ఈ నెల 9వ తేదీ నుంచి 11 వరకు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. 10, 11 తేదీల్లో నగరంలో మరోమారు ఇండియన్ రేసింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. 9వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 11న రేసింగ్ ముగిసే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఈ సందర్భంగా ఖైరతాబాద్ నుంచి ఐమ్యాక్స్, తెలుగుతల్లి కూడలి వైపు వెళ్లే మార్గాలను మూసివేయనున్నారు. కాబట్టి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది.
కాగా, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ఫార్ములా-ఈ పోటీలకు సన్నాహకంగా భావిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌ను ఇటీవల నిర్వహించారు. అయితే, ప్రధాన పోటీలు జరగకుండానే అవి ముగిశాయి. సమయాభావానికి తోడు, క్వాలిఫయింగ్ రేస్‌లో కొత్త ట్రాక్‌పై కార్లు పలుమార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. దీంతో రేసింగ్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఇప్పుడీ పోటీలను తిరిగి 10, 11 తేదీల్లో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది.