-రామోజీరావు మరణం తీవ్రంగా కలచివేసింది
– ప్రజాస్వామ్యం కోసం తపించిన తీరు ఆదర్శప్రాయం
– పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు
నిజాలను ప్రజలకు చేరవేయాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం పని చేసేలా ఉండాలని తపించే ఏకైక వ్యక్తి చెరుకూరి రామోజీరావు మరణం అత్యంత బాధాకరం. ఎక్కడో చిన్న రైతు కుటుంబంలో పుట్టి అచంచలమైన కష్టంతో ప్రపంచం మెచ్చే వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించిన తీరు అనితర సాధ్యం. ఎన్నో ఆటుపోట్లు.. మరెన్నో అవమానాలు అన్నింటినీ ఎదురొడ్డి, రామోజీరావు ఈ స్థాయికి చేరారు. వాస్తవాలు మాత్రమే ప్రజలకు తెలియాలని ఈనాడు అనే మీడియా వ్యవస్థను స్థాపించి.. ప్రజలకు తోడుగా నిలిచారు.
మార్గదర్శి చిట్ఫండ్, ప్రియా ఫుడ్స్, కళాంజలి లాంటి ఎన్నో వ్యాపార సంస్థల్ని స్థాపించారు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేశారు. అతి తక్కువ సమయంలోనే జాతీయస్థాయి నెట్ వర్క్ గా ఈటీవీని విస్తరించారు. తెలుగు నాట ఎన్ని వార్తా పత్రికలొచ్చినా, ఎన్ని టీవీ ఛానళ్లు వచ్చినా.. నిజ నిర్ధారణ కోసం చూసే ఏకైక న్యూస్ నెట్వర్క్గా ఈనాడు, ఈటీవీని రూపుదిద్దారు. రామోజీ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఆయన మృతి మీడియా రంగానికి, తెలుగుజాతికి తీరని లోటు.