జానపదం ఆయన పథం…
సాంఘికం ఆయన సౌధం..
పౌరాణికం ఆయన విధం..
కత్తి ఆయన ఆయుధం..
మహతి ఆయన చేత అందం.. మొత్తానికి తుది శ్వాస వరకు సినిమాతోనే ఆయన బంధం..!
అట్ట కత్తి కాంతారావు..
తెలుగు సినిమాలో
మరో రామారావు..
నందమూరి లాంటి కృష్ణుడు
ఆయన తమ్ముడైన
రాకుమారుడు…
ఏకవీర మిత్రుడు..
ఏ నిమిషానికి
ఏమి జరుగునో అంటూ విషాదం నిండిన మోముతో సీతమ్మను అడవులకు సాగనంపిన
విలక్షణుడు
లవకుశ లక్ష్మణుడు..!
టక్ చేస్తే అందగాడు..
కట్ చేస్తే వందల సినిమాల్లో నటించినా ఏమీ మిగుల్చుకోని
గుండెలు తీయని మొనగాడు
కృష్ణుడై లీలామానుషవేషధారి
అయినా ఎక్స్ ట్రా వేషాలు వేసి ఎదురీత సాగించిన కళాప్రపూర్ణ
చివరి రోజుల్లో మొహం చాటేసిన అన్నపూర్ణ..
రాముడై సినీ వనవాసం
చేసిన ఆకాశరామన్న..
కలహభోజుడిగా
అందెవేసిన చెయ్యి..
చివరకి చిన్న వేషాల కోసం చాపాల్సి వచ్చింది చెయ్యి..
హీరోగా వెలిగి
కూటి కోసం
మామూలు పాత్రలు
కూడా పోషించిన వృద్ధజీవి..
అభిమానుల హృదయాల్లో
ఎప్పటికీ చిరంజీవి..!
విఠలాచార్య సినిమా అంటే
కాంతారావు…రాజనాల..
ఒకసారి కృష్ణకుమారి
మరోసారి రాజశ్రీ..
ఈ కలయిక జానపద సినిమాకి
పెట్టింది పేరు..
నిర్మాతలకు పట్టింది బంగారం..
మంత్రాలు..మారువేషాలు..
ఈ జోరులో కొట్టుకుపోయి ఇతర నిర్మాతలు
లెక్కెట్టేసారు మీనమేషాలు..!
మొత్తానికి ఓ ధృవతార..
ఆయన దూరమై
చిన్నబోయింది వెండితెర..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286