Home » అసలు చంద్రబాబుకు ఏమైంది?

అసలు చంద్రబాబుకు ఏమైంది?

– గెలిపించకపోతే ఇవే చివరి ఎన్నికలని బాబు సంచలన వ్యాఖ్య
– వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే రాజకీయాల్లో ఉండనన్న సంకేతాలు
– బాబు వ్యాఖ్యలపై సీనియర్లలో ఆందోళన
– ప్రజల మీదనే భారం వేసిన బాబు
– ఓవైపు అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ నేతల సమరోత్సాహం
– బాబు జిల్లా పర్యటనకు హోరెత్తుతున్న ప్రజాస్పందన
– సర్కారు అవినీతిపై పార్టీ నేతల యుద్ధం
– అంతలోనే అధినేత చంద్రబాబు నిరాశాపూరిత వ్యాఖ్యలు
– అవి జగన్‌తో పోరాడలేకపోతున్నామన్న సంకేతాలా?
– అధికార పార్టీని ఎదుర్కోలేకపోతున్నామన్న సంకేతాలా?
– యుద్ధ సమయంలో నైరాశ్య మేఘాలెందుకు?
– ప్రజలను మెప్పించాల్సిన చోట నిరాశాపూరిత వ్యాఖ్యలెందుకు?
– పార్టీ శ్రేణులు స్థైర్యం కోల్పోతారని నేతల ఆందోళన
– బాబు వ్యాఖ్యలపై అయోమయంలో టీడీపీ శ్రేణులు
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘మీరు గెలిపిస్తే సరే.. లేకపోతే ఇవే నా చివరి ఎన్నికలు’.. ఇవేవో ఓ రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలనుకుంటే, బ్యాలెట్‌లో కాలేసినట్లే. పాలిటిక్స్‌లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ముచ్చటగా మూడుసార్లు ముఖ్యమంత్రితోపాటు.. మూడుసార్లు ప్రతిపక్షనేత.. ఓ పదేళ్లు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలివి.

అవునా?.. అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్ బాబేమిటి? అలా బేలగా మాట్లాడటమేమిటనుకుంటున్నారా? లేక విన్నది నిజమేనా అని డౌటనుమానపడుతున్నారు కదా? ఇది నిఝంగా నిజం. ఆయన ప్రసంగం విన్న తర్వాత.. ‘బాబు అలా మాట్లాడకుండా బాగుండేదనుకుంటున్నారా’? నో చాన్స్. అప్పటికే జరగాల్సిన డ్యామేజీ, వెళ్లాల్సిన మెసేజ్ జనంలోకి వెళ్లిపోయింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో.. జనాలనుద్దేశించి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బేలతనంతో చేసిన వ్యాఖ్యలు, జనంలోనే కాదు.. అటు తమ్ముళ్లనూ విస్మయపరుస్తున్నాయి.

తనను వచ్చే ఎన్నికల్లో గెలిపించకపోతే ఇవే తన చివరి ఎన్నికలని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను టీడీపీ శ్రేణులు, సీనియర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో ఆచి తూచి మాట్లాడే తమ అధినేత, ఈసారి ఎందుకు అలా నిగ్రహం కోల్పోయి మాట్లాడారో, తమకూ అర్ధం కావడం లేదని సీనియర్లు సైతం విస్తుపోతున్నారు.

నాలుగు దశాబ్దాల రాజకీయానుభవం ఉన్న బాబు చేసిన వ్యాఖ్యలు, రేపటి ఎన్నికలపై భయాన్ని సూచిస్తున్నాయని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. వైఎస్ వంటి ప్రజాకర్షణ గల నేతనే, ధైర్యంగా ఎదిరించి పోరాడిన చంద్రబాబు.. తనకంటే వయసు-అనుభవంలో చిన్నవాడయిన జగన్‌ను చూసి, భయపడుతున్నట్లుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు.

