విశాఖలో పారిశ్రామికవేత్తల బుట్టమ్మలు ఐప్యాక్ ఆఫీసులో..
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఈ ఫొటోలో కనిపిస్తున్న ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తుపట్టారా? లేదా? పోనీ అప్పుడెప్పుడో ఓసారి జగనన్న సర్కారు, విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ గుర్తుందా?.. ఆ.. యస్. ఆ చిత్రమే ఈ వి‘చిత్రం’! ఆ సమ్మిట్‌లో పాల్గొని ఏపీలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు, ఈ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు విశాఖ వెళ్లారు.
వారితోపాటు, వారి కంపెనీల సీఈఓలు కూడా వచ్చే ఉంటారు. మరి వేల కోట్ల యాపారం- యవ్వారం కదా? అంతలావు పెట్టుబడిపెట్టే మోతబరులు ప్రభుత్వాలతో ఒప్పందాలకు వెళ్లినప్పుడు, వారి వెంట సీఈఓలు కూడా రావాలి కదా? వస్తారు! అలా ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఈ ముగ్గురు మహిళా పారిశ్రామికవేత్తలు, ఒక్కోరు తలా వెయ్యి కోట్ల రూపాయలు ఉదారంగా పెట్టుబడులు పెట్టారట.
ఏపీలో జగనన్న ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం.. నిరుద్యోగులకు ఉపాథి కోసం పడుతున్న కష్టాన్ని ఇంగ్లీషు పేపర్లలో చదివి.. బొత్స సత్తిబాబు ఇంగ్లీషులో మాట్లాడిన తీరుకు ఫిదా అయి.. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టామని సెలవిచ్చారట. తమ దేశంలో కూడా ఇంగ్లీషు అంత చక్కగా ఎవరూ మాట్లాడరని కితాబిచ్చారట.
అంతేనా? దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో శాంతిభద్రతలు దివ్యంగా ఉన్నాయని.. రోడ్లు వంగి ముద్దుపెట్టుకోవాలనే బాపూ బొమ్మంత సుందరంగా ఉన్నాయని.. ఉచితంగా ఇసుక దొరుకుతున్న రాష్ట్రం ఇదొక్కటేనని.. కాంట్రాక్టర్లకు పని చేసిన వెంటనే బిల్లులిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని తెలుసుకుని.. విమానాలు అందుబాటులో లేకపోతే, పంచకల్యాణి గుర్రాలను కిరాయికి తెచ్చుకుని మరీ విశాఖ వచ్చామని ఇంగిలిపీసులో, తెలుగుపేపరోళ్లకు చెప్పారు. మళ్లీ పెట్టుబడులు పెట్టిన ఈ మహిళా పారిశ్రామికవేత్తలు కనిపించలేదు. వేలకోట్ల అధిపతులు కదా? బిజీగా ఉంటారు మరి!
సీన్ కట్ చేస్తే.. పోలింగ్ ముగిసిన తర్వాత జగనన్న, తన పార్టీని జాకీలతో పైకి లేపిన ఐప్యాక్ ఆఫీసుకు వెళ్లారు. అక్కడ వారినుద్దేశించి ైచె తన్యవంతమైన ప్రసంగం చేశారు. దానితో అక్కడున్న అక్కాషెల్లెమ్మలు, ‘షిక్కటి షిరునవ్వు’లు చిందిస్తూ అన్నతో సెల్ఫీ దిగారు. అన్న సెల్ఫీల ముచ్చట తెలిసిందే కాబట్టి, దాన్ని పట్టించుకోవలసిన పనిలేదనుకోండి. జగనన్నకు తన దగ్గరకు ఎవరైనా సెల్‌ఫోన్‌తో వస్తే, వారి ఫోను తీసుకుని మరీ సెల్ఫీ తీసుకోవడం మహా సరదా.
మళ్లీ సీన్ కట్ చేస్తే.. జగనన్నతో కలసి ‘షిక్కటి షిరునవ్వు’తో సెల్ఫీ దిగిన ‘అక్కషెల్లమ్మల’మధ్య, మన విశాఖ మహిళా పెట్టుబడిదారులు కూడా కనిపించడమే ఆశ్చర్యం. రాష్ట్రాన్ని ఉద్ధరించేందుకు వేలకోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన ఈ మహిళా పారిశ్రామికవేత్తలకు, ఐప్యాక్ ఆఫీసులో ఏం పని? అని భృకుటి ముడివేసిన వారూ లేకపోలేదు. తర్వాత తీరిగ్గా విచారిస్తే.. పాపం ఆ మహిళా పారిశ్రామికవేత్తల అక్క షెల్లెమ్మలకు ‘యాపారంలో నష్టాలొచ్చా’యట.
దానితో దిక్కుతోచక.. రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమదానం చేస్తున్న, ఐప్యాక్ టీములో ఉద్యోగానికి చేరినట్లు తెలిసింది. ఎలాగూ తాము కూడా రాష్ట్రాభివృద్ధికే, వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలనుకున్నందున.. ఐప్యాక్ కూడా అదే పనిచేస్తున్నందున, రెండూ ఒకటేనని భావించి ఐప్యాక్ టీంలో చేరి, విశాఖలో అప్పట్లో అద్దెకు తెచ్చుకున్న సూట్లను తిరిగి డ్రామా కంపెనీకే ఇచ్చారట.
విశాఖ సమ్మిట్‌లో ఐప్యాక్ టీం సభ్యులకే సూటు-కోటు-బూటు వేసి పారిశ్రామికవేత్తల వేషం వేసిన ఐప్యాక్ పిచ్చగుంట తెలివి, ఆ తర్వాత తెల్లవారుఝామునే సోషల్‌మీడియాలో తెల్లారింది. ఇప్పుడు ఆ నటీమణులంతా జగనన్నతో సెల్ఫీతో దిగడంతో.. జగనన్న తల‘కట్టు’ కధ మాదిరిగానే, ఈ కథ కూడా సోషల్‌మీడియా పుణ్యాన కంచికిచేరింది.
విశాఖ సమ్మిట్‌లో సూటు వేసుకుని, పారిశ్రామికవేత్తల బిల్డప్ ఇచ్చిన వారి పాత ఫొటోను.. లేటెస్టుగా ఐప్యాక్ టీముతో జగనన్న దిగిన సెల్ఫీని జోడించి, సోషల్‌మీడియా సైనికులు ర ప్ఫాడేస్తున్నారు. ఇదంతా ఐప్యాక్ మహిమ.. వాళ్లనలా వదిలేయకండి. ఎవరికైనా చూపించడ్రా.. నందికి ఎక్కువ-ఆస్కారుకు తక్కువ అంటూ.. తెగ కామెంట్లు పెట్టేస్తున్నారు. అయినా జగనన్న చెప్పినట్లు.. పాపం మన బుట్టమ్మల సంపాదన అంతంతమాత్రమే!
అన్నట్లు.. ఐదేళ్లూ జగనన్నను చేయి పట్టి నడిపించిన ఐప్యాక్.. బెజవాడలో ఉంటున్న దుకాణాన్ని సర్దేసిందట. అంతేనా? తన సిబ్బంది కోసం కార్లు బుక్ చేసిన ట్రావెల్స్‌కు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టేసిందట. అందులో పనిచేసే సోషల్‌మీడియా సైనికుల వద్ద ఉన్న పెన్‌డ్రైవులు, ల్యాప్‌టాపులు అన్నీ స్వాధీనం చేయమని హుకుం జారీ చేసిందట. ఇప్పటికైతే దుకాణం సర్దేస్తున్నాం. అంటే మీకు సెలవులిస్తున్నాం. మళ్లీ ఫోన్ చేసినప్పుడు రమ్మంటూ సందేశాలు పంపించిందని సోషల్‌మీడియా కోడై కూస్తోంది. నిజం ‘జగన్నాధుడి’కెరుక