– టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హామీ
హైదరాబాద్ : భారతదేశంలో రెండో జ్యోతిర్లింగ క్షేత్రమైన ప్రసిద్ధ శ్రీశైల దేవస్థానం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హామీ ఇచ్చారు. హైదరాబాదులో టీవీ5 ప్రధాన కార్యాలయంలో గురువారం శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడిన పాలకమండలి సభ్యులు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ దేవస్థానం తరహాలో శ్రీశైలం దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు సంపూర్ణ సహకారం అందించాలని బోర్డు పాలకమండలి బీఆర్ నాయుడును కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీశైలంలో అన్ని హంగులతో కాటేజులు నిర్మాణం చేపట్టాలని, శ్రీశైలం దేవస్థాన ప్రాంత అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని వారు కోరారు. శ్రీశైలం దేవస్థానాన్ని సందర్శించి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సానుకూలంగా స్పందించి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారని, త్వరలో శ్రీశైలం వస్తానని బీఆర్ నాయుడు తెలిపారని శ్రీశైలం దేవస్థానం బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, మహానాడు మీడియా అధినేత, బోర్డు సభ్యులు బోడేపూడి వెంకటసుబ్బారావు మీడియాకు వెల్లడించారు.
ఈ కార్యక్రమం లో పాలకమండలి సభ్యులు ఏవి రమణ, ఆలా అనిల్ కుమార్, శంకరశెట్టి పిచ్చయ్య, మురళీధర్, కోడె క్రాంతి వర్ధిని, శ్రీదేవితోపాటు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.