Suryaa.co.in

Andhra Pradesh

ఉండవల్లీ… నువ్వు ఊసరవెల్లిలా ఎందుకు మారావ్?!

జగన్ అండ్ కో అక్రమాలపై ఎందుకు నోరు మెదపరు?
విధ్వంసకుడి చర్యల్లో భాగమై వ్యక్తిత్వం కోల్పోవద్దు
టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు

రాజమండ్రి: ఉండవల్లి అరుణ్ కుమార్ బాగా చదువుకున్నారు, నాకంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి, ఆయనను నేడు రాష్ట్ర ప్రజలు ఊసరవెల్లి అనే పరిస్థితి ఎందుకు వచ్చిందో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రడు పేర్కొన్నారు.

రాజమండ్రిలోని నారా లోకేష్ క్యాంపు సైట్ వద్ద అయ్యన్నపాత్రుడు విలేకరులతో మాట్లాడుతూ… చంద్రబాబు స్కిల్ కేసును సీబీఐతో విచారించాలని హైకోర్టులో ఉండవల్లి కేసు వేశారు. అసలు ఆ కేసులో ఏమైనా పస ఉందా? ఆ కేసుకు సంబంధించిన ఒక్క ఆధారమైనా ఉందా? డబ్బులు ఏదైనా చంద్రబాబు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వెళ్లినట్లు ఆధారం ఉందా?

చంద్రబాబును బయట తిరగనివ్వకూడదనే దురుద్దేశంతో జగన్ కుట్రలు పన్నుతుంటే… దానికి ఉండవల్లి సహకరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో బ్రాంది సీసాలు చూపి ప్రజలకు ఎన్నో కథలు చెప్పావ్…నేటి పాలనపై ఒక్కసారి అయినా మాట్లాడావా? జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలపై ఎందుకు నోరు మెదపడం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.

వైసిపి అక్రమాలపై ఎందుకు నోరెత్తలేదు?

తిరుపతి దేవస్థానంలో విపరీతమైన దోపిడీ జరుగుతుంటే ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. దేవస్థానాలకు చెందిన 43వేల ఎకరాలు కనబడడం లేదు అని మంత్రి చెబితే ఒక్కసారి కూడా నోరెత్తలేదు ఎందుకు? గోదావరిలో ఇసుకను దోచుకుంటున్న వారిపై ఎందుకు మాట్లాడలేదు? ఆ ఇసుక దోపిడీలో నీకు ఏమైనా వాటా ఉందా? రాజానగరం ఆవభూముల్లో కుంభకోణం జరిగితే ఒక్కసారి కూడా మాట్లాడలేదు.

కత్తిపూడి జంక్షన్ వద్ద ఫారెస్ట్ భూముల్లో ఖనిజ సంపద దోచుకుంటుంటే ఒక్కసారి కూడా నోరెత్తలేదు. ల్యాటరైట్ పేరుతో బాక్సైట్ తవ్వి దాన్ని భారతి సిమెంట్ కంపెనీలకు టిప్పర్లతో పోలీసుల కనుసన్నల్లో తోలుతుంటే ఒక్కసారి కూడా నోరెత్తలేదు. లక్షల టిడ్కో ఇళ్లను పేదలకు ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఏడిపిస్తుంటే ఎందుకు నోరెత్తలేదు? మేధావిగా చెప్పుకుని తిరిగే నువ్వు తప్పుడు మనుషులకు సహకరించడం ఏంటి?

జగన్ అక్రమాలపై ప్రశ్నించలేరా?!

ఉండవల్లి రామోజీరావుపై ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాడు. కానీ రామోజీరావుపై ఈ రాష్ట్రంలో ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. రామోజీరావు ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు. అగ్రిగోల్డ్ బాధితులు కొన్ని వేల మంది ఉన్నారు. వారి సమస్యలపై ఉండవల్లి ఒక్కసారి కూడా ఎందుకు నోరెత్తలేదు? ఉండవల్లి ముఖ్యమంత్రి డైరెక్షన్ లోనే మాట్లాడతాడా?

ఉండవల్లి మేధావా? మేతావివా? ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు. ఒక్కసారి కూడా రాజధాని గురించి ముఖ్యమంత్రిని నిలదీయలేదు. ఇలాంటి మేధావి రాష్ట్రంలో ఉండడం బాధాకరం. గంజాయి సరఫరాలో ఏపీని జగన్ మొదటి స్థానంలో నిలబెడితే కనీసం ఒక్కసారి కూడా యువత భవిష్యత్తు గురించి ఉండవల్లి నోరెత్తలేదు. పోలీసులు జగన్ చుట్టూ తిరగడం తప్ప…శాంతిభద్రతలు, యువత భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు.

కుట్రదారులతో కుమ్మక్కు కావద్దు

జగన్మోహన్ రెడ్డి మందు సీసాల్లో విషపూరితమైన మందు పోసి అమ్ముతుంటే మీకు కనబడడం లేదా?25ఏళ్లకు ఏపీ మద్యంపై జగన్మోహన్ రెడ్డి అప్పులు తెస్తే ఇది కూడా మీకు కనబడలేదా? కలెక్టర్ కార్యాలయం మొదలు రైతు బజార్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు. ఇలాంటి పరిస్థితులపై ఒక్కసారి కూడా మేధావి ఉండవల్లి ఎందుకు నోరెత్తడం లేదు?

ఉండవల్లి చేసే విశ్లేషణ నిష్పక్షపాతంగా చేయాలి తప్ప…ఒక వర్గానికి కొమ్ముకాసేలా వ్యవహరించడం సరికాదు. ఉండవల్లి తన అనుభవాన్ని, మేధో శక్తిని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఉపయోగించాలి. కుట్రదారులతో కుమ్మక్కై నిజాయితీని, వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న విధ్వంసకుడి చర్యల్లో ఉండవల్లి పాత్రదారుడు కావద్దని అయ్యన్నపాత్రడు విజ్ఞప్తిచేశారు.

LEAVE A RESPONSE