మన రాజ్యాంగం లోని ఆర్టికిల్ 75 వల్ల ; రాజకీయ పార్టీలకు చట్ట సభలలో విలువ లేకుండా పోయింది. దీని ప్రకారం లోకసభ లో మెజారిటీ సభ్యుల మద్దతు గలిగిన సభ్యుడిని ప్రధానమంత్రి గా భారత రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రాలలో అయితే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అంతే! ఇక వారెవరికీ బాధ్యత వహించరు.రాజ్యాంగం ప్రసాదించిన ‘హక్కుతో వారు మానవాతీత శక్తులుగా ప్రవర్తించదాన్ని చూస్తున్నాం. వారు ప్రజలకు అసలే బాధ్యత వహించరు. ఇక, ఆడింది ఆట. పాడింది పాట. ఇచ్చింది జీవో. చేసింది శాసనం.మాట్టాడింది సుమతీ శతకం.
హంతకులు, రేపిస్టులు, దొంగలు, ఫోర్జరీలు చేసిన వారు, కబ్జా కోరులు, రౌడీ షీటర్లు చట్ట సభల్లో తిష్ట వేయకుండా రాజ్యాంగం నిలువరించలేక పోతున్నందునే ; వారి చేతుల్లో భరత మాతకు ఇన్ని కష్టాలు. ఎన్ని రకాల కేసులు ఉంటే…. అంత స్టేటస్ సింబల్ గా భావించే రోజులకు మనం చేరుకున్నాం. నేర చరిత్ర అనేది… రాజకీయానికి అదనపు అలంకారంగా మారినట్టు కనబడుతున్నదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా ఇటీవల ఒక సభలో ఆవేదన వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలయిందంటూ ఉత్సవాలు జరుపుకుంటున్నాం కదా….;
రాజకీయ విలువలు అప్పటి కంటే ఇప్పుడు పెరిగాయా…. తరిగాయా?
రాజకీయ నేతలలో అవినీతి మనస్తత్వం అప్పటి కంటే ఇప్పుడు పెరిగిందా… తరిగిందా?
రాజకీయ నేతలపై సమాజం లో గౌరవం అప్పటికంటే ఇప్పుడు పెరిగిందా…. తరిగిందా?
రాజకీయ దోపిడీ అప్పటికంటే ఇప్పుడు పెరిగిందా… తరిగిందా?
రాజకీయ నైతిక ప్రమాణాలు అప్పటికంటే ఇప్పుడు పెరిగాయా… తరిగాయా?
ఈ రాజకీయ పరుగుకు చివరి మజిలీ ఎక్కడ? ఇది అభివృద్దా….,పతనమా? ఈ పరిస్థితులు ఇలాగే దిగజారుతూ పోతుంటే…. మన స్వాతంత్య్రం, సమాజ గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ ఎన్నాళ్ళు మనగలుగుతాయి? యువత, భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి?
కొండ శిఖరం మీది నుంచి కిందకు దొర్లుతున్న బండ రాయిలా దిగజారి పోతున్న రాజకీయ, సామాజిక నైతిక విలువలను ఎక్కడో ఓ చోట నిలువరించాల్సిన అనివార్య స్థితికి చేరుకున్నామని పలువురు ఆవేదన చెందుతున్నారు . రాజకీయ సభ్యత, సంస్కారాలు సిగ్గుపడుతూ ఇంట్లో దాక్కుంటుంటే….;అరాచకం, అసభ్యత బట్టలూడదీసుకుని మరీ నడి బజారులో నాట్యం చేస్తున్నాయి. ‘ఇక రేపు అనేది లేదు. అరాచకమంతా ఈ రోజే చేసెయ్యాలి ‘ అన్నట్టుగా రాజకీయ ఆరాచకం చెలరేగి పోతున్నది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు గాకుండా…. వాటి తరఫున అభ్యర్థులు పోటీ చేస్తూ ఉండడమే -ప్రస్తుతం మనం చూస్తున్న సర్వ అనర్ధాలకూ, అరాచకాలకూ మూలం.
సర్వ అక్రమాలకూ, నేర ప్రవృత్తికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారైన వారు…. ఏదో ఒక పార్టీ ముసుగులో చట్ట సభల్లోకి చొరబడడానికి ప్రయత్నించే ట్రెండ్ రోజు రోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నది. ప్రస్తుత విధానం లో – ఎన్నికల్లో కోట్లకు కోట్లు మంచి నీరులా పారించడం…. ఓట్లను కొనుగోలు చేయడం వంటి అప్రజాస్వామిక వ్యవహార శైలికి ప్రతినిధులుగా రూపొందుతున్నారు. ఖర్చు పెట్టిన దానికి వంద రెట్లు పోగెయ్యడానికి – దౌర్జన్యాలు, కబ్జాలు, కాంట్రాక్టులు, కమిషన్లు, మాఫియాల్లో మునిగి తేలుతున్నారు. ఫలితంగా – రాజకీయాలు అంటే సమాజం లో గౌరవం లేకుండా పోతున్నది. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడానికి… ఒకే ఒక మార్గం ఉంది. అదే – అభ్యర్థుల స్థానం లో రాజకీయ పార్టీలు పోటీ చేయడం.
దీనివల్ల, ఎన్నికల దౌర్జన్యాలు, డబ్బు ప్రలోభాలు దాదాపుగా కనీస స్థాయికి దిగి పోతాయి. నియోజక వర్గాల్లో ‘పొలిటికల్ లార్డ్స్’ లాగా ఎంపీ లు, ఎం. ఎల్. ఏ లు వ్యవహరించే పరిస్థితి ఉండదు. చట్ట సభలకు వచ్చే సభ్యుల్లో ‘ఊహతీతమైన రాజకీయ క్రమశిక్షణ’ చోటు చేసుకుంటుంది. రాజకీయాలలో సర్వ రుగ్మతలకు మూలమైన వ్యక్తి పూజ, వ్యక్తి ప్రాధాన్యత దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అభ్యర్థుల స్థానం లో రాజకీయ పార్టీలే నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే ఎన్నికల వ్యవస్థ ను ప్రవేశ పెడితే, అనేక రాజకీయ రుగ్మతలకు విరుగుడు కనపడుతుంది.
అయితే, వచ్చిన చిక్కల్లా…మన రాజ్యాంగం రాజకీయ పార్టీలను గుర్తించదు. వ్యక్తులను మాత్రమే గుర్తిస్తుంది. మరి, ఆ రోజుల్లో రాజకీయాల్లోకి (అంటే ప్రజా సేవ లోకి ) అటువంటి ఉత్తములు, నిస్వార్ధ సేవకులు వచ్చే వారు, మరి. రాజ్యాంగ నిర్మాతలు ఇప్పటి పరిస్థితులను ఊహించి ఉండక పోయి ఉండవచ్చు. రాజ్యాంగం లోని 75 వ ఆర్టికల్ ప్రకారం లోకసభలోని మొత్తం సభ్యుల్లో – మెజారిటీ సభ్యుల మద్దతు గల సభ్యుడిని ప్రధాన మంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ పార్టీల ప్రస్థావనే లేదు. రాష్ట్రాలలో ముఖ్యమంత్రి నియామకానికి కూడా ఇదే తరహా నిబంధనలు వర్తిస్తాయి. ఇక్కడ కూడా పార్టీల ప్రస్తావన ఉండదు. ఈ పరిస్థితులలో వ్యక్తి ప్రాధాన్యత ను తొలగించడం సాధ్యమా అంటే…. చిత్తశుద్ధి ఉంటే సాధ్యంకానిదేమి ఉంటుంది!? వ్యక్తులు గాకుండా, పార్టీలకే చట్ట సభలలో గుర్తింపు లభించిన పరిస్థితుల్లో ఒక ఉదాహరణగా మన శాసన సభ ను తీసుకుందాం. రాష్ట్రం మొత్తం ఒకటే నియోజక వర్గం గా రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. సభలో గల 175 స్థానాలకు పోటీ చేయాలి అనుకునే పార్టీలు – ముందుగా 175 మంది తమ పార్టీ నేతల పేర్లను – ఎన్నికల ప్రకటనకు ముందుగానే ( ఎన్నికల సంఘం నిర్దేశిత గడువు ప్రకారం ) ఎన్నికల సంఘానికి సమర్పించాలి. అలాగే అన్ని రాజకీయ పార్టీలూ చేయాల్సి ఉంటుంది.వీటిని పబ్లిక్ డొమైన్ లో ఎన్నికల కమిషన్ పెడుతుంది కనుక రహస్యం ఏమీ ఉండదు.
అందువల్ల, అన్ని రాజకీయ పార్టీలు, తమ తమ పార్టీ సభ్యుల పేర్లను ప్రాధాన్యతా క్రమం లో పేర్కొంటూ, ఎన్నికల కమిషన్ వద్ద తమ జాబితాలను దాఖలు చేయాలి.
అనంతరం తమ తమ ఎన్నికల ప్రణాళికలతో ఎన్నికల లోకి దిగాలి. ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన ఓటు శాతాన్ని బట్టి ; 175 స్థానాల్లో ఆయా పార్టీలకు అసెంబ్లీలో ఎన్ని స్థానాలు అనేది ఎన్నికల కమిషన్, నిర్ణయించి…. కేటాయిస్తుంది. ఒకసారి శాసన సభ / లోక సభలో సభ్యత్వం కేటాయింపు జరిగాక ; ఇక ఆ చట్ట సభ కాల పరిమితి తీరేవరకు ఆ సభ్యుడు… పార్టీ ఫిరాయించడం కుదరదు. ఫిరాయించిన మరుక్షణం ఆ చట్ట సభ సభ్యత్వం కోల్పోతారు. అంటే…. రెండు మూడు మంది సభ్యుల మెజారిటీ ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు పడిపోవు.
గతం లో 23 మంది ఎంఎల్ఏ లు వైసీపీ లోనుంచి టీడీపీ లోకి, ఇప్పుడు ముగ్గురు టీడీపీ లోంచి వైసీపీ లోకి ఫిరాయించి కూడా…. శాసనసభ సభ్యులుగా కొనసాగుతున్నట్టుగా కొనసాగడం కుదరదు.
నిజానికి ఈ విధానం ఇప్పటికే అమలులో ఉండి ఉంటే ; కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ లో ఎన్నికైన ప్రభుత్వాలకు కాలం చెల్లి ఉండేది కాదు కదా!
ఈ విధానం లో ఏమి జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకు; వైసీపీ కి గత ఎన్నికల్లో దాదాపు 50 శాతం ఓట్లు లభించాయి. కనుక, 175 లో 50 శాతం సీట్లు వైసీపీ కి కేటాయిస్తారు. అంటే….88 స్థానాలు అనుకుంటే ; గతం లో ఎన్నికల కమిషన్ కు సమర్పంచిన 175 మంది సభ్యుల జాబితాలోంచి, మొదటి 88 మంది సభ్యులను శాసన సభ్యులుగా ఎన్నికల కమిషన్ గుర్తిస్తుంది. అలాగే, టీడీపీ కి 40 శాతం ఓట్లకు అనుగుణంగా…. ఆ పార్టీ జాబితా నుంచి 175 లో మొదటి 40 శాతం పేర్లను శాసన సభ్యులుగా గుర్తిస్తారు. జనసేనకు 175 లో ఆరు శాతం వాటా సభ్యులు వస్తారు. ఒక్క శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకునే పార్టీ కి కూడా శాసన సభలో రెండు స్థానాలు లభిస్తాయి.
ఆ విధమైన శాసన సభ….., ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది.
అదే లోకసభ కు వచ్చేసరికి; లోకసభ – దేశం లోని 29 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుక, ఏ రాష్ట్రం నుంచి లోకసభకు పోటీ చేయాలి అనుకుంటున్న పార్టీ… ఆ రాష్ట్రం లోని లోకసభ సభ్యుల సంఖ్యకు అనుగుణంగా తమ సభ్యుల పేర్లను జిల్లాల వారీగా ప్రాధాన్యతా క్రమంలో పేర్కొంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఫలితాల అనంతరం, ఒక్కొక్క జిల్లా నుంచి ఆయా పార్టీలు సాధించిన ఓట్ల శాతానికి అనుగుణంగా రావలసిన స్థానాల సంఖ్యను నిర్ధారించి, ఆ రాష్ట్రానికి సంబంధించిన జాబితాలోని సభ్యులను లోకసభ సభ్యులుగా ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ప్రాంతీయ పార్టీ లు తమ శాసనసభ, లోకసభ జాబితాలను జిల్లాల వారీగా విడి విడిగా గా సమర్పిస్తే ; ఎన్నికల సంఘం కూడా విడి విడిగా చట్ట సభల సభ్యులను జిల్లాల వారీగా ప్రకటిస్తుంది. ఎం ఎల్ ఏ లకు గానీ ; ఎం పీ లకు గానీ సొంత నియోజక వర్గాలు ఉండవు. అందువల్ల సొంత ప్రయోజనాల పట్ల ఆసక్తి ఉండదు. ప్రతి సభ్యుడు మొత్తం రాష్ట్ర ప్రయోజనాల దృష్టితో ఉంటారు. వీరి వ్యవహార శైలికి వారి వారి పార్టీలు బాధ్యత వహించవలసి ఉంటుంది. అందువల్ల వీరు గడప… గడప ఎక్కి దిగాల్సిన పని ఉండదు.
దీనివల్ల, ఎన్నికల్లో అక్రమాలు దాదాపుగా కనుమరుగై పోతాయి. అధికార దుర్వినియోగ అవసరం పడదు. అసెంబ్లీ సమావేశాలు ఇప్పటిలా 20,25 రోజులు కాకుండా… హాయి గా 100,125 రోజులు నిర్వహించుకోవచ్చు.
ఈ సభ్యుల జాబితా తయారీ సమయం లోనే… సంఘవ్యతిరేక, అవాంఛనీయ, కబ్జా, దౌర్జన్య, మాఫియాలతో అంటకాగే శక్తులను పక్కన పెట్టవచ్చు. సమాజం లోని ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, న్యాయవాదులు, ప్రొఫెసర్లు వంటి వారి నుంచి సామాజిక స్పృహ కలిగిన వారితో రాజకీయ పార్టీలు జాబితాలు తయారు చేసి, ఎన్నికల కమిషన్ కు సమర్పించవచ్చు. ఈ జాబితాలు ప్రజలకు ముందుగానే తెలుస్తాయి కనుక ; అభ్యర్థుల గుణగణాలు, అర్హతలు సక్రమంగా లేకపోతే ;ఎన్నికల ఫలితాన్ని అవి ప్రభావితం చేస్తాయనే ‘భయం’ ఆయా పార్టీ నేతలకు ఉంటుంది. పార్టీలు ప్రచారం చేసుకోడానికి ప్రభుత్వమే నేరుగా నిధులు మంజూరు చేయవచ్చు.
ఈ రీతిగా – రాజకీయాలు, ఎన్నికల ప్రక్రియను పట్టిపీడిస్తున్న సమస్త రుగ్మతలకు ‘సంస్కరణల కషాయం’ పట్టించాల్సిన తక్షణావశ్యకతపై సామాజిక స్పృహ కలిగిన మేధావులు, (మాజీ )న్యాయమూర్తులు, న్యాయవాదులు, వైద్యులు, సోషల్ ఆక్టివిస్ట్ లు, స్వచ్చంద సేవకులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వెంట్లు( రిటైర్ అయ్యాకే వారి మెదళ్ళు యాక్టివేట్ అవుతాయంటారు), యువకులు, సమాజ శ్రేయోభిలాషులు మొదలైన వారందరూ కదలాలి. భావి తరాల శ్రేయస్సు దృష్ట్యా వీరంతా నడుం బిగించాలి. ఇప్పటిదాకా మనం గౌరవంగా…. దర్జాగా…. స్వేచ్ఛగా బతికినట్టుగా మన పిల్లలు…. వారి పిల్లలూ…. వారి పిల్లలూ – ఎవరి బతుకు వారు బతకాలి కదా! సృష్టిధర్మం మనతోనే ఆగిపోవడం లేదు కదా!
ఈ ఎన్నికల సంస్కరణ అంశం లో మరింత స్పష్టత కావాలి అనుకుంటే…., నెదర్లాండ్స్ వెళ్లి…: అక్కడి ఎన్నికల వ్యవస్థ నిర్వహణ తీరును అధ్యయనం చేసి రావచ్చు. నెదర్లాండ్స్ ను హాలెండ్ అని కూడా అంటారు. అక్కడి పార్లమెంట్ కు పార్టీలే పోటీ చేస్తాయి. అభ్యర్థులు కాదు. పార్టీల ప్రచార వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. సుమారు రెండుకోట్ల కు అటు ఇటుగా జనాభా ఉన్న అంత చిన్న దేశం లోనే, ప్రజాస్వామిక వ్యవస్థకు అంత గౌరవం లభిస్తుంటే ; రమారమి 140 కోట్ల జనాభాతో, సగం మంది అన్నెం పున్నెం ఎరుగని జనంతో కిటకిటలాడుతున్న ఉన్న మన దేశం- ప్రజాస్వామ్యం ముసుగులో – ఎటువంటి రాజకీయ కశ్మలం లో చిక్కుకు పోయిందో చూస్తున్నాం.
అందుకే, అభ్యర్థుల స్థానం లో రాజకీయ పార్టీలే పోటీ చేసే విధంగా ఎన్నికల సంస్కరణల ఆవశ్యకతను భారత ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు రావలసిన ఆవశ్యకతను సామాజిక శ్రేయస్సు కోరేవారందరూ గుర్తించాలి. లేక పోతే, మనకు – నాటి నేతలు పెట్టిన ప్రజాస్వామిక బిక్ష …. ఈన గాచి నక్కల పాలు చేసినట్టు అవుతుంది. మన డెమోక్రసీ…. క్రిమినలోక్రసీ దిశగా ప్రయాణించడానికి, రెండు, మూడు ఎన్నికల కంటే ఎక్కవ సమయం పట్టదు.