– ప్రజలను నమ్మించి మోసం చేసిన జగన్
– మంత్రుల సబ్ కమిటీ నివేదిక ఏమైంది?
-రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ కి మూడో స్థానం
అయోధ్య మాదిరిగానే -అమరావతిలో రాజధానిని నిర్మించి తీరుతాం
-భీమవరంలో అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెంది, వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మరలచడానికి మూడు రాజధానులు అంశం తీసుకువచ్చారని, ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య వైశ్యామ్యాలు సృష్టించి గొడవలు పెట్టడం సరికాదన్నారు బిజెపి జాతీయ కార్యదర్శి వై. సత్య కుమార్. అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో మాట ఇచ్చి… అందరికంటే ముందుగా అమరావతిలో ఇల్లు కట్టుకుని అందరినీ నమ్మించి జగన్మోహన్ రెడ్డి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. అమరావతిలో అవినీతి జరిగితే.. బయటకు తీయాల్సిన బాధ్యత మీ మీదే ఉందన్నారు. మంత్రులు సబ్ కమిటీ నివేదిక ఏమైందని ప్రశ్నించారు. అవినీతి చేసిన వారిని శిక్షించాలి, స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులను దగా చేయవద్దన్నారు. పరిపాలన వికేంద్రీకరణ నిర్వచనం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదు. పరిపాలన వికేంద్రకరణ కాదు అన్ని ప్రాంతాలు అభివృద్ధి వికేంద్రీకరణ చేయమని ప్రజలు కోరుతున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం సుమారు 50 కేంద్ర సంస్థలు, విద్యాసంస్థలు రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో నెలకొల్పుతూ అభివృద్ధి కేంద్రీకరణ చేసి చూపించిందని సత్య కుమార్ పేర్కొన్నారు. ఎన్.సి.ఆర్ రిపోర్ట్ ప్రకారం రైతులు అత్యధికంగా ఆత్మహత్య చేసుకున్న జాబితాలో ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానంలో ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్వాహా చేశారని చెప్పారు.
మూడున్నర సంవత్సరాల కాలంలో హైకోర్టును కర్నూలుకు మార్చమని కోరుతూ ఒక్క ప్రతిపాదన లేఖ రాయలేదని విమర్శించారు. పవిత్ర నదుల నుండి, పవిత్ర స్థలాల నుండి మట్టిని తెచ్చి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా శంకుస్థాపన చేసిన అమరావతి బిజెపి శ్రేణులకి పవిత్రమైనదన్నారు. దశాబ్దాల పాటు పోరాటం చేసి అయోధ్యలో భవ్యమైన దేవాలయం నిర్మించినట్టే… పవిత్రమైన అమరావతిలో రాజధాని నిర్మించి తీరుతామని ప్రకటించారు.
ముఖ్యమంత్రి, మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని అభివృద్ధి వీరి డిక్షనరీలోనే లేదని, సంక్షేమ పథకాలు గురించి చెప్పేదంతా గారడి మాటలు, కాకి లెక్కలు అని విమర్శించారు.
ధర్మ యాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దండయాత్ర చేస్తామనడం సరికాదన్నారు. బిజెపి అండగా నిలుస్తుందని, రైతులును కంటికి రెప్పలా కాపాడుకుంటుందని ప్రకటించారు. రాష్ట్ర మంత్రులు, నాయకులు సంయమనంతో మాట్లాడాలని సత్య కుమార్ సూచించారు.