– 80 సీటొస్తాయన్న సాక్షి బృందం
– సీమలోనే మీసం మెలేసిన వైసీపీ
– మిగిలిన జిల్లాలలో ‘అంతంతమాత్రమేనట’
– రాజధానిగా ప్రకటించిన ఉత్తరాంధ్రలో నిరాశనే
( అన్వేష్)
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎవరి అంచనాలు వేరు వేస్తున్నారు. సర్వే సంస్థలు రకరకాల ఫలితాలిస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఎవరి సర్వేలు వారు చేయించుకుంటున్నాయి. అయితే అధికార వైసీపీ మీడియా చేసిన సర్వేలేమిటి? వచ్చిన నివేదికలు ఏమిటన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొనడం సహజం. ఆ క్రమంలో వైసీపీ అధికార సాక్షి మీడియా బృందం, ఇటీవల యాజమాన్యానికి ఒక నివేదిక ఇచ్చిందట.
ఆ ప్రకారంగా.. రాయలసీమలోని ఉమ్మడి కడప-కర్నూలు-చిత్తూరు-అనంతపురం జిల్లాల్లోని 52 నియోజకవర్గాల్లో.. వైసీపీకి 35 సీట్లు రావచ్చని సాక్షి బృందం అంచనా వేసిందట. ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో, కేవలం 10 సీట్లే రావచ్చని నివేదిక ఇచ్చిందట. కృష్ణా-గుంటూరు జిల్లాల్లోని 33 నియోజకవర్గాల్లో 8 సీట్లు మాత్రమే దక్కవచ్చట. అంటే వైసీపీ అధికారంలోకి రావడం కష్టమని సొంత మీడియా బృందాలే తేల్చేసినట్లు స్పష్టవుతోంది. పైగా రాజధాని అంటూ ఊదరగొట్టిన విశాఖ -ఉత్తరాంధ్రలో వైసీపీ పనితీరు అంతంతమాత్రమేనని స్పష్టం చేసినట్టయింది.
ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 6, నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 6 స్థానాలు వైసీపీకి దక్కవచ్చని నివేదిక ఇచ్చిందని సమాచారం. విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోనే, వైసీపీకి రెండు నుంచి నాలుగుస్థానాలు రావచ్చని పేర్కొన్నట్లు తెలుస్తోంది. నంద్యాల జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3 సీట్లు టీడీపీకి రావచ్చని చెప్పిందట.
ఇదిలాఉండగా.. కడప కాంగ్రెస్ ఎంపీగా పోటీచేసిన జగన్ చెల్లెలు షర్మిలారెడ్డికి అనుకూలంగా భారీ స్థాయిలో క్రాస్‌ఓటింగ్ జరిగిందట. కడప-కమలాపురం-పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాల్లో , పూర్తి స్థాయిలో షర్మిలకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా కడప జిల్లాలోని 7 సెగ్మెంట్లలో ముస్లిం-క్రైస్తవులు, ఎక్కువ శాతం షర్మిలకే ఓటు వేసినట్లు నివేదిక ఇచ్చారట. ప్రతి చర్చిలోనూ షర్మిలకే ఓటు వేయాలని క్రైస్తవ మత పెద్దలు పిలుపునిచ్చారు.
ఇక క డపలో కాంగ్రెస్ నుంచి మైనారిటీ అభ్యర్ధి బరిలో నిలవడం, వైసీపీ అభ్యర్ధి కూడా ముస్లిం కావడంతో, అక్కడ మైనారిటీ ఓట్లు చీలి టీడీపీ అభ్యర్ధి గెలిచేందుకు కారణమవుతోందని పేర్కొన్నట్లు సమాచారం. అదీకాకుండా వైసీపీ అభ్యర్ధి సోదరుడు, హిందువులపై చేసిన వ్యాఖ్యలతో, హిందువులంతా పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చేందుకు కారణమయిందట. కడప జిల్లాలో 4 సీట్లు టీడీపీకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇక ఒంగోలు పార్లమెంటులో వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డికి, స్థానికేతరుడన్న కారణంతో ఆయనకు వ్యతిరేకంగా-టీడీపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా, భారీ స్థాయిలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నివేదించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీకి వైసీపీకి ఓటువేసిన వారంతా, పార్లమెంటుకు మాత్రం మాగుంటకు, క్రాస్ ఓటింగ్ చేసినట్లు నివేదించారట. అందుకు వైసీపీ అసెంబ్లీ అభ్యర్ధులు కూడా సహకరించారని తెలుస్తోంది.
అటు నెల్లూరు టీడీపీ అభ్యర్ధి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని, ఆయనకు అనుకూలంగా కూడా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు చెప్పారట. నర్సరావుపేటలో వైసీపీ అభ్యర్ధి అనిల్‌కుమార్‌యాదవ్‌కు ఓటేసిన యాదవులు, అసెంబ్లీకి మాత్రం టీడీపీ అభ్యర్ధులకే ఓటేసినట్లు నివేదిక సమర్పించినట్లు సమాచారం.
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్ధి బూడిముత్యాలనాయుడుకు, కొప్పుల వెలమ వర్గమంతా దన్నుగా నిలవడంతో ఆయన గెలవడం ఖాయమని, సాక్షి బృందం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. లోకల్-నాన్‌లోకల్, వెలమ-కొప్పుల వెలమ నినాదం వైసీపీ అభ్యర్ధికి అక్కరకొచ్చినట్లు వివరించారట. బూడి ముత్యాలనాయుడు బీసీ వెలమ, సీఎం రమేష్ ఓసీ వెలమ కావడమే దానికి కారణం.
పైగా బీజేపీ అభ్యర్ధి సీఎం రమేష్ వెంట.. గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, నిరుద్యోగులను మోసం చేసిన బీజేపీ నాయకులే ఎక్కువగా ఉండటం.. ఆయన కడప నుంచి ఎక్కువమందిని దిగుమతి చేసుకోవడం.. బీజేపీ స్థానిక నేతలను భాగస్వాములను చేయకపోవడం వంటి కారణాలు, వైసీపీని గెలిపిస్తాయని నివేదిక ఇచ్చారట. అయితే టీడీపీ బీజేపీ-జనసేన శ్రేణులు, బీజేపీ అభ్యర్ధికి పూర్తి స్థాయిలో సహకరించారట. బీజేపీ అభ్యర్ధి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ వైసీపీ అభ్యర్ది విజయం ఖాయమని స్పష్టం చేసిందట.
ఇక అనకాపల్లి పార్లమెంటు పరిథిలో వైసీపీ, 2 నుంచి 4 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. తర్వాత ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాలోనే వైసీపీకి సంతృప్తికర స్థానాలు వస్తాయని, శ్రీకాకుళంలో ఒకటి లేదా రెండు స్థానాలకు మించి వచ్చే అవకాశాలు లేవని, సాక్షి మీడియా బృందం నివేదిక ఇచ్చినట్లు సమాచారం.