ప్రకృతిని కబ్జా చేసే వారిని అడ్డుకోవాలి

Spread the love

• నదులు, చెరువులు, కొండలు, గుట్టలను ఆక్రమించేస్తున్నారు
• ఈ దురాక్రమణలతో మానవాళికి చేటు
• కులాల కుమ్ములాటలకు దూరంగా ఉండాలి
• భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

గుంటూరు: ప్రకృతిని దురాక్రమించే వారిని అడ్డుకోవడం అత్యవసరమని భారత పూర్వ ఉపరాష్ర్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. ప్రకృతిని ప్రేమిస్తేనే అది మనల్ని ప్రేమించి రక్షిస్తుందని స్పష్టం చేశారు. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టుపెట్టి, పశువుకు దండం పెట్టే పవిత్ర జాతి భారత జాతి అని, ప్రక్రుతితో మమేకమైన జీవనం మనది అని చెప్పారు. సోమవారం వెంకయ్యనాయుడు గుంటూరు, గోరంట్లలోని భాష్యం విద్యాసంస్థల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఇటీవల కాలంలో నదులు, చెరువులు, కొండలు, గుట్టలు ఆక్రమణకు గురవుతున్నాయని, ఆక్రమణలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు. ప్రకృతి సజీవంగా ఉంటేనే మానవాళి సజీవంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వెంకయ్యనాయుడు పలు విలువైన సూచనలు చేశారు.

కులం కన్నా గుణం మిన్న అని చెబుతూ ‘‘కులాల కుమ్ములాటల్లోకి దూర వద్దు. కులాల పేరుతో వ్యాకులం వద్దు. వివిధతా మే ఎకతా, భారత్ కా విశేషతా. ఇండియా ఈజ్ వన్. భాషలు, కులాలు వేరు కానీ మనమందరం భారతీయులం’’ అని విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ అలవర్చుకోవాలని వెంకయ్యనాయుడు చెప్పారు.

క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థానాలు అధిరోహిస్తారని అన్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని ఆ దిశగా ఇష్టపడి, కష్టపడి పని చేయాలని, ఏ పనయినా ఇష్టపడి, కష్టపడి చేస్తే నష్టపోయేది ఏమీ లేదని చెప్పారు. తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చానని, తన తండ్రి పదోతరగతి దాటలేదని చెబుతూ తాను ఇష్టపడి, కష్టపడ్డానని, అందుకే దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ర్టపతి స్థానాన్ని చేరుకోగలిగానని చెప్పారు.

జీవితంలో ర్యాంకుల సాధన, ఉన్నత పదవుల అధిరోహణకు మాత్రమే పరిమితం కారాదని, వాటికి తోడు ఉన్నత సంస్కారం అలవర్చుకోవాలని స్పష్టం చేశారు. ఉన్నతస్థానాలకు చేరుకునే వారు చాలా మందే ఉంటారని, కానీ ప్రజలు అందరినీ గుర్తుపెట్టుకోరని, అబ్దుల్ కలాం, వాజ్ పేయీ లాంటి వారి పేర్లే గుర్తుంటాయని చెప్పారు. కారణం వారి సంస్కారం మాత్రమేనని అన్నారు.

మనిషి సంఘ జీవి అని, జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవడంతో పాటు సమాజహితం కోసం పని చేయాలని , ఈ స్వభావాన్ని చిన్ననాటి నుంచే అలవర్చుకోవాలని విద్యార్థులకు వెంకయ్యనాయుడు సూచించారు. కొండా వెంకటప్పయ్య పంతులు, నడింపల్లి వెంకట నరసింహారావు, ఆచార్య రంగా, జూపూడి యజ్ననారాయణ వంటి వారు దేశం కోసం, జనం కోసం పని చేసి వారి గుండెల్లో నిలిచిపోయారని గుర్తు చేశారు. దివంగత ఎన్టీ రామారావు తన నటన ద్వారా అశేష జనావళిని మెప్పించారని, ప్రజలను ఒప్పించి, మెప్పించి రాజకీయాల్లో చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు. చదువుకున్న వేల మందిని రాజకీయాలకు పరిచయం చేసి, సమాజం కోసం ఎన్నో మంచి పనులు చేసి గుర్తుండి పోయారని, తరతరాలకు గుర్తుండి పోతారని చెప్పారు.

విద్యార్థులందరూ సమాజం కోసం పని చేసి ఇలా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలన్నారు. జీవితంలో ఏ దశలో ఉన్నా అంకిత భావంతో పని చేస్తేనే ఆ పని పరిపూర్ణమవుతుందని చెప్పారు. చదువు కేవలం డిగ్రీ కోసమో, ర్యాంకుల కోసమో కాదని విజ్ఞానం కోసం, వివేకం కోసం అని చెప్పారు. వివేకమంటే మంచి, చెడుల విచక్షణ అని చెప్పారు. భాష్యం విద్యాసంస్థల ఎదుగుదలకు నిర్వాహకులు, అధ్యాపకులలోని క్రమశిక్షణ, అంకితభావమే కారణమని అన్నారు.

‘‘షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ’’ అని స్పష్టం చేస్తూ మనకున్న సంపదను, విజ్ఞానాన్ని పది మందితో పంచుకుంటే అవి ఇంకా పెరుగుతాయని చెప్పారు. ‘‘పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి, ఆదికాలం నుంచి వేద కాలం వరకు మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి, మనకు అందించిన సంస్కృతి, ‘పక్కవారితో పంచుకో, మమకారం పెంచుకో’, ఈ సంస్కృతిని కొనసాగించాలి.’’ అని సూచించారు. ‘‘రొట్టెను మనమే తింటే అది ప్రకృతి, పక్కవారిది లాక్కుంటే అది వికృతి, పంచుకుంటే అదే మన సంస్కృతి’’ అని కరతాళధ్వనుల మధ్య భారతీయ సంస్కృతి గురించి విఫులంగా చెప్పారు.

ఒకప్పుడు భారత్ విశ్వగురు స్థానంలో ఉండేదని, నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలకు ప్రపంచంలో వివిధ ప్రదేశాల నుంచి విద్యార్జనకు వచ్చే వారని, మళ్లీ ఆ స్థానానికి భారత్ చేరుకోవాలని, నేటి తరం విద్యార్థులతో అది సాధ్యమేనని చెప్పారు.

‘‘ప్రపంచంతో మన దేశం పోటీ పడుతోంది. చంద్రయాన్ విజయం దిశగా సాగుతోంది. శాస్ర్తవేత్తలకు వందనం. ప్రపంచంలో పలు దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా ఉన్నారు. వారిలో తెలుగువారూ ఉన్నారు. ఇక్కడి నేలలో, నీటిలో ప్రకృతిలో ప్రత్యేకత ఉంది. అందుకే మన వారు ఉన్నతస్థానాలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే భారత్ ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా అవతరించడం తథ్యం. భారత్ మరింత శక్తిమంతం కావాలి. భారత్ శక్తిమంతం కావడం మరెవరినో పరిపాలించడానికి కాదు. విజ్ఞానాన్ని, వివేకాన్ని పంచడంకోసం. సామ్రాజ్యవాదం కోసం కాదు. ఆ స్వభావం మనకి లేదు. మనది కాదు.’’ అని విశదీకరించారు.

మాతృమూర్తిని, మాతృ భూమిని, మాతృ భాషను, గురువును ఎన్నటికీ మరవరాదని విద్యార్థులకు శ్రీ వెంకయ్యనాయుడు సూచించారు. మాతృ భాషలో నేర్చుకుంటే విషయం సులువుగా, నేరుగా అర్థమవుతుందని, ఇప్పడు అంతా ఆంగ్ల మాధ్యమం మోజులో పడ్డారని, ఆంగ్లంలో బోధన ఉంటే తొలుత ఆ భాషను నేర్చుకుని, ఆ తర్వాత విషయం నేర్చుకోవాల్సి వస్తుందని ఇది ప్రయాసతో కూడుకున్న పని అని చెప్పారు.

ఆంగ్లం వస్తేనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారన్నది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు. దేశంలోనే ఉన్నత పదవిని అలంకరించిన ప్రస్తుత రాష్ర్టపతి ద్రౌపది ముర్ము, ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న మన ప్రధాని నరేంద్రమోదీ, దేశంలో రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన ఉపరాష్ర్టపతి పదవీ బాధ్యతలు చేపట్టిన తాను, దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించిన జస్టిస్ ఎన్.వి.రమణ మాతృ భాషలోనే విద్యాభ్యాసం చేశామని గుర్తు చేశారు.

