Suryaa.co.in

Andhra Pradesh

దయ్యాలు పోటీలు పడి మాట్లాడుకున్నట్టుగా ఉంది

అసెంబ్లీలో ఇన్నర్ రింగ్ రోడ్డు చర్చ పై అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య

ఋషులు యజ్ఞం చేస్తుంటే, ఆ యజ్జాన్ని రక్త మాంసాలతో భగ్నం చేసిన దయ్యాలు దీక్షను ఎలా భగ్నం చేశారో ఒకరినొకరు పోటీలు పడి, పొగుడుకుంటూ మాట్లాడుకున్నట్టుగా అసెంబ్లీలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై చర్చ ఉందని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఎద్దేవా చేశారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేని అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో కుంభకోణం అంటూ గంటల కొద్దీ చర్చించటం అనైతికం అని ,శాసనసభకు మాయని మచ్ఛ అని పేర్కొన్నారు. రాజధానే లేని చోట, ఇన్నర్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన వారంతా చంద్రబాబు బినామీలు అని ఒకసారి, ఆ భూములు ఎందుకు పనికిరావని మరోసారి, అది స్మశానమని ఇంకోసారి, ఎడారిని మరోసారి పదేపదే నాలుగున్నరేళ్ళు ప్రచారం చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా కోట్లు లబ్ధి పొందారని అనటంలో ఔచిత్యం ఏమిటి? అని ప్రశ్నించారు.

ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఒక్క ఎకరా భూమి కేటాయించలేదని, బడ్జెట్ కేటాయింపులు లేవని, ఐనా రూ.2,400కోట్లు అవినీతి జరిగిందని రంకెలు వేయటం వైకాపా సాంప్రదాయక అబద్ధాల్లో భాగమే అన్నారు. అమరావతి నుంచి అనంతపురం వరకు గత ప్రభుత్వం తీసుకున్న రోడ్డు నిర్మాణం పనులను ఇడుపులపాయ మీదుగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఇందులో లబ్ధిపొందే ముఖ్యమంత్రి బంధువులు ఎందరు? అని నిగ్గదీశారు.

రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్చినందుకు చంద్రబాబు దోషి అయితే, చట్ట బద్ధంగా, అసెంబ్లీ తీర్మానం సాక్షిగా ఏర్పాటు చేసిన అమరావతిని మార్చినందుకు ముఖ్యమంత్రి దోషి కాడా? అన్నారు.విభజన కారణంగా రాజధాని లేని రాష్ట్రానికి రైతుల భూములతోనే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు జరిగితే, అదే అసెంబ్లీలో కూర్చుని రాజధానిపై నిందలు వేయటం దేనికి సంకేతం అన్నారు. ప్రభుత్వానికి నీతి, నిజాయితీ ఉంటే , అసెంబ్లీకి వెళ్లకుండా బయట సమావేశాలు నిర్వహిస్తే బాగుండేదన్నారు.

2 కోట్ల 80లక్షలమంది ప్రజలు ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యాంధ్రకి చెందిన విజయవాడ,గుంటూరు జంట నగరాలకు రాజధాని లేకుండా చేసేందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుట్ర అని, ఈ కుట్రలో మధ్యాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు వంత పాడటం తల్లి రొమ్ము గుద్ధటం వంటిదే అని పేర్కొన్నారు. అమరావతిపై కత్తి కట్టిన ఏ ఒక్క ఎమ్మెల్యే మరో నాలుగు మాసాల్లో అసెంబ్లీ గేటు కూడా తాక లేరని, ఇంటిలో కూర్చుని చేసిన పాపాలను వారసులకు చెప్పుకోవాలని బాలకోటయ్య హెచ్చరించారు.

LEAVE A RESPONSE