సిద్ధాంతాలు..త్యాగాలు..
నీతి నియమాలు..
నమ్మిన ప్రజలకు కట్టుబడి ఉండే దీక్ష..
నీ నాయకత్వమే
ఆ ప్రజలకు రక్ష..
ఇదీ రాజకీయమంటే ఒకనాడు..!
రోజుకో వేషం..
పూటకో మోసం
వంతు వేసుకోవడం..
గొంతు కోయడం..
అవినీతి..అక్రమం..
వెన్నుపోట్లు..ఆటుపోట్లు..
వాడి కత్తి..కోడి కత్తి..
జైలుకెళ్లినా జాలీ..
వెళ్లి వచ్చాక కూడా
నీ మాయమాటలు నమ్మి
ఓటరు నీ పల్లకి మోసే కూలీ..
గెలిపిస్తుంది దిక్కుమాలిన ప్రజాస్వామ్యం
తను కుప్పకూలి..
ఇదే రాజకీయం నేడు..!
మన వ్యవస్థ..
మారిన రాజకీయంతో దురవస్థ..
ఆనాడు రాజకీయమంటే వేలిముద్ర..
ఇప్పుడు అవినీతికి రాజముద్ర..
పంచెకట్టు నేర్చింది కనికట్టు…
అదీ పోయి..
తెల్ల పేంటు..ఖద్దరు చొక్కా..
వేసేసి దోచేయడమే ఎంచక్కా..ఇప్పుడు కొత్తగా..
మండ చైను..
ఎనిమిది వేళ్ళకు
బాండ్రు కప్పంత ఉంగరాలు..
బొడ్డు దాకా
కుక్క చైనంత
లావుపాటి గొలుసు..
దానికో పులిగోరు..
తెల్ల చెప్పు..
ఆ చెప్పుచేతల్లో
తిరిగే అనుచరులు..
అక్రమాల సహచరులు..
రెండు పార్టీల్లోనూ తిరగ్గలిగే..
తినగలిగే ఉభయచరులు..!
రాజకీయాల్లో అరంగేట్రానికి
ముందే బానర్లతో తెరంగేట్రం..
పుట్టినరోజుకి ప్లెక్సీలు..
ప్రకటనలు దంచేసే ప్రాక్సీలు..
నోట మాట రాని నేత
నోరెత్తక మునుపే జేజేలు
కార్యకర్తలు భుజానికెత్తుకొని
బరువు మోసే పరంజీలు..
నిన్నటి వరకు మొహమే తెలియని నేతపై
రాత్రికి రాత్రే
చెప్పలేని మోహం..
ఇవన్నీ చూసి
ప్రతి గొట్టం గాడిలో
తానో మహానేతనైపోయాననే
పట్టలేని అహం..
ఈడెవడ్రా అని
జనం తేరుకునేలోగా
మన నేత అల్లుడేరా..
జర భద్రం
అంటూ హెచ్చరిక..
వెంటనే జైజై నాదాలతో
మారుమ్రోగిపోయే వేదిక..
మనదేశంలో
పరమపదసోపానానికి వారసత్వమేగా ప్రాతిపదిక..!
కొడుకులు..కోడళ్ళు..
కూతుళ్ళు..అల్లుళ్ళు..
తమ్ముళ్లు..చెల్లెళ్ళు..
సమర్థులో..అసమర్థులో
బామ్మర్దులు..
ఇలా వంతులు..
మధ్యలో వితంతులు…
మొత్తానికి చట్టసభలు
ఇలా కుటుంబాల కదంబాలు..
పగటి వేషగాళ్ళ వేడంబాలు..
ప్రతివాడు సొంత బలంతోనే
గెలుస్తున్నట్టు డంబాలు..!
నియోజకవర్గ అభివృద్ధి కంటే
తన వర్గ అభ్యున్నతికి
పెద్ద పీట వేసే నేత..
మానవ రూపంలోని పీత..
సారా నుంచివీధి పహారా వరకు..
ప్రతి కాంట్రాక్టు తనదే..
ప్రతి వ్యవస్థ పతనమే..
కళ్ళు మూసి తెరిచేలోగా
కోట్లకు పడగ..
ఆ కోట్లు ఖర్చు పెట్టి
మళ్లీ గెలుపు పండగ..
అసలు ఈ నేతల నీడే
పాము పడగ..
ఓ ఓటరూ..
ఇది తెలుసుకోని
నీ బ్రతుకు దండగ..!?
సురేష్ కుమార్
9948546286