Suryaa.co.in

Andhra Pradesh

అన్ని వసతులతో టిడ్కో ఇళ్ళు పూర్తి చేస్తాం

– గతంలో టీడీపీ అప్పులు మిగిలిస్తే వాటిని తీరుస్తున్నాం 
– డిసెంబర్ కు 2.62 లక్షల ఇళ్ళు పూర్తికి ప్రణాళిక
– రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ 

గత ప్రభుత్వాల మాదిరి తాము అర్భాటాలకు పోయి అప్పులు చేసి ప్రజా సమస్యలను గాలికొదలటంలేదని, మాట ఇస్తే దానికి కట్టుబడి పని చేయటం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నైజమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం సచివాలయంలోని మంత్రి చాంబర్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు.

అనంతరం మంత్రి సురేష్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణాల్లోని పేదలకు ఇళ్లు నిర్మిస్తామని మాటలు చెప్పిన గత ప్రభుత్వం 2014 నుంచి 2017 వరకు మౌనంగా ఉండి ఎన్నికల సమయంలో హడావుడి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల కోసం ఇళ్ల నిర్మాణం పేరుతో దాదాపు మూడు వేల కోట్లకు పైగా అప్పులు మిగిల్చిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్న టిడిపి చేసిన తప్పిదాలను ఇప్పుడు సరిదిద్దాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గతంలో చేసిన అప్పులను ఓవైపు తీరుస్తూనే మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టి దాదాపు 4200 కోట్ల రూపాయల అదనపు భారాన్ని కూడా ఈ ప్రభుత్వం భరిస్తూ పూర్తిస్థాయిలో టిడ్కో ఇలా నిర్మాణాన్ని చేపట్టిందని మంత్రి సురేష్ అన్నారు.

డిసెంబర్ నాటికి 2.62 లక్షల ఇళ్ళు పూర్తి చేస్తాం 
ఏడాది డిసెంబరు ఆఖరుకు 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. వీటిని దశలవారీగా పూర్తి చేసేందుకు అధికారులకు లక్ష్యం నిర్దేశించి ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందన్నారు. కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాకుండా అన్ని రకాల మౌలిక వసతులు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తాగునీరు, కాలువలు ఎస్టీపి లు పూర్తి చేశాక లబ్దిదారులకు అప్పగిస్తామన్నారు. ఇక నుంచి వారానికొకసారి సమీక్ష నిర్వహిస్తానని, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలతో పాటు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అన్ని విషయాలు స్వయంగా తెలుసుకుంటానన్నారు. వచ్చేనెల లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో లబ్దిదారులకు ఇళ్ళు కేటాయించటానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి జగనన్న పై రాష్ట్ర ప్రజలకు నమ్మకం ఉందన్నారు. మంత్రిగా నాకు అప్పగించిన బాధ్యత కూడా జగనన్న ఆశయ సాధన లక్ష్యం గా పనిచేస్తానని మంత్రి చెప్పారు. సమీక్షలో టిడ్కో ఎండి సి హెచ్ శ్రీధర్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE