రైతులారా సంబరాలు కాదు.. నిరసన వ్యక్తం చేయండి

Spread the love

తెలంగాణా రాష్ట్ర రైతులకు గత 4 ఏళ్లలో రైతు బంధు పెట్టుబడి సహాయ పంపిణీ 50,000 కోట్లకు చేరినందుకు సంబరాలు చేసుకోవాలని తెరాస పార్టీ పిలుపు ఇచ్చింది.ఇది అత్యంత హాస్యాస్పదం. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ విధానం రూపొం దించకుండా, విచ్చలవిడి పంటల ప్రణాళికలతో రైతులను నష్టాల కొలిమి లోకి నెడుతున్న ఈ ప్రభుత్వం చాలా ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసి ఉంటుంది.రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను అమ్ము కోలేక బలవన్మరణాలకు పాల్పడడానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? రాష్ట్రంలో 2014 నుండీ జరిగిన 7000 రైతు ఆత్మహత్యలకు బాధ్యత ఎవరు తీసుకుంటారు?

జీవో 173,194 ప్రకారం 5400 రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు పరిహారం అందక, ఆ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? 2018 నుండీ కనీసం పెన్షన్ లు కూడా రాక ఎదురు చూస్తున్న వారు పడుతున్న ఇబ్బందులకు ఎవరు బాధ్యత తీసుకుంటారు?రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులను గుర్తించనందువల్ల,వారి ఆత్మహత్యలకు, కష్టాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు? వేలాది మంది పోడు రైతులకు అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వనందువల్ల ఆ రైతు కుటుంబాలకు జరుగుతున్న వేల కోట్ల నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?పంటలు పండని రియల్ ఎస్టేట్ భూములకు,కొండలకు, గుట్టలకు కూడా రైతు బంధు పేరుతో వేల కోట్ల రూపాయల దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?

రుణ మాఫీ పథకం అమలు కానందువల్ల రైతులపై పడిన వడ్డీ భారానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?రుణమాఫీ అమలుకాక, సంస్థాగత రుణాలు అందక ప్రైవేట్ అప్పుల భారంలో కూరుకుపోయిన రైతు కుటుంబాల నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రాష్ట్రంలో పంటల బీమా పథకాలు అమలు కాక,ప్రతి సంవత్సరం రైతులకు జరుగుతున్న వేల కోట్ల నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు?ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల,ముఖ్యంగా భారీ వర్షాలతో, వడగండ్లతో పంటలు నష్ట పోయినా,ఒక్క సంవత్సరం కూడా ఇన్పుట్ సబ్సిడీ అందక, ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చినా అమలు కాక, ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్న రైతుల కష్టాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు?

ప్రతి సంవత్సరం పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు ( MSP) అందక రైతులకు జరిగిన వేల కోట్ల నష్టానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? రైతు బీమా పథకం కేవలం భూమి యజమానులకు మాత్రమే అందడం వల్ల , భూమి లేని అనేక గ్రామీణ,ఆదివాసీ ప్రాంతాల కుటుంబాలు కుటుంబ పెద్ద మరణాలతో వీధిన పడ్డాయి. ఈ మరణాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు ?

ప్రభుత్వం విచ్చలవిడిగా భూసేకరణ చేస్తూ భూములు గుంజు కోవడం వల్ల, సకాలంలో సరైన నష్ట పరిహారం అందించక పోవడం వల్ల రాష్ట్రంలో భూ సేకరణ బాధితులకు జరుగుతున్న నష్టాలకు ఎవరు బాధ్యత తీసుకుంటారు?

నిజానికి ఈ నేరాలు అన్నీ ప్రభుత్వమే చేసింది. గ్రామీణ,ఆదివాసీ ప్రాంతాల ప్రజల ఈ కష్టాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఈ నష్టాల విలువ లెక్క వేస్తే లక్ష కోట్లకు పైగానే ఉంటుంది..అంటే అంత మొత్తాన్ని రైతుల నుండి ప్రభుత్వం గుంజుకున్నట్లే.పైగా అనేక హింసలకు,మరణాలకు కారణమవుతున్న మద్యం రాష్ట్రంలో ప్రవహింప చేస్తూ కనీసం 16000 కోట్ల పన్నులను ఈ ప్రభుత్వం దండుకుంటున్నది. మరెన్నో వేల కోట్ల రూపాయలను మద్యం వ్యాపారులకు కట్టబెడుతున్నది..దీనికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వైద్య రంగాలను బలహీన పర్చడం వల్ల. ప్రజలు ప్రైవేట్ విద్యా వైద్య రంగాలపై వేల కోట్లు ఖర్చు చేయవలసి వస్తున్నది. ఈ పరిణామానికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి.అందుకే , గ్రామీణ,ఆదివాసీ ప్రాంతాల ప్రజల పట్ల ప్రభుత్వ ఈ వైఖరిని ప్రశ్నిస్తూ ప్రజలు నిరసించాలి. ఎక్కడికక్కడ అధికార పార్టీ నాయకులను,ప్రజా ప్రతినిధులను ప్రశ్నించాలి.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
అఖిల భారత ఓసీ సంఘం జాతీయ అధ్యక్షుడు

Leave a Reply