Suryaa.co.in

Andhra Pradesh

తితిదే ఓఎస్డీ డాలర్ శేషాద్రి హఠాన్మరణం!

శ్రీతిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి కన్నుమూశారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సోమవారం వేకువజామున ఆయనకు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.. కార్తీక దీపోత్సవంలో పాల్గొనేందుకు ఆయన విశాఖకు వచ్చిన ఆయన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే గుండెపోటుతో మరణించినట్టు తెలుస్తోంది. 1978 నుంచి డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలో కొనసాగుతున్నారు. 2007లో రిటైర్ అయినప్పటికీ శేషాద్రి సేవలు అనివార్యం కావడంతో ఆయనను టీటీడీ తిరిగి ఓఎస్డీగా కొనసాగింది. కాగా, డాలర్ శేషాద్రి మరణం టీటీడీకి తీరని నష్టమని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆ విషయంలో డాలర్ శేషాద్రి అదృష్టవంతుడు: స్వరూపానందేంద్ర స్వామి
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి మృతిపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. డాలర్ శేషాద్రితో శారదా పీఠానికి సుదీర్ఘకాలం అనుభవం ఉంటుందన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించిన ప్రతి ఒక్కరికీ డాలర్ శేషాద్రి సుపరిచితులు అని స్వరూపానందేంద్ర అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది డాలర్ శేషాద్రి ఆప్యాయతను పొందారని.. ఆయన హఠాన్మరణం తన హృదయాన్ని కలచివేసిందని తెలిపారు. నిత్యం వెంకటేశ్వరస్వామి పాదాల చెంత జీవించారని.. ఈ విషయంలో డాలర్ శేషాద్రి అదృష్టవంతుడు అని అభిప్రాయపడ్డారు. ఆయన ఆత్మ శాంతించాలని.. ఆయన సాక్షాత్తూ మహావిష్ణువు హృదయంలోకి చేరాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు డాలర్ శేషాద్రి మరణంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. శేషాద్రి మరణవార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు. శేషాద్రి జీవితమంతా స్వామివారి సేవలో తరించిన ధన్య జీవి అన్నారు. 1978 నుంచి శ్రీవారి సేవలో తరిస్తున్న శేషాద్రి మరణం టీటీడీకి తీరని లోటు అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అందరితో ప్రేమగా, ఆలయ కార్యక్రమాల్లో అధికారులు, అర్చకులకు డాలర్ శేషాద్రి పెద్ద దిక్కుగా పనిచేశారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
అటు శేషాద్రి మరణంపై టీటీడీ మాజీ జేఈవో శ్రీనివాసరాజు కూడా స్పందించారు. తనకు డాలర్ శేషాద్రి ప్రాణ సమానుడు అని… ఆయన లక్షలాది మంది శ్రీవారి భక్తులకు ప్రీతిపాత్రుడు అని తెలిపారు. శేషాద్రి సేవలు టీటీడీకి ఎప్పటికీ గుర్తుండిపోతాయని.. 50 ఏళ్లుగా స్వామివారికి సేవలు అందించిన మహనీయుడు అని కొనియాడారు. శేషాద్రికి ముందు…శేషాద్రి తరువాత అన్నట్లు టీటీడీలో చరిత్ర లిఖించబడుతుందన్నారు. శేషాద్రి మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని శ్రీనివాసరాజు వ్యాఖ్యానించారు. చివరి నిమిషం వరకు స్వామి సేవలోనే తరిస్తూనే పరమపదించాలన్న తన కోరికను శేషాద్రి నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE