Suryaa.co.in

Features

సాంఘిక  సమానత్వానికి పునాదులు వేసిన పెరియార్

పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి  ఈరోడ్ పట్టణంలో 1879 వ సంవత్సరం సెప్టెంబర్ 17 వ తారీఖున జన్మించారు. ఈయన పెరియార్ గా, తందై పెరియార్ గా, రామస్వామిగా, ఇ.వి.ఆర్.గా కూడా సుప్రసిద్దులు.  నాస్తికవాది, సంఘ సంస్కర్త. తమిళనాడులో ఆత్మగౌరవ ఉద్యమం, ద్రావిడ ఉద్యమ నిర్మాత. దక్షిణ భారతీయులను రాక్షసులుగా, వానరులుగా చిత్రీకరించిందంటూ రామాయణాన్ని, రాముడిని ఈయన తీవ్రంగా విమర్శించారు. 1904లో ఈయన కాశీ లోని విశ్వనాథుడి దర్శనార్థం వెళ్ళినపుడు అక్కడ  జరిగిన అవమానంతో ఆయన నాస్తికుడిగా మారాడని చెప్తారు. హేతువాదిగా మారి హిందూ మతాన్ని అందులోని కులవ్యవస్థను అసహ్యించుకున్నారు. మరీ ముఖ్యంగా బ్రాహ్మణ వర్గాన్ని ద్వేషించాడు. వీరి పూర్వీకులు కర్ణాటక ప్రాంతానికి చెందిన కన్నడ బలిజలు.

ఈయన 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్  పార్టీలో ఉండి దేశ స్వాతంత్య్రం  కొరకు పోరాడాడు. తదనంతర కాలంలో ఈయన, ఇతని అనుచరులు దేశ స్వాతంత్య్రం కన్నా సాంఘిక సమానత్వం కొరకు ఎక్కువగా పోరాడారు. అన్ని కులాల వారికీ సమానంగా దేవాలయ ప్రవేశార్హత ఉండాలని వాదించారు. 1937 వ సంవత్సరంలో రాజాజీ నేతృత్వంలోని మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రభుత్వం హిందీ భాషను మద్రాసు రాష్ట్ర పాఠశాలల్లో ప్రవేశపెట్టినపుడు పెరియార్ తన జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో హిందీ వ్యతిరేకోద్యమాన్ని పెద్దయెత్తున చేపట్టి చివరికి హిందీ బోధనను విరమింపచేశాడు.తరువాత ఈయన పార్లమెంటరీ రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయి జస్టిస్ పార్టీని ద్రావిడర్ కళగం అనే సామాజికోద్యమ సంస్థగా మార్చాడు. రాజకీయాలవైపు మొగ్గుచూపిన కొందరు అనుచరులు ఆయన నుండి విడిపోయి అన్నాదురై నాయకత్వంలో ద్రవిడ మున్నేట్ర కళగం (డి.యమ్.కె.) అనే పేరుతో కొత్త పార్టీ ప్రారంభించారు. ఆ తదుపరి 1969లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధి నాయకత్వంతో విభేదించిన యమ్.జి.రామచంద్రన్ డి.యమ్.కె. నుండి విడిపోయి అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఎ.ఐ.ఎ.డి.యమ్.కె.) అనే పేరుతో మరో పార్టీ స్థాపించారు. ఈ రెండు పార్టీలే అప్పటి నుండి నేటివరకు తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలు, సాంస్కృతిక జీవితంపై పెరియార్ (గొప్ప వ్యక్తి)గా సుపరిచితులైన ఈవీ రామస్వామి ప్రభావం ఎంత ఉంటుందో చెప్పలేం. కమ్యూనిస్టు నుంచి దళిత ఉద్యమం వరకు తమిళనాడులోని జాతీయవాదుల నుంచి హేతువాదుల వరకు అన్ని భావజాలాలకు సంబంధించిన వారు ఆయనను గౌరవిస్తారు. తమ ప్రసంగాలలో ఆయన మాటలను కోట్ చేస్తారు. ఆయన నుంచి స్ఫూర్తిని పొందుతారు. హేతువాది, నాస్తికుడు, పీడిత ప్రజల తరపున పోరాటం చేసిన పెరియార్ సామాజిక, రాజకీయ జీవితంలో అనేక మలుపులు ఉన్నాయి. ఆయన 1919లో గాంధేయవాదిగా, కాంగ్రెస్ కార్యకర్తగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. మద్యపాన నిషేధం, అంటరానితనం నిర్మూలన లాంటి గాంధీ విధానాల పట్ల ఆకర్షితులయ్యారు.

తన భార్య నాగమ్మాయ్, సోదరి బాలాంబాల్ కూడా రాజకీయాల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. వారిద్దరూ కల్లు దుకాణాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాటం చేశారు. కల్లు-వ్యతిరేక ఉద్యమంలో భాగంగా ఆయన తన సొంత కొబ్బరి తోటనే నాశనం చేశారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ మద్రాస్ ప్రెసిడెన్సీ యూనిట్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పెరియార్ రామస్వామి నాయకర్  ద్రవిడనాట నాస్తిక, ఆత్మగౌరవ, స్త్రీ హక్కుల కోసం పోరాటాన్ని నడిపించినవాడు. తమిళ భూమి మీద నిలబడి “తమిళ భాష ఒక ఆటవిక భాష” అని అనగలిగి, ఎందుకలా అనవలసి వచ్చిందో చెప్పిన ధైర్యం పెరియార్ ది. ఇప్పటికీ చాలామందికి పెరియార్ అనగానే నాస్తిక ఉద్యమం మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఆయన ఆలోచనలు అనంతమైన పీడనకు వ్యతిరేకంగా ఉండేవి. ‘ఎందుకు?’ అని ప్రశ్నించటం మొదలు పెట్టినవాడు ఎంత సామాజిక మార్పు తీసుకురాగలడో నిరూపించి చూపించిన రామస్వామి నాయకర్ జీవితం గురించి తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. ఆయన కేవలం “దేవుడు లేడు” అనే మాట దగ్గరే ఆగిపోలేదు. నిజానికి నాస్తికత్వం అనేది రామస్వామి చెప్పిన వాటిల్లో ఒకటి మాత్రమే. తమిళ, ఇంగ్లీష్లో పెరియార్ జీవితం మీదా, ఆయన ఆలోచనల మీద పుస్తకాలు వచ్చినా  అవి మిగతా ప్రాంతీయ భాషల్లోకి పెద్దగా అందుబాటులోకి రాలేదు. అందుకే ఆయన సమగ్ర జీవితం మీదా, ఆయన పూర్తిస్థాయి ఆలోచనల మీదా ఇప్పటికీ చాలా అపోహలున్నాయి. వివక్షలకు వ్యతిరేకంగా, విలువల పేరుతో బానిసత్వాన్ని సమర్థించే పోకడలకు ఎదురు నిలవడం అంటే జీవితాన్నే ఉద్యమం చేసుకోవటం. ఆ ఉద్యమాన్ని రాబోయే తరాలకు అందించటం. పెరియార్ తన జీవితంలో కొన్ని దేవాలయాలను కూడా రిపేర్ చేయించాడని తెలిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. చిన్నకూలీ ఇంటి బిడ్డగా మొదలైన వ్యక్తి ఒక రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఒక పొలిటికల్ పార్టీని నిర్మాణం చేసేదాకా ఎదిగిన క్రమం, ఆ పోరాటం, కోట్లమంది ఒక చట్రంలో బతుకుతుంటే, అది సరైంది కాదని చెప్పటానికి. వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొంటూ నిలబడటం మామూలు విషయం కాదు. దేశదేశాల్లో ఇప్పటికీ ఆయన ప్రభావం ఉన్న మనుషులు లక్షల సంఖ్యలో పెరుగుతున్నారు. స్త్రీల హక్కులలో, వాళ్ళ అభివృద్ధి, అంగీకరించే దిశలో మార్పు జరుగుతూ వస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి, పెరియార్ ని, ఆయన ఆలోచనా విధానాన్ని ఇప్పటి తరం అధ్యయనం చేయాలి. వైకోమ్ పోరాటం, ఆత్మగౌరవ సంస్థ ప్రారంభం, ఆత్మ గౌరవం వివాహాలు, తమిళ భాషలో అక్షరాల మీద చేసిన రీసెర్చ్ లాంటి అంశాలతో పాటు అత్యంత వివాదాస్పదం అయిన ఆయన లేటు వయసు వివాహం, స్త్రీల హక్కులు, సామాజిక న్యాయం గురించి ఆయన ఆలోచనలు ఎలా ఉండేవో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెరియార్ రచనలు మరియు ఇతర  ద్రావిడ భాష  రచనలు   భాషాడంబరాలు లేకుండా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేంత సరళంగా ఉండేట్లు చూడాలి, పెరియార్ వాదాన్ని ముందుకు తీసుకుపోవడానికి, పెరియార్ జీవితాన్ని తెలుసుకోవడానికి  ప్రాథమికంగా ఇలాంటి రచనలు ఉపయోగపడతాయి. పెరియార్   24 డిసెంబరు 1973 న కన్నుమూశారు,   ఆయన ఆలోచన విధానం సమాజంలో పెను మార్పు తీసుకువచ్చింది.

డాక్టర్ యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక

LEAVE A RESPONSE