– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
జాతిపిత మహాత్మా గాంధీ హత్య ఉదంతంపై వాస్తవాలు నేటి తరానికి తెలువాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.సోమవారం మహాత్మా గాంధీ 75వ వర్ధంతి సందర్భంగా మంత్రుల నివాస ప్రాంగణంలోని క్యాంప్ కార్యాలయంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినోద్ కుమార్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ను పొగుడుతూ బిజెపి సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోందని, మహాత్మా గాంధీ హత్యా, వాస్తవ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోందని పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ హత్య ఘటనను వక్రీకరిస్తున్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీని హత్య చేసిన వాస్తవ చరిత్రను నేటి తరానికి తెలుపాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వినోద్ కుమార్ అన్నారు. ఈ విషయంలో ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని, లేకుంటే చెప్పుకున్నోడిదే చరిత్ర అవుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ హత్యతో మతోన్మాద ఉగ్రవాదానికి బీజం పడిందని అన్నారు. రాజ్యాంగం మేరకు మత విశ్వాసం అన్నది వ్యక్తిగతమని, హిందూ, ఇస్లామిక్, క్రైస్తవ మత ఉన్మాదం ప్రమాదకరం అని, ఇలాంటి ఉన్మాదాన్ని తుధముట్టించెందుకు యువత కంకణం కట్టుకోవాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
భారతదేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో గాంధీకి మహాత్మా అనే పేరు నామకరణం జరిగిందని, స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ స్ఫూర్తి గొప్ప మైలురాయి అని వినోద్ కుమార్ తెలిపారు. అయితే గాంధీకి మహాత్మా అని పేరుతో పిలువడానికి బిజెపి నాయకులు ఇష్ట పడటం లేదని అన్నారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని తొమ్మిది సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన జవహర్ లాల్ నెహ్రూను కించపరుస్తూ.. బిజెపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది విచారకరమని వినోద్ కుమార్ అన్నారు.
ఏ ఒక్క రోజు కూడా స్వాతంత్ర ఉద్యమంలో పాలుపంచుకోకుండా ఉండి.. కనీసం తొమ్మిది రోజులు కూడా జైలుకు వెళ్లలేని బిజెపి నాయకులు తామే గొప్ప దేశభక్తి ఉన్న నాయకులు మని చెప్పుకోవడం విచారకరమని వినోద్ కుమార్ అన్నారు. ఈ పదేళ్ల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక్క ఉక్కు కర్మగారాన్ని గాని, ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును గాని కట్టలేదని, గతంలోని ప్రభుత్వ రంగ సంస్థలే ప్రస్తుతం దేశానికి జీవనాడి అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి, భూదాన్ యజ్ఞ సంస్థ రాష్ట్ర నాయకులు యానాల ప్రభాకర్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అక్బర్, తదితరులు కూడా పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు.