‘నారా చంద్రబాబుకు తెలంగాణలో రాజమార్గం’..

మళ్ళీ ‘టిడీపి’కి జీవం పోయనున్న నాయకులు..
పార్టీ వీడిన సీనీయర్లు టీడిపి వైపు మొగ్గుచూపుతున్నారు..
ఆంధ్రా పార్టీగా టీడీపీకి ముద్రవేసిన కేసీఆర్ ఇక ఆ పార్టీ మీద విమర్శలు చేయలేరు
కారణం ప్రాంతీయవాదానికి కాలం చెల్లడంతో జాతీయవాదాన్ని అందుకున్నామని గతించిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన లీడర్లు చెప్పడం గమనార్హం.

కులం, మతం, ప్రాంతం చాలా సున్నితమైనవి. వాటికి భావోద్వేగాలను జోడిస్తే ఆలోచనాశక్తి లోపిస్తుంది. ఫలితంగా వ్యక్తిగత లబ్దిపొందొచ్చనే సిద్ధాంతాన్ని కేసీఆర్ ఇప్పటి వరకు నడిపారు. రెండుసార్లు సెంటిమెంట్ ను రెచ్చగొట్టడం ద్వారా తెలంగాణకు సీఎం అయ్యారు. ప్రత్యేక తెలంగాణ సెంటిమెంట్ కు భావోద్వేగాలను జోడించడం ద్వారా అనూహ్య ఫలితాలను అన్ని విధాలుగా ఆయన పొందారు. ఆర్థిక స్వేచ్ఛ అంశంలో ఆకాశానికి ఎదిగిన ఆయన ఇప్పుడు విశాలదృక్పదాన్ని అందుకున్నారు.
ఒకప్పుడు ఆంధ్రోళ్లు దోపిడీదారులంటూ తెలంగాణ జనాన్ని రెచ్చగొట్టారు.ప్రాంతీయ విద్వేషాల్ని తారాస్థాయికి తీసుకెళ్లారు.

దశాబ్దాలుగా కలిసున్న తెలుగు వాళ్లను పరస్పర శత్రువుల్లాగా మార్చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిదికాదని ఆనాడు పదేపదే చెప్పిన చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పుడు అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటలను అటూఇటూ తిప్పుతూ తెలుగు వాళ్ల అలయ్ బలయ్ సూత్రాన్ని కేసీఆర్ సూత్రీకరిస్తున్నారు. ‘బీఆర్ఎస్’ స్థాపనతో తెలంగాణ జనం తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని టాక్‌.. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు 1996 నుంచి 2004 వరకు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు.

ఆనాడు ఆయన వేసిన పునాదులపై నిర్మితమైన సంపన్న తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి ఏపీ రెవెన్యూ మొత్తాన్ని హైదరాబాద్ లోనే కేంద్రీకరించడం ద్వారా ఇప్పుడు సిరుల పంట కురుస్తోంది. పేదోడు కూడా కోట్లకు అధిపతులుగా ఉన్నారంటే ఆనాడు ఉమ్మడి ఏపీ రెవెన్యూను హైదరాబాద్ చుట్టుపక్కల కుమ్మరించడమే. విజన్ 2020 కళ్లకు కట్టినట్టు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తోంది. ఇదంతా చంద్రబాబు చలువేనంటూ చెప్పుకోవడం ప్రారంభం అయింది. అందుకే
టీడీపీ పూర్వ వైభవం కోసం తెలంగాణలో కొత్త ఎత్తుగడతో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతోంది.
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ గురించి చంద్రబాబు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
అంటే, దాన్లో ఎన్నో రాజకీయ కోణాలను వెదుక్కోవచ్చు. రెండు దశాబ్దాల క్రితమే కేసీఆర్ అంటే ఏమిటో జనానికి బాబు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పిన మాటలు వాస్తవరూపంలోకి వచ్చాయి.
బహుశా ఆ చిరునవ్వు అందుకేనేమో..!
తెలుగు వాళ్ల ఐక్యత, ఆత్మగౌవరం కోసం పోరాడిన పార్టీ టీడీపీ..!
దాన్ని కాదని వెళ్లిన తెలంగాణ జనం తప్పు తెలుసుకున్నారని అర్థం వచ్చేలా బాబు చిరునవ్వు ఉందేమో..!
ఇప్పటి వరకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందే చూశారు. ఇక తాను ఇస్తానంటూ సంకేతం వచ్చేలా ఆ చిరునవ్వును తీసుకోవచ్చేమో..
ఇలా అనేక భావాలు వచ్చేలా చంద్రబాబు చిరునవ్వు బీఆర్ఎస్ పార్టీ స్థాపనకు అన్వయించుకోవచ్చు.
వాస్తవంగా ఉమ్మడి ఏపీలో టీడీపీకి కంచుకోటగా తెలంగాణ ఉండేది. స్వర్గీయ ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రంలోని పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం ఒక సంచలనం. మహిళలకు ఆస్తిలో సగభాగం ఇస్తూ చట్టాన్ని చేయడం రాజకీయ విప్లవం. కూడు, గుడ్డ, నీడ నినాదంతో ప్రజల్లోకి వచ్చిన ఎన్టీఆర్ ను ఆరాధించిన ప్రాంతాల్లో తెలంగాణది సింహభాగం. ఆంధ్రా, రాయలసీమ కంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉండే వాళ్లు. బీసీ ఓటు బ్యాంకు ఇప్పటికీ ఆ పార్టీ సొంతం. కానీ, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారా టీడీపీని వ్యూహాత్మకంగా కేసీఆర్‌ బలహీన పరిచారు.
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తరువాత తిరిగి బీసీ లీడర్లు టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం.
కేసీఆర్ ఎత్తుగడలకు చెక్ పెడుతూ ఈసారి చంద్రబాబు వ్యూహాత్మకంగా చక్రం తిప్పాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కమిటీలను టీడీపీ ఏర్పాటు చేసింది. ఆంధ్రా పార్టీగా ముద్రవేసి టీడీపీని దెబ్బకొట్టడం ద్వారా టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బలోపేతం చేశారు. ఆ పార్టీలోని 90శాతం మంది పూర్వపు టీడీపీ లీడర్లే..! తెలుగుదేశం పార్టీ బీ టీమ్ గా ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏర్పడిన తరువాత సెంటిమెంట్ కు కాలం చెల్లింది. తిరిగి బడుగు, బలహీనవర్గాలకు చెందిన కురువృద్ధులు టీడీపీ పంచకు రావడానికి సిద్ధం అవుతున్నారు. అయితే, చంద్రబాబు మాత్రం యువ రక్తాన్ని నింపడం ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ముందడుగు వేస్తున్నారు. మొత్తం మీద కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ రూపంలో చంద్రబాబుకు తెలంగాణలో రాజమార్గం ఏర్పడింది.

Leave a Reply