నిజానికి చంద్రబాబుకు, కర్నూలు నుంచి పత్తికొండ వెళ్లేందుకు 8 గ ంటల సమయం పట్టింది. అంటే ఆయన పర్యటనకు ప్రజలు ఏ స్థాయిలో బ్రహరథం పట్టారో, నేతలు ఏ స్థాయిలో కష్టపడ్డారో స్పష్టమవుతోంది. అలాంటి సానుకూల పరిణామాల నేపథ్యంలో, కార్యకర్తలు-ప్రజల్లో స్ఫూర్తి నింపాల్సిన బాబు ప్రసంగం, బేలగా సాగడంపై నేతల్లో నీరసం ఆవహించింది.

తొలుత చంద్రబాబు ఆవేశపూరిత ప్రసంగం బాగానే ఉన్నప్పటికీ.. ‘ఈసారి తనను గెలిపించకపోతే ఇవే నా చివరి ఎన్నికల’ని వ్యాఖ్యానించడం వల్ల, జనసమీకరణకు తాము పడ్డ కష్టమంతా వృధా అయిందని నేతలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. బాబు ఆ వ్యాఖ్యలు చేయకపోతే తమకు మరికొన్ని నెలలు ఆయన పర్యటన టానిక్‌లా పనిచేసేదేనని కర్నూలు జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు.

అలాంటి నిరాశాపూరిత వ్యాఖ్యలు.. గెలుపు-ఓటమి, అధికారం-విపక్ష పాత్రలెన్నో పోషించిన చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడి నోటి వెంట, రావలసినవి కావని నేతలు స్పష్టం చేస్తున్నారు. అసలు తమ అధినేత అలా నిరాశగా మాట్లాడతారని తాము ఊహించలేదంటున్నారు. ఆయన మాటలు ప్రజలను బెదిరిస్తున్నారనే అనవసర సంకేతాలు వెళ్లాయని, ఇక తాను గెలవనన్న ముందస్తు సంకేతాలతో, అధికార పార్టీకి అస్త్రం ఇచ్చినట్టయిందని నేతలు విశ్లేషిస్తున్నారు. రేపు అధికార పార్టీ ఆయన వ్యాఖ్యను అడ్డుపెట్టుకుని, టీడీపీపై మానసిక దాడి ప్రారంభించినా ఆశ్చర్యపోవలసిన పనిలేదంటున్నారు. ఆయన వ్యాఖ్యలు ఒకరకంగా తమను నైతికంగా కుంగదీశాయని నేతలు అంగీకరిస్తున్నారు.

ప్రజలు-పార్టీ శ్రేణులను యుద్ధానికి సిద్ధం చేయాల్సిన సైన్యాధ్యక్షుడే బేలగా మాట్లాడితే, అధికార పార్టీపై యుద్ధం చేయడానికి ముందుకెవరు వస్తారని ఓ సీనియర్ నేత ప్రశ్నించారు. ఇవి మిమ్మల్ని మీరు గెలిపించుకునే ఎన్నికలు కాబట్టి, విజ్ఞత ప్రదర్శించాలని పిలుపునిస్తే బాగుండేదని చెబుతున్నారు. మరోసారి మోసపోకుండా ఉండాలంటే టీడీపీని గెలిపించాలని కోరినా బాగుండేదంటున్నారు.

ప్రజల మనసు గెలిచే వ్యూహాలు, ప్రసంగాలు ఉండాలే తప్ప.. మీరు గెలిపించకపోతే ఇకపోటీ చేయననడం వల్ల, ‘పార్టీలో మునుపటి పోరాటపటిమ తగ్గింద’న్న అనవసర సంకేతాలు వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో గెలిపించకపోతే, ఇక తాను భవిష్యత్తులో పోటీ చేయనన్న తమ అధినేత.. తనకు వయసు అయిపోలేదని, తానింకా ఫిట్‌గానే ఉన్నానంటూ చెప్పడం ఎందుకని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎవరికీ సందేహాలు ఉండనవసరం లేదని, ఇప్పుడు పార్టీలో ఉన్న యువ నేతలందరికంటే, ఆయనే ఫిట్ అన్న విషయం అందరికీ తెలుసనంటున్నారు. బాబు వ్యాఖ్యలు.. తన వయసయిపోయిందన్న వైసీపీ నేతల విమర్శలకు స్పందించినట్లు ఉందంటున్నారు.

కర్నూలు వంటి ప్యాక్షన్ జిల్లాలో.. మాస్ మసాలా ప్రసంగం చేయాల్సింది పోయి, ఇలా బేలగా మాట్లాడితే, దాని ప్రభావం పార్టీ నేతలపై ఉంటుందని ఓ సీమ నేత ఆందోళన వ్యక్తం చేశారు. బాబు కర్నూలు జిల్లా పర్యటన హిట్టయినా, ఆయన చేసిన ఆ ఒక్క వ్యాఖ్య, పార్టీ భవిష్యత్తుపై బోలెడన్ని సందేహాలకు తెరలేపిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.

ఓ వైపు వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తున్నామంటూ పార్టీనేతలు సమరోత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆ మేరకు తమపై కేసులు పెడుతున్న అధికారులను హెచ్చరిస్తున్నారు. కానీ తమ అధినేత మాత్రం.. వచ్చే ఎన్నికల్లో గెలిపించకపోతే, ఇవే నా చివరి ఎన్నికలని స్పష్టం చేయడం, పార్టీ శ్రేణుల నైతిక స్థైర్యాన్ని గందరగోళంలో పడవేయడమేనంటున్నారు.

తమ అధినేత తాజా వ్యాఖ్యలు, సీఎం జగన్‌తో పోరాడలేకపోతున్నామన్న మరో సంకేతం కూడా పంపినట్లయిందని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ‘మేం చేయాల్సింది మేం చేస్తున్నాం. మీ కోసం జగన్‌తో చేయవలసింత పోరాటం చేస్తున్నాం. ఇక మమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మీదే. మీరు గెలిపిస్తే పోటీ చేస్తాం. లేకపోతే ఇక పోటీ చేయం’ అని ప్రజలకు చెప్పినట్లుగా ఉందని మరో సీనియర్ నేత విశ్లేషించారు.

అసలు ఈ యుద్ధ సమయంలో, అధినేత చేయాల్సిన వ్యాఖ్యలు అవి కావని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనలకు మంచి స్పందన లభిస్తోందని, ప్రజలు ఎక్కడికి వెళ్లినా అనూహ్యంగా స్వాగతిస్తున్నారని నేతలు గుర్తుచేస్తున్నారు. దీనికితోడు, అసెంబ్లీ టి కెట్ల కోసం ఇప్పటినుంచే పోటీ-పైరవీలు పెరిగాయని చెబుతున్నారు. మద్యం, ఇసుక, కాంట్రాక్టులపై టీడీపీ చేస్తున్న ఆరోపణలతో, అధికారపార్టీ కూడా ఇరుకున పడుతోందని నేతలు గుర్తు చేస్తున్నారు.

అలాంటి సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, పార్టీలోని అన్ని స్థాయిల్లోని వారిని నిరాశపరిచాయని నేతలు అంగీకరిస్తున్నారు. ఇవన్నీ తమ నాయకత్వం, ఏదో ఫ్రస్టేషన్‌లో ఉందన్న సంకేతాలు వెళ్లేందుకు కారణమయ్యాయని చెబుతున్నారు.

పైగా..తాను అసెంబ్లీలో అడుగుపెట్టాలంటే, రాజకీయాల్లో కొనసాగాలంటే, రాష్ట్రానికి న్యాయం చేయాలంటే టీడీపీని తప్పక గెలించాలి. లేకపోతే ఇవే చివరి ఎన్నిక అవుతుందన్న చంద్రబాబు వ్యాఖ్య.. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం సాధించకపోతే, చంద్రబాబు రాజకీయాల నుంచి వైదొలగుతారన్న చర్చకు తెరలేపిందంటున్నారు. ఇది తమ లాంటి సీనియర్లను మాత్రమే కాకుండా, యువనేతలకూ గందరగోళంలో పడేసిందని సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇకనయినా అధినేత ఇలాంటి వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వైసీపీ సోషల్‌మీడియా, అత్యంత శక్తివంతంగా ఉన్న విషయాన్ని విస్మరించకూడదని హెచ్చరిస్తున్నారు.

Leave a Reply