– విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాలను ప్లేస్కూళ్లగా మార్పు చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘ఒకటి, రెండు తరగతిలను కలిపి ఒక యూనిట్‌గా మార్పు చేస్తున్నాం. ఇక్కడ ఫౌండేషన్ కోర్సును తీసుకువస్తున్నాం. 3 నుంచి 10వ తరగతి వరకు ఒక యూనిట్‌గా పరిగణిస్తాం. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తున్నాం. పాఠశాలల పరిధి మూడు కిలో మీటరు నుంచి ఒక కిలో మీటరు వరకు కుదించాం. అవసరమైన చోట జూనియర్ కళాశాలలను డిగ్రీ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేస్తున్నాం. కానీ కొత్తగా కళాశాలలు ఇవ్వం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు:- మాజీ మంత్రి కొడాలి నాని
ఎన్ని గుంపులొచ్చినా ఎదుర్కొనేందుకు సింహం రెడీగా ఉందని సీఎం జగన్‌ను ఉద్దేశించి మాజీమంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు కలిసినా జగన్‌ను ఏం చేయలేరని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాల కోరని దుయ్యబట్టారు. జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంటే బాబుకు ఇంకో పార్టీ ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలు చివరివి అని జోస్యం చెప్పారు. చంద్రబాబుకు అధికారం కావాలి. పవన్‌కు డబ్బు కావాలన్నారు. చంద్రబాబు, పవన్‌తో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని కొడాలి నాని ఎద్దేవా చేశారు.
జగన్‌ను ఒంటరిగా ఎదురించే ధైర్యం టీడీపీకి లేదు:- మంత్రి జోగి రమేష్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నారు కాబట్టే.. చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌ను ఒంటరిగా ఎదురించే ధైర్యం టీడీపీకి లేదన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీకి రాగలరా? అని మంత్రి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపిచ్చారు. మన బలం చూపించాల్సిన సమయం వచ్చిందని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.