– రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ రూ 3300, రూ 7000 చొప్పున భక్తులకు అంటగట్టిన ముఠా
– తిరుమల ఒకటవ, రెండవ పోలీసు స్టేషనల్లో విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు
– ముఠాలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తో పాటు దళారీలు
– కేసుల నమోదు
తిరుమల శ్రీవారి దర్శనం కు సంబంధించి గతంలో జారీ చేసిన ప్రత్యేక ప్రవేశ దర్శనం ( ఎస్ఈ డి) టికెట్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కొత్తగా జారీ చేసిన టికెట్లు గా భక్తులను మోసగించిన ముఠా పై టీటీడీ విజిలెన్స్ అధికారులు తిరుమల ఒకటవ, రెండవ పట్టణ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రూ 300 టికెట్ ను రూ 3300 మరియు రూ 7000 లెక్కన భక్తులకు అంటగట్టారు. ఈ. ముఠాలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తో పాటు దళారీలు, గతంలో త్రిలోక్ ఏజెన్సీ టికెట్ల కౌంటర్లలో పని చేసిన బాయ్స్ ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ కు చెందిన నలుగురు భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుపతిలో కొందరు దళారులు తాము దర్శనం టికెట్లు ఇప్పిస్తామని చెప్పి రూ 300 ప్రత్యేక ప్రవేశ టికెట్ కు రూ 3300 చొప్పున వసూలు చేసి నకిలీ టికెట్లు భక్తులకు ఇచ్చి తిరుమల శ్రీవారి దర్శనానికి పంపారు.
అదే విధంగా మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు భక్తులు నూతన సంవత్సరం సందర్భంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. తిరుపతి లో దళారి వీరిని నమ్మించి రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం నకిలీ టికెట్ కు రూ 7000 చొప్పున ముగ్గురికి రూ 21, 000 వసూలు చేసి వారికి నకిలీ టికెట్లు అంటగట్టి తిరుమల కు పంపారు.
దర్శనం టికెట్ల స్కానింగ్ కేంద్రం వద్ద నకిలీ టికెట్లు పసిగట్టిన విజలెన్స్ సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు సివిఎస్వో గోపీనాథ్ జెట్టి ఆదేశం మేరకు భక్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించారు. వారు అందించిన సమాచారం మేరకు విచారణ జరిపి ఆదివారం ఈ ముఠాకు చెందిన ఏడుగురు వ్యక్తుల పై తిరుమల ఒకటవ, రెండవ పట్టణ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.
తెలంగాణకు చెందిన భక్తులను మోసగించిన బాలాజి అలియాస్ బాలు (దళారి), అరుణ్ (లడ్డూ కౌంటర్ సిబ్బంది), ఎం. కృష్ణారావు ( ఎస్పీ ఎఫ్ కానిస్టేబుల్) నాగేంద్ర ( గతంలో త్రిలోక్ ఏజెన్సీ టికెట్ కౌంటర్ బాయ్) మీద ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 01/2022 తేదీ 02 – 01- 2022 ఐపీసీ సెక్షన్లు 420, 468, 471, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ భక్తులను మోసగించిన చెంగారెడ్డి ( దళారి), జె. దేవేంద్ర ప్రసాద్, ఈ వెంకట్ ( గతంలో త్రిలోక్ ఏజెన్సీ కౌంటర్ బాయ్స్) మీద రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై క్రైమ్ నెంబర్ 02/2022 తేదీ 02 -01- 2022 ఐపీసీ సెక్షన్లు 420, 468, రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ లో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి విజ్ఞప్తి చేశారు. భక్తులను మోసగించి అధిక ధరలకు టికెట్లు విక్రయించే వారిమీద, నకిలీ టికెట్లు అంటగట్టే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారులకు సంబంధించిన సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.