Suryaa.co.in

Andhra Pradesh Telangana

తెలంగాణలో మళ్లీ నిలబడతాం.. తలపడతాం!

– కాసాని నేతృత్వంలో టీడీపీకి కొత్త రూపు
– ఉధృతంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాలు
– ప్రజా ఉద్యమాలతో బలపడతాం
– మహిళా సమస్యల పరిష్కారం కోసం విస్తృత పోరాటాలు
– మహిళల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ యోచన
– సమస్యల పరిష్కారాల కోసం కాలేజీ స్థాయిలో సెమినార్లు
– కాసాని మద్దతుతో తెలంగాణలో బలీయమైన శక్తిగా తెలుగుమహిళ
– ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం
– ఇతర పార్టీల్లోకి వెళ్లిన టీడీపీ నేతలు తిరిగి పార్టీలో చేరాలి
– టీడీపీలోనే నేతలకు గౌరవం
– ఇతర పార్టీల్లో నేతలకు గౌరవం ఏదీ?
– సీఎంలు అపాయింట్‌మెంట్లు ఇస్తున్నారా?
– రాజకీయాల్లో మహిళలకు గౌరవం ఇచ్చిందే టీడీపీ
– గ్రేటర్ హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తాం
– ఇప్పటికీ రాజధాని ప్రజలు మావైపే
– తెలంగాణపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ
– తెలుగు మహిళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి

తెలంగాణలో మళ్లీ టీడీపీ పట్టుసాధిస్తుందని, అది ఎంతో దూరంలో లేదని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి అన్నారు. ‘మళ్లీ మా పార్టీ నిలబడుతుంది. ప్రత్యర్ధులతో ఎన్నికల్లో తలపడుతుంది. గెలిచి నిలుస్తుంద’ని వ్యాఖ్యానించారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నేతృత్వంలో, పార్టీ కొత్త రూపు సంతరించుకుంటోందని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌పై టీడీపీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని, దీనికి సంబంధించి తమ నాయకత్వం, పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు, ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతుందని వెల్లడించారు. ‘‘గ్రేటర్ ప్రజలు ఇప్పటికీ టీడీపీ వైపే ఉన్నారు. చంద్రబాబు వేసిన అభివృద్ధి ముద్ర చెరగనిది, చెరపలేనిద’’ని షకీలా స్పష్టం చేశారు.

తనకు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన కాసానికి కృతజ్ఞతలు చెప్పిన షకీలారెడ్డి.. త్వరలోనే రాష్ట్ర కమిటీ ఏర్పాటుచేస్తామన్నారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతలు, సీనియర్లకు సముచిత స్థానం ఉంటుందన్నారు. ఎవరూ అసంతృప్తికి గురి కావలసిన పనిలేదన్నారు. కాసాని ఆదేశాలతో కమిటీ రూపకల్పన చేస్తున్నామని చెప్పారు. అధ్యక్షుడు కాసాని మద్దతు, ప్రోత్సాహంతో తెలుగుమహిళ తెలంగాణలో బలీయమైన శక్తిగా ఎదుగుతుందని, ఆ మేరకు మహిళా ఉద్యమాలు నిర్మిస్తామన్నారు.
కొత్త కమిటీ ఆధ్వర్యంలో జిల్లాల్లో మహిళా సమస్యల పరిష్కారం కోసం, ఇకపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని షకీలారెడ్డి అన్నారు. ప్రధానంగా అసంఘటిక రంగం, కాలేజీ విద్యార్ధినులు, వితంతు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్షంగా పోరాతామన్నారు.

దానితోపాటు మహిళా సమస్యలకు సంబంధించిన అంశాలు-పరిష్కార మార్గాలపై , కాలేజీ స్థాయిలో సెమినార్లు నిర్వహించే ఆలోచన కూడా ఉందన్నారు. వీటికి సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటుచేసే యోచన ఉందని, అధ్యక్షుడు కాసానితో చర్చించిన తర్వాత, తుది నిర్ణయం ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్నారు.

వివిధ కారణాలతో పార్టీని వీడిన వారంతా తిరిగి టీడీపీలో చేరాలని షకీలారెడ్డి పిలుపునిచ్చారు. టీడీపీ నుంచి ఇతర పార్టీలో చేరిన వారికి స్వేచ్ఛ, గౌరవం లేదని స్పష్టం చేశారు. ఆత్మ గౌరవాన్ని చంపుకొని గౌరవం-స్వేచ్ఛ లేని పార్టీల్లో కొనసాగేబదులు, స్వేచ్ఛ-గౌరవం దండిగా ఉన్న కన్నతల్లి లాంటి, టీడీపీలో చేరాలని షకీలారెడ్డి పిలుపునిచ్చారు.

‘‘పార్టీ అధినేతను నేరుగా కలసి, కష్టసుఖాలు చెప్పుకునే అవకాశం ఒక్క టీడీపీకే ఉంది. అలాంటి వెసులుబాటు- స్వేచ్ఛ ఏ పార్టీకయినా ఉందా? ఏ సీఎంనయినా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, సీనియర్లు కలిసే స్వేచ్ఛ ఉందా? అలాంటి అవకాశం ఒక్క చంద్రబాబు దగ్గరే ఉంటుందన్న వాస్తవాన్ని ఇప్పటికయినా గ్రహించి, తిరిగి సొంత ఇంటికి వస్తే బాగుంటుంది. ఇతర పార్టీల్లో చేరిన టీడీపీ నేతలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూస్తూనే ఉన్నాం. తిరిగి సొంతింటికి వచ్చే వారికి మా అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సముచిత గౌరవం-స్థానం ఇస్తార’ని షకీలారెడ్డి స్పష్టం చేశారు.

రాజకీయాల్లో నేతలు, మహిళలకు గౌరవం-సముచిత స్థానం కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు. తిరిగి పార్టీలోకి వచ్చిన వారికి కాసాని తగిన స్థానం కల్పిస్తారని హామీ ఇచ్చారు. కాసాని అధ్యక్షుడయిన తర్వాత, తెలంగాణలో మళ్లీ టీడీపీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోందన్నారు.ఖమ్మం సభ తర్వాత, తెలంగాణలో టీడీపీ హవా మొదలయిందన్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో మినీ మహానాడు, ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు అంచనాలకు మించి జరుగుతున్నాయన్నారు.

ప్రధానంగా పార్టీ నాయకత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తోందని ఆమె వెల్లడించారు. చంద్రబాబునాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతానికి, తగిన సూచనలు ఇస్తున్నారని చెప్పారు. గ్రేటర్‌లో పార్టీ బలపడే అంశంపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఆ మేరకు అధ్యక్షుడు కాసానితో చర్చిస్తున్నారని వెల్లడించారు.

నియోజకవర్గాల వారీగా కాసాని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. అందువల్ల గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ మళ్లీ బలపడేందుకు, పెద్దగా సమయం ఉండదని షకీలారెడ్డి వ్యాఖ్యానించారు. అందువల్ల పార్టీ వీడిన నేతలంతా, కన్నతల్లి లాంటి రాజకీయజన్మనిచ్చిన టీడీపీలో తిరిగి చేరాలని షకీలా రెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE