-వీటి వెనుక ఒకటి మతం, రెండు కార్పొరేట్ల గనుల దోపిడీ
-మణిపూర్ మండిదా ? దగ్గరుండి కేంద్ర రాష్ట్ర పాలకులు మండించారా ?
మణిపూర్ జనాభా 2023 జనాభా లెక్కల ప్రకారం 28 లక్షలు, వీరిలో అత్యధిక జనాభా మైతీలు, నాగాలు, కుకీలు. మైతీలు 53 శాతం, నాగాలు 24 శాతం, కుకీ/జో(చిన్కుకీమిజో)లు 16 శాతం ఉన్నారు. వీరిలో
హిందువులు 41.39 శాతం, క్రిస్టియన్లు 41.29, ముస్లిముల జనాభా 8.4( సుమారు 2.40 లక్షలు) శాతం, క్రిస్టియన్ల జనాభా 11.79 లక్షలు, ఉన్నారు. అలాగే సిక్కులు, బుద్దిష్టులు, జైన్లు కూడా ఉన్నారు. ఇందులోనూ ఇంపాల్ వెస్ట్, ఈస్ట్, బిష్ణుపూర్, తౌబాల్ జిల్లాల్లో హిందువులు ఎక్కువగా ఉన్నారు సేనాపతి, చుర్‌చందాపూర్, ఉకృల్, చందేల్, తెమెన్గ్లాంగ్ జిల్లాల్లో క్రిస్టియన్లు కీలకంగా ఉన్నారు.
క్రిస్టియన్లు అధికంగా ఉన్న చుర్‌చందాపూర్, ఉకృల్, చందేల్, తెమన్గ్లాంగ్ జిల్లాల్లో సహజ వనరులు గనులు అధికంగా ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎక్కువగా కొండ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఇటీవల కొన్ని మీడియాల్లో ఎక్కువమంది ప్రజలకు తక్కువ సదుపాయలు, తక్కువమంది ప్రజలకు ఎక్కువ సదుపాయాలు ఉన్నాయి. అందుకే ఘర్షణ జరిగిందని తప్పుడు ప్రచారం మొదలుపెట్టాయి.
అసలు విషయంలోకి వద్దాం
గత దశాబ్దకాలంలో ఈ ప్రాంతంలో గనులు, విలువైన ఖనిజాల కోసం భారత ప్రభుత్వ రంగ సంస్థ జిఎస్ఐ పెద్దఎత్తున సర్వేలు చేపట్టింది. ఈ సర్వేల్లో ప్రపంచంలోనే అత్యంత అరుదైన సర్పంటైటిస్(ఆకఁపచ్చ గ్రానైట్, ఏమరాల్డ్ గ్రీన్ గ్రామీణ భాషలో ఇమరాళ్ల పచ్చ), ప్లాటినమ్ గ్రూప్ మెటల్స్, ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్, నికెల్, లైమ్‌స్టోన్, క్రోమైట్, కాపర్, మెలచైట్, అజురైట్, మెగ్నటైట్ ఉన్నట్లు గుర్తించారు. ఇవి కాకుండా అనేక విలువైన ఖనిజాలకు కేంద్రంగా మణిపూర్ కొండ(గిరిజన) ప్రాంతాలను గుర్తించారు.
ఈ ప్రాంతాల్లో గిరిజనులు ఉండటం వారికి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉండటంతో ,సహజ వనరులను కాపాడుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోనే గసగసా సాగు జరుగుతోంది. ఇప్పటి వరకూ సక్రమమేనని చెప్పిన బిజెపి పాలకులు, ఘర్షణలు జరిగాక గిరిజన ప్రాంతాల్లో గసగసాల లాంటి డ్రగ్స్ ఎక్కువగా ఉన్నాయని ప్రచారం మొదలుపెట్టింది. గసగసాలు మసాలాల్లో కూడా వాడతారు. ఆ విషయం మర్చిపోయి డ్రగ్స్ ఉత్పత్తి అనే ప్రచారం చేపట్టింది.
మరి ఇన్నాళ్లూ ఎందుకు చూస్తు ఊరుకుండిపోయారనే విషయానికి, ఎవరూ సమాధానం చెప్పరు. ఎందుకంటే అది కేవలం అవసరం కోసం, దాడి చేయడానికి వీలుగా వాడుకునే ప్రచారం కనుక. అయితే అత్యధిక జనాభా కలిగిన మైతీలు కూడా , తమను ఎస్టి జాబితాలో చేరిస్తే కొండల్లో ఉన్న వనరులపై తమకూ హక్కు వస్తుందని ఎప్పటి నుండో వాదిస్తున్నారు. దీన్నీ ఆర్ఎస్ఎస్, అనుబంధ బిజెపి చక్కగా ఉపయోగించుకున్నాయి.
సరే ఆ విషయంలోకి వెళ్లేముందు అక్కడ మైనింగ్ వ్యవహారాల గురించి చర్చించుకఁంటే ముఖ్యంగా లైమ్‌స్టోన్(సుద్ధరాయి) సిమెంటు పరిశ్రమకు అత్యంత విలువైన ముడి ఖనిజం 20 మిలియన్ టన్నులకు పైబడి ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు సర్పంటైటిస్(ఆకుపచ్చ గ్రానైట్ రాయి) కూడా ఇక్కడ అధిక మొతాదులో ఉంది.నిఖెల్, ప్లాటినమ్ గ్రూప్ ఎలిమెంట్స్ కూడా గణనీయంగా ఉన్నాయి.
దీనిపై మణిపూర్ ప్రభుత్వం 2017లో సుమారు 39 కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. అయితే గిరిజనులు ఎక్కువగా ఉన్న కొండ ప్రాంతాల్లో వారికి హక్కులు ఉన్న నేపథ్యంలో అక్కడ మైనింగ్ దోపిడీకి సాధ్యం కావడం లేదు. సహజ వనరులను వారు కాపాడుకుంటున్నట్లు కొన్నీ సంస్థలు ఇచ్చిన నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ కీలకమైన సున్నపురాయి, ఆకుపచ్చ గ్రానైట్, ప్లాటినం, నికెట్ వంటి వాటిని దోచుకోవడం కార్పొరేట్లకు అత్యవసరంగా మారింది.
2022లో దీనికి బిజెపి దాని అనుబంధ ఆర్ఎస్ఎస్ తోడైంది. సహజ వనరులపై పట్టు ఎక్కువగా ఉన్న మైతీలకే అందాలని రెచ్చగొట్టింది. అప్పటి నుండి అగ్గి రాజుకుంటూనే ఉంది. 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 34 స్థానాల్లో బిజెపి గెలిచింది. మరో 20 స్థానాల్లో బిజెపి అనుకూల స్థానిక పార్టీల వారు గెలిచారు. ముందు అనుకూలంగా లేకపోయినా గెలిచాక అనుకూలంగా మారాయి. అనంతరం దారుణాలు మొదలయ్యాయని పలువురు సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.
మైతీలు మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండగా కుకీలు, నాగాలు ఇతరులు గిరిజన ప్రాంతాల్లో ఉంటున్నారు. వారిలోనూ ఎక్కువమంది క్రిస్టియానీటి ఆచరిస్తున్నారు. దీంతో దోపిడీ కోసం నక్కికూర్చున్న కార్పొరేట్లకు మతం కూడా తోడైంది. అంతే మణిపూర్ మండిపోయింది. పోలీసులు ఏమీచేయలేకపోయారు. వారి వద్ద ఉన్న ఆయుధాలు కూడా మైతీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. కుకీలు, నాగాలు కనబడితే కనబడినట్లు చంపడం, కాల్చిపారేయడం, అత్యాచారాలు చేయడం.
వీటి వెనుక ఒకటి మతం, రెండు కార్పొరేట్ల గనుల దోపిడీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే 70 రోజుల తరువాత వీడియో వస్తేగానీ, ప్రపంచానికి ఘటనలు తెలియలేదని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అలా తెలియనీయకుండా ఇంటర్నెట్ ఆపేసి దాడులు చేయించింది బిజెపి ప్రభుత్వం అనే విషయాన్నీ మర్చిపోయాయి.
రెండు అంశాలను పక్కదారి పట్టించింది బిజెపి. అందులో ఒకటి యుసిసి, రెండు అదానీ దోపిడీ. ప్రస్తుతం ఈ రెండూ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశం నుండి అసందర్భ అంశాలుగా మారిపోయాయి. బిజెపి ప్రభుత్వ ప్రోద్బలంతోనే ఘర్షణలు జరిగాయని బిజేపీ ఎమ్మెల్యే పౌలింలాల్ హౌకీప్ కూడా చెప్పడం విశేషం.
ఇప్పుడు చెప్పండి మణిపూర్ మండిందా ?
దగ్గరుండి కేంద్ర రాష్ట్ర పాలకులు మండించారా ?
– అవులయ్య