విదేశీ దండయాత్రలతో భారత్ పై పరాయి సంస్కృతి రుద్దారని, అలా మొదలయిన ఆంగ్ల భాష బానిసత్వం ఇప్పటికీ కొంత కొనసాగుతోందని, దాన్ని వదిలిపెట్టాలి అని సూచించారు. విదేశీ వ్యామోహం వదిలి, అణువణువునా భారతీయతను నింపుకోవాలని సూచించారు. ‘‘మన పండగలు, మన భాష, మన యాస, మన గోస, మన ఆటా, మన పాటా,మన కట్టూ, మన బొట్టూ అవన్నీ మన సంప్రదాయాలు. అవే మన గుర్తింపు. వాటిని పదిలంగా కాపాడుకోవాలి.’’ అని చెప్పారు.‘‘తొలుత అమ్మ భాష. తర్వాత సోదర భాష, ఆ తర్వాతే పరాయి భాష. భాషలను బలవంతంగా రుద్ద కూడదు. వ్యతిరేకించకూడదు. నో ఇంపోజిషన్, నో అపోజిషన్ దట్ ఈజ్ ప్రపోజిషన్.’’ అని విద్యార్థులు, తల్లిదండ్రుల కరతాళ ధ్వనుల మధ్య చెప్పారు.

విద్యార్థులు చదువుతో పాటు దేహ దారుఢ్యం పెంచుకోవాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం శక్తిమంతం అవుతుందని చెప్పారు. ‘‘ఆరోగ్యవంతమైన దేశమే, భాగ్యవంతమైన దేశం’’ అని చెప్పారు. ‘‘చక్కని జీవనశైలిని అలవర్చుకోండి. సూర్యోదయం కన్నా పూర్వమే లేచి దినచర్య ప్రారంభించండి. యోగా, వ్యాయామం అలవర్చుకోండి. ఇంట్లోనే వండిన మంచి భోజనం చేయండి. ఆహారంలో సిరిధాన్యాలను భాగంగా చేసుకోండి. సూర్యాస్తమయం అవుతూనే దినచర్యకు విరామం ఇవ్వండి. త్వరగా నిద్రపోండి. ఎలక్ర్టానిక్ గాడ్జెట్ లను అవసరమయినంత వరకు మాత్రమే వాడండి. వాటికి బానిసలు కావద్దు.’’ అని హిత వచనాలు పలికారు.

విద్యార్థులు, యువతతో ముచ్చటించడం, వారిని కార్యోన్ముఖులను చేయడం తనకెంతో ఇష్టమైన వ్యాపకమని చెప్పారు. ‘‘ మీటింగ్, గ్రీటింగ్, ఈటింగ్ విత్ యంగర్ జనరేషన్ అనేది నాకు ఇష్టమైన వ్యాపకం. బాల్యం, యవ్వనం ఎంతో అమూల్యమైనవి, విలువైనవి. ఎంతో ఉత్సాహాన్ని, ప్రేరణను, ప్రేమను, అభిమానాన్ని పంచేవి. విద్యార్థి దశ ఎంతో ముఖ్యమైనది. అవకాశం వస్తే మరోసారి పదో తరగతి విద్యార్థి కావాలనుకుంటున్నా. మీతో కలిసి నడుస్తుంటే నాకు బాల్యం గుర్తుకొస్తోంది.

నాకు పదవీ విరమణే కానీ పెదవీ విరమణ లేదు. దేశ వ్యాప్తంగా అందరినీ కలుసుకుంటూ, ముచ్చటిస్తూ అభిప్రాయాలను పంచుకుంటూ, ఆప్యాయతను పంచుకుంటూ ఉంటాను. నేను ఎన్ని పదవులు చేప్పటినా ఈ అలవాటు వదల్లేదు. యువతీ యువకులే భవిష్యత్తు, మీ మొహాల్లో అది చూస్తున్నా. ’’ అని విద్యార్థుల హర్షాతిరేకాలు, కరతాళ ధ్వనుల మధ్య వెంకయ్యనాయుడు తన మనోగతాన్ని పంచుకున్నారు.

అంతకు ముందు జేఈఈ అడ్వాన్సుడులో అఖిల భారత స్థాయిలో ఐదో ర్యాంకు, పదో ర్యాంకు సాధించిన భాష్యం విద్యార్థులు ఎ.వి.శివరామ్, వై.వి.మహేందర్ రెడ్డిని వెంకయ్యనాయుడు అభినందించి, ఆశీర్వదించి జ్ఞాపికలు అందజేశారు. ఇలాంటి ప్రోత్సాహ కార్యక్రమాలు మిగిలిన అందరి విద్యార్థుల్లో స్ఫూర్తిని, ప్రేరణను కలిగిస్తాయని చెబుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ భాష్యం రామ కృష్ణ, వైస్ ఛైర్మన్ భాష్యం హనుమంతరావు, సలహాదారు మైఖేల్, త్రివేణి స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరిని వెంకయ్యనాయుడు అభినందించారు.

Leave a Reply