నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం చాలా దేశాల్లో ఏటా అక్టోబర్ 01న జరుపుకుంటారు. ఐతే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ఈరోజు అంటే ఆగస్ట్ 21న జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తారు. వృద్ధుల పట్ల (వయసు 60 దాటిన వారు) నిరాదరణ పెరుగుతున్న నేపథ్యంలో initiative తీసుకుని అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1988లో ఆగస్ట్ 19న ఒక ప్రకటనపై సంతకం చేసి ఏటా ఆగస్ట్ 21న జాతీయ స్థాయిలో older persons day నిర్వహించాలని నిర్ణయం తీసుకుని అమలు జరుపుతోంది అమెరికా. మన దేశం కూడా దీన్ని ఫాలో అవుతోంది.
అసలు జాతీయ వృద్ధుల దినోత్సవం ఉద్దేశం ఏమిటీ అంటే.. వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, హేళన, హేయభావం, నిరసన భావం వ్యక్త మవుతున్నాయి.. కొన్ని విషయాలలో ఈ వర్గం నిరాదరణకు గురి అవుతోంది. మన దేశంలో ఉన్న సుమారు 16 కోట్లమంది వృద్ధులు చాలా రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కడుపున పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలే తమ తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు.. 80వ దశకంలోనే ఈ ధోరణి కనిపించింది.
వృద్ధులకు రాయితీలు ప్రోత్సాహకాలు ఇవ్వడం మంచిదని గుర్తించడం జరిగింది. వృద్ధులు సీనియర్ సిటిజన్స్.. అపార అనుభవం గల పెద్దలు.. వయోభారంతో శక్తి తగ్గినా తమ అనుభవం రీత్యా మంచి సలహాలు ఇవ్వగలరు.. ఆరోగ్యం పట్ల అనేక మంచి విషయాలు చెప్పగలరు.. యీ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఓ నిర్దిష్ట కార్యాచరణ ద్వారా సభలు సదస్సులు సమావేశాలు నిర్వహించి వృద్ధులపై గౌరవం పెరిగే విధంగా కార్యక్రమాలు చేపడతారు ఈ రోజున. జీవితం చరమాంకంలో ఉన్న 60 దాటిన వృద్ధులకి ఉత్సాహం కలిగించే ఇటువంటి ప్రోగ్రాంలు చాలా అవసరం.
అంతేకాదు 60 దాటిన వారు కూడా 70-80 దాటినవారికి చేయూత నివ్వొచ్చు. స్నేహభావం పెరగాలి. వృద్ధులు తమ సమస్యలను తమ ఏజ్ గ్రూప్ వారితో చెబితే కొంత రిలీఫ్ ఫీలవుతారు. 90 దాటిన వారు ఆరోగ్యంగాను ఉన్నవారు, 60-70 లలో అనారోగ్యానికి గురైనవారు ఉన్నారు. ఆమధ్య ఓ మీటింగ్ లో 72 ఏళ్ళ ఒకాయన మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతుంటే మరో ముసలాయన చేయి పట్టుకొని అన్ని మెట్లు ఎక్కించారు. ఈ ముసలాయన వయసు 93 అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఒక ముసలాయన తనకంటే 20 ఏళ్ళు వయసులో చిన్న ముసలాయనకి ఆసరాగా ఉండటం నిజంగా చెప్పుకోదగ్గ విశేషం.
105 ఎళ్ళ ఒక వృద్ధురాలు ఒక్కరే బస్సులో ప్రయాణం చేయగలుగు తున్నారంటే ఆవిడ ఆరోగ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటువంటి వారి దగ్గరే మన చాలా నేర్చుకోవాలి.. ఎన్నో తెలుసుకోవాలి. నేను వృద్ధులతో చాలా స్నేహంగా ఉంటాను. వారి అనుభవాలు మనకి పాఠాలు. నాలుగు రోజుల క్రితం ఆంధ్రా బ్యాంక్ లో పనిచేసి రిటైరైన గుర్నాధం అనే 89 సంవత్సరాల వయసుగల ఆయన ఇంటికి వెళ్ళి గంటన్నర సేపు ముచ్చటించాను. ఆయన ఎంతగానో సంతోషించారు. ఒక స్వీట్, హాటు, కాఫీ ఆయన భార్య అందించారు. ఇటువంటి ములాకాత్ లు వారికి మనకీ అవసరమే. నా ఆహ్వానం మేరకు అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వృద్ధులు వస్తుంటారు. మా రెండో అబ్బాయి శ్రీనివాస్ (వయసు 30) వృద్ధుల పట్ల ఎంతో ఆదరణ చూపుతాడు. అడగకపోయినా అంతగా అవసరం లేకపోయినా పట్టుకుని నడిపించడం వంటివి చేయడం చూస్తుంటే తండ్రిగా నాకు ఒకింత గర్వం కలుగుతుంది.
వృద్ధులు పసి పిల్లలతో సమానం అంటారు. అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఐనప్పుడు వారి సంతోషాలకి మనం కొంచమైనా కారణమైతే మనం ధన్యులం అవుతాం. మన జీవితం మలి సంధ్యలో భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి బాసటగా ఉంటాడు అనే నమ్మకంతో మనం ముందుకెళదాం.. జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నా అభిమాన గణంలో ఉన్న వయో వృద్ధులకి, వృద్ధులకి, అరవై లోపు వారికి.. అందరికీ శుభాకాంక్షలు..
గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని),
విజయనగరం ,
99855 61852