( సతీష్ మొక్కపాటి)
రామోజీ, ఈనాడు… ఈ ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపిన శక్తుల్లో కీలకమైనవి. ఈ రెండింటి వెనుక మరో మూడక్షరాల వ్యక్తి, శక్తి ఉన్నారు. ఆయనే ఈనాడు ఎడిటర్, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపల్ “ఎమ్మెన్నార్”.
రామోజీరావు గారు, ఈనాడు ఎండీ కిరణ్ గారు, ఇతర పెద్దలు మూడున్నర దశాబ్దాలుగా ఆత్మీయంగా ఎమ్మెన్నార్ అని పిలుచుకునే ‘‘మానుకొండ నాగేశ్వరరావు’’. ఎడిటరైనా ఈనాడు సైన్యానికి ఆయన ప్రిన్సిపల్ గారే! అదే గురు భావనే.
వైసీపీ మీద సాగించిన చారిత్రాత్మక పోరులో రామోజీకి ఎమ్మెన్నారే మంత్రి, ఎమ్మెన్నారే సైన్యాధిపతి. సాక్షి రాసే అబద్ధాలు, అర్థ సత్యాలు, వక్రీకరణలు, అభూత కల్పనలను ఎప్పటికప్పుడు కథనాలతో తిప్పికొడుతూ జగన్ శిబిరాన్ని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించారాయన. జనాన్ని కదిలించే, ఆలోచింపచేసే కథనాలు రాయించడంలో వాటిని ప్రభావవంతంగా ప్రచురించడంలో ఆయన ఆలోచనలకు తిరుగులేదు. ఈ క్రమంలో ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడినా ఆయన వెరవలేదు.
క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? జనం మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వంలో ఏం జరుగుతోంది, ప్రత్యర్థి శిబిరంలో ఏం జరుగుతోంది అన్నవి ఈనాడు శ్రేణుల ద్వారా, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో, దేశ విదేశాల్లో ఉన్న తన స్నేహితులు, మూడు వేలకు పైగా ఉన్న జర్నలిస్టు శిష్యుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారాయన. ఆ సమాచారానికి అనుగుణంగా వ్యూహరచన, శ్రేణుల్ని సమాయత్తం చేసి ఎప్పుడు, ఎలాంటి కథనాలు ఇవ్వాలి అన్నవి ప్లాన్ చేయడం, సమయానికి అవి వచ్చేలా చూసుకోవడం, వచ్చాక అక్షరం అక్షరం చదివి ప్రమాణాల ప్రకారం ఉండేలా చూడటం, సరైన టైంలో వాటిని ప్రచురించడంలో ఆయన కృషి నిరుపమానం.
ఉదయం పదింటికి మొదలుపెట్టి తెల్లవారు జామున 3 ఒక్కోసారి 4 వరకూ శ్రమించే పని రాక్షసుడాయన. బహుశా ఆయనలా పని చేసే ఎడిటర్ దేశంలో మరొకరు లేరంటే అతిశయోక్తి కాబోదు. ఎంత పని చేసినా అలసట ఎరగని ముఖం, చెరగని చిరునవ్వు ఆయన సొంతం… సమున్నత వ్యక్తిత్వం ఆయన బలం.
అరాచక అధికార పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి ఇంటి పంపడంలో మీ పాత్రను అనితరసాధ్యంగా నిర్వర్తించి జన్మభూమి రుణం తీర్చుకున్నారు ఎమ్మెన్నార్ గారూ. మీకే ఆంధ్ర ప్రజలందరం రుణ పడి ఉన్నాం