-ఎస్సీ, బిసి, మైనార్టీ వర్గాలకు చెందిన నాయకులకు తలోక రాజ్యసభ స్థానాన్ని ఎందుకు ఇవ్వలేదు?
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
నా ఎస్సీలు, నా బీసీ లు, నా మైనారిటీలని తరచూ మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు రాజ్యసభ స్థానాలలో , రెండు స్థానాలను జనాభాలో ఐదు శాతం మాత్రమే ఉన్న తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించడం ఎంతవరకు సమంజసమని నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.
ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన నాయకులకు ఒక్కొక్కరాజ్యసభ స్థానాన్ని కట్టబెట్టి ఉండవచ్చు కదా? అంటూ నిలదీశారు. రెండింటి మూడో వంతు తన సొంత సామాజిక వర్గానికి కేటాయించి , సామాజిక న్యాయానికి పెద్దపీట వేశానని చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డి కే చెల్లిందంటూ ఆయన ఎద్దేవా చేశారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్నికలు ఉన్నచోట, ఓడిపోయే స్థానాలలో, ఆర్థికంగా బలమైన నేతలు లేకపోతే, తన రెండవ అస్త్రమైనా బీసీ మంత్రాన్ని జగన్మోహన్ రెడ్డి జపిస్తున్నారు తప్పా … ఎక్కడా కూడా బీసీలకు పెద్దపీట వేసిందే లేదన్నారు. నరసాపురం స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి విద్యాధికురాలైన ఉమాబాలకు కేటాయించిన విషయం తెలిసింది .
మళ్ళీ ఇప్పుడు , ఒక కాపు శాసన సభ్యుడిని పిలిచి నరసాపురం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయాలని సూచించారట. దానికి సదరు ఎమ్మెల్యే పని చూసుకొమ్మని చెప్పినట్లు తెలిసిందన్నారు. మరి అటువంటప్పుడు ఉమా బాలకు రాజ్యసభ స్థానాన్ని కట్టబెడితే సరిపోయేది కదా?, చెప్పేదొకటి, చేసేది మరొకటి… అయినా సామాజిక న్యాయం చేశానని చెప్పుకోవడం కేవలం జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
చర్చిలను రాజకీయ ప్రచార వేదికలుగా మార్చవద్దు
మనశ్శాంతి కోసం చర్చిలకు వచ్చే భక్తులకు జగన్మోహన్ రెడ్డిని గెలిపించండని, ఫ్యాను గుర్తుకు ఓటేయండని చర్చిల ఫాదర్లు ప్రచారం చేయవద్దని రఘురామకృష్ణం రాజు కోరారు. హిందువులు దేవాలయానికి, ముస్లింలు మసీదుకు వెళ్లినట్లుగానే క్రైస్తవులు చర్చిలకు వస్తుంటారని, మానసిక ప్రశాంతతను ఇచ్చే అటువంటి చర్చిలను రాజకీయ వేదికలుగా మార్చవద్దన్నారు.
పెనమలూరు వైకాపా కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న మంత్రి జోగి రమేష్, ఆత్మీయ సమ్మేళనం పేరిట కుల మతాల ప్రతినిధులతో, చర్చి ఫాదర్ల తో ప్రత్యేక సమావేశాలను నిర్వహించినట్టు, ఈ సమావేశాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 2000 రూపాయల నగదు, వైకాపా అభ్యర్థి ఫోటో, కుక్కర్, ప్లాస్క్ ను గ్రామ, వార్డ్ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల చేతుల మీదుగా అందజేసినట్లు వార్తా పత్రికలలో కథనాలు వెలుపడ్డాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది అంటే ప్రభుత్వ ఉద్యోగులే. ఇక వాలంటీర్లు సెమీ ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళందర్నీ అడ్డం పెట్టుకొని, పాస్టర్ల ద్వారా గిఫ్టులు ఇచ్చి ఓట్లను జోగి రమేష్ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ… పుట్టుకతోనే క్రైస్తవులమైన మనం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కోరారు. మత ప్రచారం నిర్వహించడం అనేది తీవ్రమైన నేరం. దీనికి ఐపిసి సెక్షన్ 171 C, 171 F ప్రకారం కేసులను నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. మత పరమైన ప్రచారాన్ని నిర్వహించిన జోగి రమేష్ ను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడి గా ప్రకటించాలని కోరారు.
పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగులను, వీడియోలను జత చేసి ఎన్నికల కమిషన్ కు నేను కూడా లేఖ రాస్తున్నట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జోగి రమేష్ ఎలాగో పోతారని, మిగిలిన వారంతా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, ఇలా మత ప్రచారాలు నిర్వహించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల ప్రచారానికి వాడుకోవడం దారుణం.
ఆసరా పేరిట జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కగా, లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు చేరలేదు. వైకాపా కోఆర్డినేటర్ గా నియమించిన కొత్త వారంతా, ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీ జెండాలను ఏర్పాటు చేసి, లబ్ధిదారులకు ఆసరా సొమ్ము అందజేస్తూ వారిచేత వై కాపాకు, ఫ్యాను గుర్తుకే ఓటు వేస్తామని తమ ఇష్ట దైవం పై ప్రమాణం చేయించడమన్నది ఆశ్చర్యంగా ఉంది.
15 రోజుల వ్యవధిలో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించిన నేపథ్యంలో బుద్ధి జ్ఞానం ఉన్నవారు ఎవరైనా ఇలా చేస్తారా? అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం ఇవన్నీ ఐపిసి సెక్షన్ల కింద నేరాలేనని ఆయన పేర్కొన్నారు .
జగన్మోహన్ రెడ్డి పై పరోక్షంగా సెటైర్లు వేసిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు లు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఆయన మంత్రివర్గ సహచరులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబులు పరోక్షంగా సెటైర్లు వేశారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎక్కడ పుట్టాడో… ఎక్కడి వాడో… ఇక్కడ కు వస్తే ఎవరు ఓట్లు వేస్తారని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినట్లుగా ఉన్నాయన్నారు.
హిందూపూర్ ఎంపీ అభ్యర్థిగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక బళ్లారికి చెందిన శాంతిని ఖరారు చేశారు. తిరుపతిలో పుట్టి పెరిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఒంగోలు పార్లమెంట్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేశారు. నెల్లూరులో పుట్టి పెరిగిన అనిల్ కుమార్ యాదవ్ ను నరసారావు పేట అభ్యర్థిగా ఎంపిక చేసిన జగన్మోహన్ రెడ్డి, ఇలా 80 మంది ఇష్టం వచ్చినట్లు మార్చేసిన మహానుభావుడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఇటువంటి చిల్లర వేషాలు నచ్చి ఉండకపోవచ్చు.
అందుకే జగన్మోహన్ రెడ్డిని తిట్టలేక, సత్య కుమార్ పై విమర్శలు చేసిన ఆయన, 80 మంది పార్టీ అభ్యర్థులు ఓడిపోతారని చెప్పకనే చెప్పినట్లు ఉందన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి కుర్చీని మడత పెట్టేస్తామని అన్నారు. లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ… ముందు నాలుక మడత పడకుండా చూసుకోవాలనడం పరిశీలిస్తే, పరోక్షంగా జగన్మోహన్ రెడ్డేనే ఆయన అన్నట్లుగా ఉందన్నారు.
జగన్మోహన్ రెడ్డి కాగితం చూసుకోకుండా మాట్లాడలేరన్నారు. జగన్మోహన్ రెడ్డికి చిన్న, చిన్న పదాలకు కూడా నోరు తిరగడం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి నోరు తిరగని వైనాన్ని , చిన్న చిన్న పదాలను కూడా సరిగ్గా పలకలేని విధానాన్ని చూసే పెద్దిరెడ్డి లాగానే జగన్మోహన్ రెడ్డి పై అంబటి రాంబాబు కూడా పరోక్షంగా సెటైర్లు వేసి ఉంటారు.
నారా లోకేష్ ప్రసంగం ప్రస్తుతం గంగా ప్రవాహం లాగా కొనసాగుతుందన్నారు. 80 మందిని మార్చేసిన వాళ్ళు అక్కడివారు ఇక్కడకు వస్తారని ఎన్నోసార్లు మంత్రిగా పనిచేసి, పి హెచ్ డీ కూడా చేసిన పెద్దిరెడ్డికి ఆ మాత్రం జ్ఞానం ఉండదా?, ఆయన పరోక్షంగానే జగన్మోహన్ రెడ్డి పై చమక్కులు వేశారన్నారు.
విష్ణువర్ధన్ రెడ్డి మాటలు… వైకాపా గురించి నేను మాట్లాడినట్టుగానే ఉంది
బిజెపి నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆ పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు, నేను వైకాపా గురించి మాట్లాడినట్లుగానే ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. మనసు ఒక దగ్గర, మనువు ఒక దగ్గర అన్నట్లుగా నా పరిస్థితి ఎలాగైతే ఉందో… విష్ణువర్ధన్ రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా ఉందన్నారు. పొత్తులపై బీజేపీ జాతీయ నాయకత్వాని దేనిని తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరిశ్వరి పదే, పదే చెబుతూనే ఉన్నారు.
గతంలో ముఖ్యమంత్రి స్థానం గురించి మాట్లాడిన అప్పటి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా తూచ్… అని యూటర్న్ తీసుకున్నారు. ముఖ్యమంత్రి స్థానంపై, పొత్తుల ఖరారు పై బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇతర అగ్ర నాయకులు నిర్ణయం తీసుకుంటారని గతంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలను నిర్వహించిన ఒక స్థాయి కలిగిన నాయకురాలైన పురందరేశ్వరి వంటి వారే పొత్తుల గురించి మాట్లాడడానికి సాహసించకపోతే, పొత్తుల గురించి మాట్లాడే దుస్సాహసం ఒక రెడ్డి గారు చేశారంటే… ఆయన కొంచెం నా టైపేమోనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
పొత్తుల పై గత రెండేళ్లుగా నేను చెబుతూనే ఉన్నాను. ఇవాళ, రేపు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయి. ఈనెల 20వ తేదీన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో పొత్తుల గురించి చర్చించడానికి బిజెపి నాయకత్వం ఢిల్లీకి ఆహ్వానించినట్లు మీడియా కథనాలను చూశాం. 20వ తేదీన కాకపోతే, 21వ తేదీన బిజెపి అగ్ర నేతలకు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమావేశమై పొత్తులపై చర్చించే అవకాశం ఉండవచ్చన్నారు.
అటు నుంచి ఇటు, ఇటునుంచి అటు వైకాపా నాయకత్వం అభ్యర్థులను మారుస్తూ ఆటలు ఆడుతున్నారు. ఏకంగా అభ్యర్థులను జిల్లాలే మారుస్తున్నారు. అభ్యర్థులు దొరక్కపోతే ఏకంగా కర్ణాటక నుంచి అభ్యర్థిని దిగుమతి చేసుకున్నారు. తెదేపా, జనసేన నాయకత్వం చెరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. మార్చి 10వ తేదీ లోపు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవాలి కాబట్టి, అతి త్వరలోనే కూటమి అభ్యర్థుల జాబితాను ఖరారు చేయవచ్చు. అప్పుడు సాక్షి దినపత్రిక ఏమని ఏడుస్తుందో చూడాలన్నారు.
నేరం ఒకరిది అయితే… శిక్ష మరొకరిగా?
నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడినట్లుగా, సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసిన కడప జిల్లాకు చెందిన వైకాపా నాయకుడు వర్రా రవీందర్ రెడ్డికి కాదని తెదేపా సానుభూతిపరులైన ఉదయ్ భూషణ్ దోషిగా చిత్రీకరించారని రఘు రామకృష్ణంరాజు అన్నారు. గతంలో న్యాయమూర్తులను దూషించిన కేసులోను వర్రా రవీందర్ రెడ్డి పై కేసు నమోదయిందన్నారు.
అదే వర్రా రవీందర్ రెడ్డి అత్యంత నీచంగా, అసభ్య పదజాలంతో, మానవ మాత్రులు ఎవరు కూడా వినడానికి ఇష్టపడని, భరించలేని దుర్గంధం వెదజల్లే ట్విట్లను రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై పుంకాను పుంకాలుగా పెట్టారు. అది తలుచుకుంటేనే నాకు ఎలర్జీ వస్తుంది. షర్మిల తో పాటు,డాక్టర్ సునీతారెడ్డిలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో వర్రా రవీందర్ రెడ్డి దూషించారు.
వాళ్ల అన్నయ్య, పెద్ద సజ్జల, పిల్ల సజ్జల మద్దతు చూసుకొని ఈ తరహా దుర్గంధమైన ట్విట్ల ను వెదజల్లారేమోనని అన్నారు . సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సునీత తనకు ప్రాణభయం ఉందని ఈ నెల రెండవ తేదీన హైదరాబాదులో సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది గ్రహించి వర్రీ అయిన వర్రా రవీందర్ రెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్లో ఓ ఫిర్యాదు చేశారు. తన పేరిట ఫేస్బుక్ అకౌంట్ ను ఎవరో సృష్టించి అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తున్నారని తన ఫిర్యాదు లో పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసును కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. కేసు చేదించడానికి అడిషనల్ ఎస్పీ సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, మధు మల్లేశ్వర్ రెడ్డి లతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. విచారణ లో భాగంగా ఫేక్ అకౌంట్ పరిశీలించి, ఫేస్బుక్ వారు ఇచ్చిన డేటా బేస్ ను ఆధారంగా చేసుకుని ముద్దాయి ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ చేసినట్లుగా తెలిపారు.
ఈ కేసులో ముద్దాయిగా ఉదయ్ భూషణ్ నుగుర్తించారు. ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి 65 ఏళ్లకు పైబడిన వృద్ధుడు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు. గతంలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్లు చేస్తే, ఆయన ఖండించేవారు. అసభ్యత శృతి మించినప్పుడు ఖండించే విధానం కూడా అదే పదజాలం తోనే ఉంటుంది. వర్రా రవీందర్ రెడ్డి వ్యాఖ్యలను ఉదయ్ భూషణ్ ఫేస్బుక్ వేదికగానే ఖండించారు. ఉదయ్ భూషణ్ వివరాలు హైదరాబాదు పోలీసులకు ఇచ్చి ఆయనే ముద్దాయని పులివెందుల పోలీసులు పేర్కొంటూ, హైదరాబాదు పోలీసులను విచారణ నిలిపివేయమని కోరగా, వారు పని చూసుకొమ్మని చెప్పినట్లు తెలిసింది.
ఫేస్బుక్ ఐడి, ఐపీ అడ్రస్ లభించాలంటే కనీసం రెండు వారాల వ్యవధి పడుతుంది. ఒకరోజు ముందుగానే కేసు నమోదు చేసుకున్న హైదరాబాదు పోలీసులకు లభించని ఫేస్బుక్ ఐడి, ఐపీ అడ్రస్ లు, కడప జిల్లా పులివెందుల పోలీసులకు మాత్రం లభించాయట. కేసును క్షవరం చేయడానికి ఉదయ్ భూషణ్ లాంటి అమాయకున్ని ఈ కేసులో ఇరికించి కడప జిల్లా పోలీసులు తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేశారు. డాక్టర్ సునీత ఇచ్చిన ఫిర్యాదు పై తెలంగాణ పోలీసులు విచారణ జరిపించి, షర్మిల, సునీతలను సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో దూషించింది ఎవరో గుర్తించనున్నారు.
ఆ వ్యాఖ్యలన్నీ సోషల్ మీడియా వేదికగా రవీందర్ రెడ్డి చేసినట్లు తేలితే, దాని వెనుక తాడేపల్లి ప్యాలెస్ లోని ఆ గ్యాంగ్ హస్తం ఉందని నిర్ధారణ అవుతుంది. దీనితో సభ్య సమాజం ముఖాన ఉమ్మేస్తుందని భయపడుతున్నారు. ప్రధానంగా మహిళా లోకం మరింత దారుణంగా ఉన్నేస్తుందన్న భయంతో, ఈ కేసులో ఉదయ్ భూషణ్ అన్యాయంగా ఇరికించారన్నది నా ఉద్దేశం.
కేసు ఎప్పటికీ తేలుతుందో తెలియదు కానీ ప్రజా కోర్టులో ఇటువంటి చిల్లర వేషాలు వేసే వారిని గుర్తించి విజ్ఞులైన ప్రజలు ఎంత త్వరగా వీలైతే వారిని అంత త్వరగా ఇంటికి పంపాలని రఘురామకృష్ణంరాజు కోరారు.