– ఆ రోజంతా బాగా ఏడ్సిన
– కేంద్ర ఎన్నికల సంఘంపై ఆగ్రహం
– ఐటీకి బ్యాక్ బోన్‌గా హైదరాబాద్
– తెలంగాణ ‘ఫస్ట్ – ఇన్ సేఫ్టీ.. బెస్ట్ ఇన్ సెక్యూరిటీ’: కేటీఆర్
– రూ. 240 కోట్ల విరాళాలు
– అంగరంగ వైభవంగా టీఆర్‌ఎస్ ప్లీనరీ
టీఆర్‌ఎస్ ప్లీనరీ అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ సాధన కోసం చేసిన పోరాటాలు, ఆ సమయంలో తన అనుభవాలు, ఎదురైన తీపి-చేదు అనుభవాలు, తెలంగాణ సమాజం తనను నమ్మి తన వెంట నడిచిన వైనం.. విడిపోతే చెడిపోతారంటూ సమైక్యవాదులు చేసిన హెచ్చరికలు.. కరెంటు ఉండదన్న పాలకుల ఎద్దేవా.. తెలంగాణ సాధన కోసం ఒక్క రక్తపు చుక్క కూడా చిందించకుండా వ్యూహాత్మక ఎత్తుగడ.. ఇంకా.. ఎన్నో.. ఎన్నెన్నో.. అన్నింటినీ తెరాస దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ నిండుసభలో ఆవిష్కరించారు. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం మళ్లీ టీఆర్‌ఎస్ రావాలని పిలుపునిచ్చారు. శ్రేణుల్లో జోష్ నింపిన ప్లీనరీ ముచ్చట్లు ఇవీ..
ప్లీనరీ వేదికలో ఆశీనులైన టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులకు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్లీ ఒకసారి అద్యక్ష బాధ్యతలు చేపట్టివల్సిందిగా, ఏగక్రీమవంగా నన్ను ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2001, ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశ్రయం జలదృశ్యం ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని ఆవిష్కరించాము. ఆనాడు విపరీతమైన అపనమ్మక స్థితి. గమ్యం మీద స్పష్టత లేనటువంటి అగమ్య గోచర పరిస్థితి. ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్న అనుమానాలు, అపోహాలు, దుష్ప్రచారాలు.. రకరకాల అనుమానాస్పదస్థితుల మధ్య గులాబీ జెండా ఎగిరింది.
నాడు తెలంగాణ సమాజం విశ్వాసం లేనటువంటి స్థితిలో ఉంది. ఈ సమాజం ఆ స్థితి నుంచి బయటకు రావాలని మాట్లాడుకున్నాం. దేశ స్వాతంత్ర్య పోరాటం మహాత్మగాంధీ ఆధ్వర్యంలో సాగింది. స్వాతంత్ర్య సమరబాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి, వాటిని వాపస్ కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగింది. అయినా స్వాతంత్ర్య పోరాటం ఆగలేదు. విజయం సాధించింది. ఆ పంథాలోనే తెలంగాణ ఉద్యమం సాగింది. స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలా మంది మొదటి రోజు నుంచి నేటి వరకు పని చేస్తూనే ఉన్నారు.
సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్ర్యం.. రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికీ తెలంగాణ వచ్చి తీరుతుందిని అని నిర్ణయించుకున్నాం. అలా అనేక రకాలుగా పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాము. సమైక్యవాదులు అనేక అడ్డంకులు సృష్టించారు. చేయని ప్రయత్నం లేదు. వేయని నిందలు లేవు. పెట్టని తిప్పలు లేవు. ఎన్ని జేయాల్నో అన్ని చేశారు. చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు వివ్లేషించుకుంటూ ముందుకు సాగినం కాబట్టి విజయతీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకు కొత్త బాటను చూపాయి. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానాలపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆవేదనకు లోనయ్యారు. మహిళా సంక్షేమంపై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
ఓ సమావేశానికి వెళ్లే ముందు.. ఒక్క నిమిషం మాట్లాడుతామని చెప్పి ఇద్దరు బాలికలు తన వద్దకు వచ్చారు. మేము అనాథ పిల్లలం.. కేజీబీవీలో చదువుతున్నాం. టెన్త్ అయిపోతుంది. తర్వాత మేం ఎక్కడికి పోతామో తెలుస్తలేదు అని ఆ పిల్లలు చెప్పారని కేసీఆర్ పేర్కొన్నారు. తల్లిదండ్రులు లేరు. ఆదరించే బంధువులు లేరు. ఇది క్రూరమైన సమాజం.. ఎదిగిన ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలి. ఏం చేయాలి. ఆ రోజంతా నిద్ర పోలేదు.. బాగా ఏడ్సిన మనసులో అని కేసీఆర్ తెలిపారు. నిజంగా మన బిడ్డకే ఆ పరిస్థితి సంభవిస్తే.. మనం ఆ పరిస్థితిలో ఉంటే అని ఆలోచించాను. అనాథ పిల్లల కోసం ప్రభుత్వం త్వరలోనే మంచి కార్యాచరణను రూపొందించి తీసుకువస్తామన్నారు. కేజీబీవీలను ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ చేశాం. హాస్టల్స్‌ను పెంచుతున్నాం. అనాథ పిల్లలు స్టేట్ చిల్డ్రన్ కింద ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వమే అనాథలకు తల్లిదండ్రులు. వారిని ఆదరించాలి. అనాథ బిడ్డలు తారసపడితే వారిని చేరదీసి, కడుపులో పెట్టుకుని సాదుకోవాల్సిన అవసరం ఉంది అని సీఎం కేసీఆర్ అన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగాభారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాను.
కేసీఆర్ సభ పెట్టొద్దు ఇది ఏం కథ. ఇది ఒక పద్ధతా? కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ సభ పెట్టొద్దంటూ హైకోర్టులో కేసులు వేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. మన పార్టీ నాయకులు చాలా మంది హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ దళితులు అదృష్టవంతులు. ఈసీ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధు అమలు జరిగి తీరుతోంది. నవంబర్ 4 వరకు దళిత బంధు అమలును ఆపగలదు. హుజూరాబాద్‌లో గెల్లు శ్రీనివాస్ గెలిచి తీరుతాడు. గెల్లు శ్రీనివాస్ ను హుజూరాబాద్ ప్రజలు దీవించి, ఆశీర్వదిస్తారు. రాష్ట్రమంతటా దళిత బంధును అమలు చేస్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.రాబోయే ఏడేండ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ. 23 లక్షల కోట్లు ఖర్చు పెడుతామన్నారు. దళిత బంధుతోనే ఆగిపోం.. ఎన్నో కార్యక్రమాలు చేపడుతామన్నారు. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టాం. దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదు. దళిత బంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటునిస్తోందన్నారు. ఈ పథకం ద్వారా సంపద సృష్టి జరుగుతోంది. 75 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ ఆర్థికపరంగా కూడా శక్తివతంగా తయారైంది. టీఆర్ఎస్‌కు కూడా విరాళాలు సమకూరాయి. రూ. 240 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల విరాళాలు ఉన్నాయి. చట్టబద్ధమైన విరాళాల ద్వారా పార్టీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు.
అమెజాన్‌కు ఆయువుపట్టు హైదరాబాద్ : కేటీఆర్
హైదరాబాద్ నగరం గూగుల్‌కు గుండెకాయ, అమెజాన్‌కు ఆయువుపట్టులాంటిదని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్లీనరీలో మంత్రి పాలన సంస్కరణలు, విద్యుత్, ఐటీ, పారిశ్రామికాభివృద్ధిపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా గతేడాదిన్నర క్రితం కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించిందని, ఈ సందర్భంగా ఏరకమైన కార్యక్రమాలు చేస్తే నవభారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వండని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని ప్రధాని ఆహ్వానించారన్నారు.
పార్టీ తరఫున కార్యనిర్వహక అధ్యక్షుడిగా తాను సమావేశానికి హాజరయ్యానని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ‘త్రీ ఐ’ మంత్రా నడుస్తుందని చెప్పినట్లు గుర్తు చేశారు. ‘త్రీ ఐ’ అంటే ఇన్నోవేషన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌క్లూసివ్ గ్రోత్ అని, ఈ మూడింటిని దేశవ్యాప్తంగా అమలు చేయగలిగితే ఖచ్చితంగా నయా భారత్‌ను కొత్త తరానికి అందివచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు.
గడిచిన ఏడు సంవత్సరాల్లో ఎన్నో రకాల పరిపాలన సంస్కరణలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వం ఆవిష్కృతమయ్యాయన్నారు. పాలకుల, అధికారులతో చేతిలో దశాబ్దాలుగా బందీ అయిన అధికారాన్ని ప్రజల చేతికి అందించడం, సంక్షేమ అభివృద్ధి ఫలాలు నిరాటంకంగా పేదలు, బలహీన వర్గాలకు అందించడంతో పాటు వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడమే సంస్కరణ ఉద్దేశమన్నారు. ఆ ఆశయంతో సీఎం సారథ్యంలో తెలంగాణలో చేపట్టిన సంస్కరణల పర్వంలో సువర్ణ అధ్యాయాలు ఎన్నో ఎన్నోన్నో ఉన్నాయన్నారు.
పరిపాలన సంస్కరణకు ప్రాణాధారం సరైన సమాచారం అని, ప్రజలకు సంబంధించిన సమాచారం లేనిదే ఏ ప్రభుత్వం కూడా ఏరకమైన కార్యాచరణను ప్రారంభించి విజయవంతం చేసే అవకాశం ఉండదని, అందుకే తెలంగాణ పరిపాలన పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ‘సమగ్ర కుటుంబ సర్వే’ యజ్ఞానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకే రోజులో భారతదేశం అబ్బురపడేలా తెలంగాణ ప్రజల బ్రతుకు చిత్రాన్ని గణాంకాలతో సహా సేకరించడంలో దేశ చరిత్రలో ఒక కొత్త సంచలనానికి, ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నారు.
గతంలో దేశంలోని ఎంతో మంది ప్రముఖులను కలిసిన సందర్భంలో ఒక మాట అనేదని.. ‘వాట్ బెంగాల్ థింక్స్ టుడే.. ఇండియా విల్ థింక్స్ టుమారో’ (ఈ రోజు బెంగాల్ ఆలోచించేది.. రేపు దేశం ఆలోచిస్తుంది) అనేది అప్పటి నానుడి.. కానీ ఈ రోజు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ‘వాట్ తెలంగాణ డజ్ టుడే.. ఇండియా డజ్ టుమారో’ (ఇవాళ తెలంగాణలో జరిగేది.. రేపు దేశవ్యాప్తంగా జరుగుతుంది) అనేలా.. సగర్వంగా విజయ ప్రస్థానం కొనసాగిస్తుందన్నారు. సంక్షేమ పథకాలే కాదు.. సంస్కరణ ఫలాలు తెలంగాణ ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
ఈ ఏడున్నరేళ్ల ప్రస్థానం.. సంస్కరణలకే స్వర్ణయుగం అన్నారు. కొత్త రాష్ట్రమే కాదు.. సరికొత్తగా పది జిల్లాలు ఉన్న తెలంగాణను అధికార వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందాలనే ఉద్దేశంతో 33 జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను పెంచినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదర్శ గ్రామం అంటే.. గంగదేవిపల్లె పేరు చెప్పేవారని.. కొత్త పంచాయతీరాజ్ చట్టంతో పల్లె ప్రగతి కార్యక్రమంలో నిధులు, విధులతో ప్రతి పల్లె ఆదర్శ పల్లెగా కేంద్రప్రభుత్వం స్వయంగా గుర్తించి, అవార్డులు అందజేస్తుందన్నారు. మున్సిపాలిటీల్లో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవినీతిని కొత్త మున్సిపల్ చట్టంతో కడిగేసే బ్రహ్మాస్త్రంగా తీసుకువచ్చారన్నారు.
శాంతిభద్రలు పటిష్టంగా ఉంటానే రాష్ట్రం సురక్షితంగా ఉంటుందన్నారు. గతంలో రాష్ట్రంలో కేవలం పోలీస్ కమిషనరేట్లు ఉంటే.. ఇప్పుడు తొమ్మిది కమిషనరేట్లతో.. దేశంలోనే లా అండ్ ఆర్డర్‌లో తెలంగాణ ‘ఫస్ట్ ఇన్ సేఫ్టీ.. బెస్ట్ ఇన్ సెక్యూరిటీ’ అనే విధంగా గొప్ప పేరుతెచ్చుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం తలపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం 95శాతం పూర్తయిందని, యాజమాన్య హక్కులపై స్పష్టత వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు.. ఇతర రాష్ట్రాలకే కాదు దేశవ్యాప్తంగా దిక్సూచి అన్నారు. త్వరలోనే సమగ్ర భూ సర్వే నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అక్షాంశాలు, రేఖాంశాలతో భూమి గుర్తించి, పాస్‌పుస్తకాలు అందజేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లునిరంతర విద్యుత్‌తో నిరంతర సంపద సృష్టి జరుగుతోందని, పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ వస్తే ఉద్యోగాలు రావన్నారని, ఉన్న పెట్టుబడులు పోతాయని వెక్కిరించారని.. టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు కంపెనీలు క్యూకట్టాయన్నారు. ఒకప్పుడు విమర్శించిన వారే.. ప్రశంసిస్తున్నారన్నారు. తయారీ పరిశ్రమలో తెలంగాణకు ఎదురులేదని, ఫార్మా రంగంలో అగ్రస్థానంలో ఉన్నట్లు చెప్పారు. టీకాల ఉత్పత్తిలో ప్రపంచానికి రాజధానిగా మారామని, నాడు ఆగమైన తెలంగాణ నేడు దేశానికి ఆదర్శమైందన్నారు. ఉపాధి అవకాశాలకు తెలంగాణ అక్షయపాత్ర అయిందని, గతంలో ఐటీకి హైదరాబాద్ బ్యాక్ ఆఫీస్‌గా ఉండేదని, ఇవాళ హైదరాబాద్ బ్యాక్ బోన్ అయ్యిందన్నారు. గూగుల్‌కు గుండెకాయ.. అమెజాన్, ఆపిల్‌కు ఆయువుపట్టు హైదరాబాద్ అన్నారు. ఫేస్‌బుక్ ఫస్ట్ ఫేవరెట్ డెస్టినేషన్ హైదరాబాద్ అని కేటీఆర్ అన్నారు.