Suryaa.co.in

Editorial

లెక్కల లడాయి!

– టీచర్ల సంఖ్యపై కుదరని లెక్కలు
– టీచర్ల ఖాళీలు 717 మాత్రమేనన్న మంత్రి బొత్స
– 50,670 అంటున్న కేంద్రం
– ఎవరిది నిజం? ఎవరిది అబద్ధం?
– సత్తిబాబు సత్యమే చెప్పారా?
– టీచర్ల ఖాళీ లెక్కలను విడుదల చేసిన కేంద్రమంత్రి ప్రధాన్‌
– అన్ని రాష్ర్టాల్లో ఖాళీల సంఖ్యను విడుదల చేసిన కేంద్రం
– అంటే కేంద్రం పార్లమెంటును మోసం చేసిందా?
– అది కాకపోతే బొత్స తప్పు లె క్కలు చెప్పారా?
– ఏపీలో టీచర్ల లెక్కల పంచాయతీ
– తెలంగాణలో 18588 పోస్టులు ఖాళీ
– మిజోరం, సిక్కింలో అన్ని పోస్టుల భర్తీ
– కర్నాటలో 141358 పోస్టులు ఖాళీ
– యుపీలో 298490 పోస్టులు ఖాళీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆంధ్రా-కేంద్ర ప్రభుత్వాల మధ్య నడుస్తున్న లెక్కల పంచాయితీ ఆసక్తికరంగా మారింది. టీచర్ల ఖాళీల సంఖ్యపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణది ఒక లెక్కయితే.. కేంద్రంలో రాజ్యసభ సాక్షిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పిన లెక్క మరొకటి. మరి ఏపీ శాసనమండలిలో సత్తిబాబు సత్యం చెప్పారా? అదే నిజమైతే మరి కేంద్రమంత్రి రాజ్యసభలో అసత్యం చెప్పారా? ఇద్దరిలో ఎవరి మాట నిజం? ఎవరి మాట అబద్ధం?.. ఇదీ ఇప్పుడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ‘లెక్కల’ పంచాయితీ.

సహజంగా గణాంకాలు ఎక్కడయినా.. ఎవరిచ్చినా ఒకటే ఉంటాయి. అందులోనూ సర్కారీ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఒక అంకె కూడా అటు ఇటు మారదు. రాష్ట్రం కేంద్రానికి ఒక లెక్క ఇస్తే, కేంద్రం దానినే నమోదు చేసుకుంటుంది. అదే కేంద్రం రాష్ర్టాలకు లెక్కలు పంపిస్తే, రాష్ట్రం కూడా దానిని జాగ్రత్తగా నమోదు చేసుకుని, వాటినే పరిగణనలోకి తీసుకుంటుంది. సహజంగా ఇది ఎక్కడైనా.. ఎప్పుడైనా జరిగే ప్రక్రియ.

కానీ.. ఏపీలో టీచర్ల లెక్క మాత్రం ఒక పట్టాన కుదరడం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ల సంఖ్యపై, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు.. ఎడముఖం-పెడముఖంగా కనిపిస్తున్నాయి. వేలల్లో తేడా కనిపిస్తోంది. ఈ లెక్కల డొల్లతనం శాసనమండలి సాక్షిగా బట్టబయలయింది.

పీడీఎఫ్‌ సభ్యులు ఏపీలో ఖాళీగా ఉన్న.. టీచరు పోస్టుల సంఖ్య గురించి, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు తమ సర్కారులో కేవలం 717 ఉపాధ్యాయ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయని, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బదులిచ్చారు. దానితో మండిపడ్డ పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు.. మరి కేంద్రం 50 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది కదా? అని మెలిక పెట్టారు.

దానితో అసలే తత్తరపడే సత్తిబాబు.. ఈసారి మరింత తత్తరపడి, అదంతా కరొనాకు ముందున్న అప్‌డేట్‌ కాని లెక్క అని, సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తర్వాత ఒక కమిటీ వేసి, దానికి వారిని ఆహ్వానిస్తామని దాటేశారు.

నిజానికి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. రాజ్యసభలో దేశంలోని వివిధ రాష్ర్టాల్లో టీచర్ల ఖాళీల సంఖ్యను, 14-122022న రాజ్యసభలో విడుదల చేశారు. ఆ ప్రకారంగా ఏపీలో 2021-22 సంవత్సరానికి గాను, 50677 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్పష్టమయింది. అదే 2019-20లో 56739 ఖాళీలున్నట్లు పేర్కొనగా, 2020-21 సంవత్సరానికి గాను 35358 పోస్టులు ఖాళీ ఉన్నట్లు వివరించారు.

ఇక తెలంగాణలో 18588, జార్ఖండ్‌లో 91934, కర్నాటకలో 141358, బిహార్‌లో 253890, మధ్యప్రదేశ్‌లో 98562, ఉత్తరప్రదేశ్‌లో 298490, పశ్చిమబెంగాల్‌లో 57814 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. అయితే ఈశాన్య రాష్ట్రాలైన మిజోరం, సిక్కిం రాష్ర్టాల్లో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా ఖాళీగా లేకపోవడం విశేషం.

ఆ ప్రకారంగా ఏపీలో ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను 50677 గా కేంద్రప్రభుత్వం, విస్పష్టంగా అధికారికంగా చెబుతుంటే.. ఏపీ విద్యాశాఖ మంత్రి సత్తిబాబు మాత్రం, కేవలం 717 పోస్టులే ఖాళీగా ఉన్నాయని సెలవిస్తున్న వైనం గందరగోళానికి తెరలేపింది. ఈ లొల్లిలో అసలు లెక్కలేవీ? అన్న అనుమానాలకు సహజంగానే తెరలేచింది.
teachers

LEAVE A RESPONSE