కేంద్రం సూచనల మేరకే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకం

• ఇది ఐచ్చికం మాత్రమే, కార్డుదారుల ఇష్టం మేరకు ఏదైనా పొందవచ్చు
• నగదు బదిలీ పథకాన్ని ఎంచుకోవడం వల్ల రేషన్ కార్డులు రద్దుకావు
• ఇప్పటికే పలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలు
• నగదు బదిలీ పై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దు
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు

అమరావతి: కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకం అమలుకు రాష్ట్రంలో చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు.
బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని పబ్లిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ పథకాన్ని అమలు చేయాలని 2017 సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసిందన్నారు. ఆరోగ్య రీత్యా కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బియ్యాన్ని వాడరని, జొన్నలు, రాగులు, ముడి బియ్యానికి ప్రాధాన్యత ఇస్తుంటారన్నారు.

ఈ నేపథ్యంలో రేషన్ కార్డుదారులు అందరికీ న్యాయం చేయాలనే సదుద్దేశ్యంతోనే కేంద్రం ఈ నదగు బదిలీ పథకాన్ని ప్రతిపాదించిందనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చండీఘర్, పాండిచ్చేరి, దాద్రానగర్ హవేలి తదితర కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పథకం అమల్లోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ఈ నగదు బదిలీ పథకం అమలుకై కేవలం సర్వే మాత్రమే జరుగుతుందని, బియ్యం రేటు ఖరారు కాగానే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు పర్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

రేషన్ బియ్యం బదులు నగదు తీసుకోవాలా, వద్దా అనేది రేషన్ కార్డుదారుల ఇష్టం పైనే ఆధార పడి ఉంటుందని, ఇది కేవలం ఐచ్చికం మాత్రమే అన్నారు. ఒక సారి రేషన్ బియ్యం బదులు నగదు తీసుకున్నప్పటికీ, మళ్లీ ఇష్టం లేదనుకుంటే రేషన్ బియ్యం పొందే అవకాశం ఉందన్నారు. ఈ నగదు బదిలీ పథకం పరిధిలోకి వచ్చినంత మాత్రాన ఏ ఒక్కరి రేషన్ కార్డు రద్దుకాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏమాత్రం నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అర్హులు అందరూ రేషన్ కార్డు పొందాలనే ఉద్దేశ్యంతోనే ఏడాదికి రెండు సార్లు అనగా జూన్, డిశంబరు మాసాల్లో రేషన్ కార్డు మంజూరు చేసే ప్రక్ర్రియను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నేడు ఒక ప్రముఖ దినపత్రిలో మగవారిని అవమానించే విధంగా, మగవారు అంతా త్రాగుబోతులు అంటూ ఈ పధకంపై కథనాన్ని వ్రాయడం జరిగిందని, ఇది ఎంతో అన్యాయమని అన్నారు. అదీ కాక ఈ నగదు బదిలీని కుటుంబంలోని మహిళలకు మాత్రమే అందజేయడం జరుగుతుందని మంత్రి స్పష్టంచేశారు.

ఈ సందర్బంగా పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు మంత్రితో పాటు రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ ఎం.డి. వీరపాండ్యన్ సమాధానం చెపుతూ ఖరీప్ పంటకు సంబందించి మిల్లర్లకు ధాన్యాన్ని సరఫరా చేసేందుకు గతేడాది నిర్ణయించిన ధరలకే రవాణా చేసుకోవచ్చని కేంద్రం అనుమతించిందని, అదే విధానాన్ని ఖరీప్, రబీ పంట ధాన్యాన్ని మిల్లర్లకు రవాణ చేసేందుకు అనుసరిస్తామని తెలిపారు.

రైతుల నుండి పూర్తి స్థాయిలో ధాన్యాన్ని సేకరించడం జరుగుతుందని, ఇప్పటికే ఒక లక్షా 58 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందని మంత్రి తెలిపారు. నగదు బదిలీ పథకం అమలు వల్ల ప్రస్తుతం రేషన్ బియ్యాన్ని సరఫరా చేసే వాహనాలు ఏమాత్రం తగ్గబోవని మంత్రి స్పష్టంచేశారు. బియ్యం అక్రమ రవాణాను ఏమాత్రం ఉపేక్షించమని, అటు వంటి విషయాలు ఏమాత్రం తమ దృష్టికి వచ్చినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Leave a Reply