికి రైతుభరోసా నిధులు విడుదల కాలేదు. మార్చి 31 వరకు అందరు రైతులకు రైతుభరోసా అందిస్తామని జనవరి 26న ప్రకటించారు. రైతు భరోసా కోసం భూములు తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు.
కేవలం రూ.3487.82 కోట్లు మాత్రమే రైతు. ఖాతాల్లో జమచేసి సాగదీస్తున్నారు. మూడెకరాల వరకు మాత్రమే రైతుభరోసా కుదించే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఐదెకరాల వరకు రైతుభరోసా ఇస్తామని లీకులు ఇస్తుంది. రాష్ట్రంలో 1.48 కోట్ల ఎకరాల భూమికి రైతుభరోసా అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 58.13 లక్షల ఎకరాల వరకు మాత్రమే ఇప్పటి వరకు రైతుభరోసా అందించింది.
ప్రభుత్వ ప్రకటనలకు, పథకం అమలుకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. పదేళ్లు ప్రగతిబాట పట్టిన తెలంగాణ వ్యవసాయం ఏడాది కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తున్నది. అన్నం పెట్టే అన్నదాతలు కాంగ్రెస్ పాలనలో మళ్లీ అధోగతి పాలవుతున్నారు. ఇది ప్రజాపాలన కాదు .. రైతులను వేధించే పాలన.
ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని రూ.12 వేలకు కుదించారు. రైతు భరోసా అమలు చేయడం చేతకాక రాష్ట్రంలో 1.20 లక్షల సర్వే నంబర్లు బ్లాక్ లిస్టులో పెట్టారు. ఆ సాయం కూడా రైతులకు అందించకుండా వేధించడం దారుణం.