– కక్షతో ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ స్టూడెంట్ ప్రాణం తీసేశారు
– ఇది ఆత్మహత్య కాదు, వైకాపా సైకో పాలన చేసిన హత్య
– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ఎస్వీ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులపై అత్యంత దారుణంగా దాడి చేసినవారు టీటీడీ విజిలెన్స్ సిబ్బందిలా లేరని, వైకాపా వీధిరౌడీల్లా ఉన్నారని, కక్షతోనే ఫస్టియర్ విద్యార్థిని చంపేశారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. టిటిడి విజిలెన్స్ సిబ్బంది దాడితో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకి పాల్పడిన విద్యార్థి జితేంద్రకుమార్ ది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ వైకాపా సర్కారు చేసిన హత్య అని లోకేష్ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా నేతల అనుచరగణంతో కలిసి విజిలెన్స్ సిబ్బంది హాస్టల్‌లో చేస్తున్న పెత్తనాన్ని ఎదిరించినందుకే జితేంద్ర కుమార్ పై కక్ష కట్టి మరీ అంతం చేశారని ఆరోపించారు. విద్యార్థిపై విజిలెన్స్ సిబ్బంది దాడిచేసి తీవ్రంగా కొడితే కాలేజీ యాజమాన్యం ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. టిటిడి అధికారులు, చైర్మన్, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థి మృతిపై స్పందించకపోవడం అనుమానాలకి తావిస్తోందన్నారు. టిటిడి విజిలెన్స్ సిబ్బంది దాడి వల్ల చనిపోయిన జితేంద్రకుమార్ కుటుంబానికి 50 లక్షలు పరిహారం చెల్లించాలని, కారకులని కఠినంగా శిక్షించాలని, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో మితిమీరిన వైకాపా రాజకీయ జోక్యానికి ఫుల్ స్టాప్ పెట్టాలని లోకేష్ డిమాండ్ చేశారు.