Suryaa.co.in

Telangana

బట్టి పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం

-ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు ఆలకిస్తూ నడిచిన భట్టి విక్రమార్క
-పాదయాత్రలో సమస్యలు ఏకరువు పెట్టిన ఆయా గ్రామాల ప్రజలు
-మీ సమస్యలు తీర్చడానికే ఈ పాదయాత్ర: భట్టి

ప్రజా సమస్యల పరిష్కారానికై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు ఇచ్చోడ నుంచి సిరికొండ గ్రామం వరకు కొనసాగింది. ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర దూపార్ పేట్, పట్వారి గూడెం, మాదాపూర్, పొన్న, రాయిగూడ, సుంకిడి, జాకీర్ గూడా మీదుగా సిరికొండకు మొత్తం 17 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రజలు పాదయాత్రకు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి వీర తిలకం దిద్ది తమ మద్దతు తెలిపారు. విద్యార్థులు యువకులు రైతులు కూలీలు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కావాలని భట్టి విక్రమార్కతో కలిసి కదం తొక్కారు.

అభివాదం చేస్తూ….. సమస్యలు ఆలకిస్తూ
రెండో రోజు చేపట్టిన భట్టి విక్రమార్క తన పాదయాత్రలో ప్రజలకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇచ్చోడ బస్టాండ్ వద్ద రోడ్డు పక్కన చెప్పులు కుడుతున్న కార్మికుని వద్దకు వెళ్లి ఆయన సమస్యలు అడిగారు 9వ తరగతి వరకు చదువుకున్న తనకు ఎలాంటి ఉపాధి అవకాశం లేకపోవడంతో రోడ్డు పక్కన ఇలా చెప్పులు కుడుతూ కుటుంబాన్ని సాకుతున్నానని వెల్లడించాడు. ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా అని అడగగా ఇప్పటివరకు తనకు ఎలాంటి సహకారం అందలేదని, ఉండడానికి కూడా సొంత ఇల్లు లేదని తన పరిస్థితిని వెలిబుచ్చాడు. ప్రభుత్వం ముద్ర లోన్ ఇస్తుంది కదా అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయనను అడుడగా ఎన్నిసార్లు దరఖాస్తు పెట్టుకున్న తనకు రాలేదని చెప్పులు కుట్టే కార్మికుడు బాలాజీ ఈశ్వర్ ముకుంద్ చెప్పారు. ఇచ్చోడ బస్టాండ్ సమీపంలో ఆటో డ్రైవర్లతో భట్టి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల తమకు ఎలాంటి గిట్టుబాటు కావడం లేదని రోజువారి కూలీ కూడా రావడం లేదని ఆటో డ్రైవర్లు తమ బాధలను వెలిబుచ్చారు. కాంగ్రెస్ హయాంలో డీజిల్ పెట్రోల్ ధరలు తక్కువ ధరలు ఉన్నందున ఆటో నడుపుకుంటే రోజుకు వెయ్యి రూపాయల వరకు గిట్టుబాటు అయ్యేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని దీంతో అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్ షేక్ జావిద్ తన ఆవేదన వెలిబుచ్చాడు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్న షేక్ మొహిష్ పాదయాత్ర చేస్తున్న భట్టి విక్రమార్క కు ఎదురొచ్చి తన దుకాణం వద్దకు తీసుకువెళ్లి తన దీన పరిస్థితిని వెలిబుచ్చాడు.

సార్ వాన కొడితే మునుగుతుంది
ఇచ్చోడ నుంచి దూపార్ పేట్, గ్రామానికి చేరుకున్న భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ప్రజలు ఎదురొచ్చి స్వాగతం పలికి తమ సమస్యలను ఏకరువు పెట్టారు. భారీ వర్షం వచ్చినప్పుడు 200 గృహాలు ఉన్న ఈ గ్రామం పూర్తిగా వరదలతో మునిగిపోతుందని చెప్పారు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్న పేరిట అధికారులు ఫంక్షన్ హాల్ లో పెట్టి తిండి కూడా సరిగ్గా పెట్టరని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందాల్సిన పునరావస సహాయం కూడా అందలేదని గ్రామానికి చెందిన రుక్మిణి ములుగు భాయ్ అనసూయ అమృత తమ బాధలను చెప్పుకున్నారు. వంట గ్యాస్ పెరిగి కొనలేని పరిస్థితిలో కట్టెలు తెచ్చుకుందామని అడవికి పోతే ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని మేము ఎట్లా బతకాలని దేశ్ముఖ్ సుగుణ బాయ్ తన ఆవేదనను వినిపించింది. కాంగ్రెస్ హయాంలో 400 ధర ఉన్న సిలిండర్లు మోడీ ప్రభుత్వం 1250 చేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తించే మీకోసమే ఈ యాత్ర చేస్తున్నానని భట్టి విక్రమార్క వారికి వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చతిస్గఢ్లో ఇస్తున్నట్టుగా 500 కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు.

శిథిలమైన పాఠశాల సందర్శన
పట్వారి గూడెం లో పూర్తిగా చిత్రమైన ప్రాథమిక పాఠశాలను పాదయాత్రలో భాగంగా భట్టి విక్రమార్క సందర్శించారు. పూర్తిగా అద్వాన స్థితిలో ఉన్న పాఠశాలను చూసిన ఆయన ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.

ముత్తవ్వ ఐదు లక్షలు ఇచ్చి ఆదుకుంటాం: భట్టి
మాదాపూర్ గ్రామానికి చెందిన ముత్తవ్వ, చిన్నయ్యలు పాదయాత్రకు వస్తున్న భట్టి విక్రమార్క కు ఎదురు వచ్చి పశువుల కొట్టం కంటే అద్వానంగా ఉన్న తమ రేకుల ఇండ్లను చూపించి విలపించారు. కరల సాయంతో రేకులు వేసుకొని అడ్డంగా తడకలు కట్టుకొని బతుకుతున్న వారి దీనమైన జీవనస్థితిని చూసి విక్రమార్క చలించిపోయారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కొరకు దరఖాస్తు పెట్టుకున్నారని వారిని అడగ్గా ఎన్నిసార్లు పెట్టుకున్న తమను ఆదుకున్న వారే లేరని వారు వాపోయారు. ముత్తవా నువ్వు అధైర్య పడకు నీలాంటి వారి కోసమే నేను పాదయాత్ర చేస్తున్న. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ ఆమె దగ్గరగా నినాదాలు చేసి బట్టి విక్రమార్క తో కలిసి వారి కుటుంబ సభ్యులందరూ గ్రామంలో పాదయాత్రలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE