నీ నవ్వు చెప్పింది నాకు నేనెవ్వరో ఏమిటో..!

బాసుకి కాకా పడితే ఇంక్రిమెంటు..
నాయకుడికి
భజన చేస్తే పదవి..
ఎవడినైనా పొగిడితే ఫేవర్..

అదే పెళ్ళాంతో
ఆమె గురించే
నాలుగు
మంచి మాటలు చెబితే
లైఫ్ లాంగ్ హ్యాపీ..!

జీవితమే సఫలము..
రాగసుధాభరితము..

ఎవడెవడికో
ఊదేస్తావా బాకా..
పనికిమాలినోళ్ళకి
కూడా కొట్టేస్తావా కాకా..
మీరు సూపర్ సార్…
నువ్వు కేక గురూ..
తమరు తోపండి..
వరస ఇదండీ..
పొద్దున లేస్తే ఎవడో ఒకడి
ముందు చేతులు నలుపుడే..
పొద్దు పొడిస్తే
కాళ్ళు పిసుకుడే..
జీవితమంతా ఇదే యావ..
బ్రతుకుతెరువు నేర్పిన
ఒకటే త్రోవ..!

ఇంత మంది ముందు
ఇన్ని చేసే నువ్వు
పెళ్ళాంతో నాలుగు
మంచి మాటలు చెప్పాలంటే
ఊహు..అహం అడ్డు..
గాడిద గుడ్డు..
వంట బాగుందే..
నీలా ఎవ్వరూ చెయ్యలేరోయ్..
ఈ చీర నీకు నప్పిందే..
ఇవేగా ఇల్లాలు కోరుకునేది..!
అవి చెబితే తరిగిపోతుందా
నీ సొమ్ము..
తగ్గిపోతుందా నీ దమ్ము..!!

చిన్న చిన్న పొగడ్తలకే
కరిగిపోయే గుణం..
పెరిగిపోయే రుణం..
ఆగిపోదా ఇంట్లో రణం..
పొగడడం అదేమంత దారుణం..
నాలుగు మంచి మాటలు..
అవే నీ ఆలి పాలిటి
వరాల మూటలు..!

నీ కోసమే పుట్టి..
తన ఇంటిని..
కన్నవాళ్ళను వదిలి
నీ ఇల్లు మెట్టి..
నీ ఇంటి పేరే తన ఇంటి పేరై..
నీ అనురాగమే కాసుల పేరై..
నీ పనులన్నీ తన పనులై..
నీ కోసం అనునిత్యం
ఎదురుచూసే కనులై..
నీ కష్టం తనకు కష్టమై..
నీ ఇష్టం తన ఇష్టమై..
నువ్వు తింటే
తన కడుపు నిండి..
నీ కోసమే తన కడుపు పండి
నువ్వే తనై…
నిన్ను సేవించడమే
తన పనై..
నువ్వే జీవితమై..
ఇహమై..పరమై..
నీతోడి బ్రతుకు వరమై..
తన నుదుటి కుంకుమే
నీ ఆయువై..
నీ అనురాగమే
తనను బ్రతికించే
ప్రాణ వాయువై..
నువ్వు కట్టిన సూత్రమే
తనను బ్రతికించే మంత్రమై..
నీ కోసమే బ్రతికే నీ ఇల్లాలు
తన రాకతోనే సరి అగును
నీ బ్రతుకున ఎత్తుపల్లాలు..!

ఏమే నువ్వు తిన్నావా..
అలసిపోయావు..
కాసేపు నడుం వాల్చు..
ఒంట్లో నలతగా ఉందా..
డాక్టర్ దగ్గరికి వెళ్దామా..
ఆ మాటలే మందులు..
నీ బాసటే ఊరట..
నువ్వు నుదుటిపై
చెయ్యి వేస్తే
అదే సంబరం…
దగ్గరికి తీసుకుంటే పండగ!

నీతో ఏడడుగులు నడిచి
ఆపై నిన్ను జీవితాంతం నడిపించే
నీ భాగస్వామి
నీ బ్రతుకంతా తానే నిండి ఉండే సర్వాంతర్యామి..
నీ కలల ప్రపంచపు రాణి
నీ పట్టపురాణి..!

నువ్వే జీవితమని ఎంచి..
నీ సేవలో తనను
తానే మైమరచి..
జీవిత పర్యంతం
నిను సేవించే
నీ శ్రీమతి..
నిను కోరే బహుమతి..
నీ ఇంట మొదటగా
పట్టే హారతి
తన త్యాగాలను గౌరవించే
నీ పరిణితి..
అన్నిటినీ మించి..చిటికెడు
పసుపుకుంకుమలకే
మురిసిపోదా నీ సతి..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply