Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో 2019 ముందు వరకు 2 ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ చేశాయి

– 2019 లో కేంద్రం అన్ని బీచ్ శాండ్ మైనింగ్ లీజులను రద్దు చేసింది
– ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి బీచ్ శాండ్ మైనింగ్ జరగడం లేదు
– మొనాజైట్ ను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు పూర్తిగా అవాస్తవం
– కేంద్ర అణుఇంధన శాఖ 2 బ్లాక్ లకు ప్రాస్పెక్టీవ్ లెస్సీ గా ఎపిఎండిసిని ఎంపిక చేసింది
– వీటి మైనింగ్ కు సంబంధించి ఇంకా అనుమతుల ప్రక్రియ పూర్తి కాలేదు
– కేంద్రం ప్రతిపాదించిన రెండు బ్లాక్ ల్లో ఎటువంటి మైనింగ్ జరగడం లేదు
– అసలు మైనింగే జరగకుండా మొనాజైట్ ను ఎలా తరలిస్తారు?
– ఈ ఆరోపణలపై కేంద్రంకు గత ఏప్రిల్ లోనే వివరణ పంపాం
– డిఎంజి విజి వెంకటరెడ్డి

విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో 2019కి ముందు రెండు ప్రైవేటు సంస్థలు బీచ్ శాండ్ మైనింగ్ కార్యక్రమాలు నిర్వహించాయి. 2019లో కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో హెవీ మినరల్ బీచ్ శాండ్‌ మైనింగ్ పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఇటీవల బీచ్ శాండ్ మైనింగ్ లో అక్రమాలు అంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం) ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర గనులశాఖను అణు ఇంధనశాఖ కోరింది. ఐబిఎం విచారణలో సదరు సంస్థలు మైనింగ్ నిర్వహించిన కాలంలో ఏదైనా అక్రమాలకు పాల్పడి ఉంటే అందుకు సంబంధించిన వాస్తవాలు వెలుగుచూస్తాయి. అక్రమాలు వాస్తవమని నిర్ధారణ జరిగితే బాధ్యులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.

ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాండ్ మైనింగ్ ద్వారా మొనాజైట్ ఖనిజాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తాజాగా వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో 2019 నుంచి ఎక్కడా బీచ్ శాండ్ మైనింగ్ జరగడం లేదు. అసలు మైనింగ్ ఆపరేషన్స్ లేనప్పుడు మోనజైట్ అనే ఖనిజాన్ని ఎలా అక్రమంగా రవాణా చేయడం సాధ్యమవుతుంది?

ఆంధ్రప్రదేశ్ లో బీచ్ శాండ్ మైనింగ్ కోసం గత ఏడాది కేంద్ర అణుశక్తి సంస్థ (డిఎఇ)కు ఎపిఎండిసి 16 ప్రతిపాదనలను సమర్పించింది. దానిలో విశాఖజిల్లా భీమునిపట్నం పరిధిలో 90.15 హెక్టార్లు, కృష్ణాజిల్లా మచిలీపట్నం తీరప్రాంతంలో 1978.471 హెక్టార్ లలో రెండు బీచ్ శాండ్ డిపాజిట్ లకు ఎపిఎండిసిని ప్రాస్పెక్టీవ్ లెస్సీగా డిఎఇ నియమించింది. ఇక్కడ మైనింగ్ జరిపేందుకు అనుమతుల కోసం ఎపిఎండిసి దరఖాస్తు చేసుకుంది. అయితే ఇంకా ఆ అనుమతుల ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల కేంద్రం ప్రతిపాదించిన ఈ రెండు బ్లాక్ లలో ఇప్పటి వరకు ఎటువంటి మైనింగ్ ప్రారంభం కాలేదు.

హెవీ మినరల్ బీచ్ శాండ్ లో మొనాజైట్ అవశేషాలు జీరోశాతం మాత్రమే ఉండాలని, అంతకు మంచి ఉన్నట్లు నిర్ధారణ అయితే సదరు మైనింగ్ లీజులను రద్దు చేయాలంటూ కేంద్రం 1.3.2019న మెమో ద్వారా రాష్ట్రానికి ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం మన రాష్ట్రంలోని బీచ్ శాండ్ లో మొనాజైట్ శాతం కేంద్రం నిర్ధేశించిన దానికన్నా ఎక్కువగా ఉన్నందున అన్ని బీచ్ శాండ్ లీజులను గనులశాఖ రద్దు చేసింది.

బీచ్ శాండ్ మైనింగ్ పై తాజాగా కేంద్రప్రభుత్వం వ్యక్తం చేసిన సందేహాల నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన కేంద్ర అణుఇంధన శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం గనులశాఖ ద్వారా సమగ్ర వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో బీచ్ శాండ్ మైనింగ్ జరుగుతోందని, దాని ద్వారా పర్యావరణానికి నష్టం, మైనింగ్ చట్టాలకు విఘాతం, మొనాజైట్ అక్రమ రవాణా జరిగిందంటూ వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని కేంద్రానికి సమర్పించిన నివేదికలోనే స్పష్టం చేసింది.

LEAVE A RESPONSE