Suryaa.co.in

Andhra Pradesh

‘భూ’లాజరుడు!

– వీఆర్ఏ ఉద్యోగాన్ని అడ్డంపెట్టుకుని భూ దోపిడీ
– ఏమీ ఎరగనట్లు ‘అవిశే’షమైన అమాయకత్వం ప్రదర్శన
– ఎమ్మార్వోలను సైతం తప్పుదారిపట్టిస్తూ అడ్డగోలు భూ ఆక్రమణలు
– కొండనుసైతం అనువంశికం అంటూ ఆన్‌లైన్ చేయించుకున్న వైనం
– ఉద్యోగాలిప్పిస్తానంటూ డబ్బులు వసూలు…దృవపత్రాల కోసం వచ్చేవారి నుంచీ పిండుడే
– ఎవరైనా ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెడతానని బెదిరింపు
– వైసీపీ నేతలతో అంటకాగుతూ ఉద్యోగ నియమాలకు తూట్లు
– ఇదీ యర్రగొండపాలెం మండలంలోని సమీప గ్రామానికి చెందిన వీఆర్ఏ భాగోతం

ప్రకాశం : ఆయనో గ్రామానికి వీఆర్ఏ. అది కూడా కష్టపడి చదివితే వచ్చిన ఉద్యోగం కాదు. తన తండ్రి నుంచి సంక్రమించిన ఉద్యోగం. అయినా ఏం చేయాలి…పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి. కానీ ఈ వీఆర్ఏ అలా కాదండోయ్…నేను జగన్ అభిమానిని…వైసీపీ వారికే పని చేస్తా అనే టైపు. అంతటితో ఉంటే సరి…ఎక్కడ ఖాళీ భూములు ఉన్నాయా…వాటిని ఏ బినామీ పేరుతో ఎక్కించుకున్నామన్నదే అతని అసలు టార్గెట్. ఆయన గారి అక్రమాల చరిత్ర చూస్తే ముక్కున వేలేసుకోక తప్పదు.

వివరాల్లోకి వెళ్తే….ప్రకాశం జిల్లా, యర్రగొండపాలెంనకు కూతవేటు దూరాన ఉన్న గ్రామానికి ఈయన వీఆర్ఏగా వ్యవహరిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెత చందంగా తన కుమారుడు, భార్య, కూతురు, అల్లుడు, బంధువుల పేరున పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఎక్కించుకున్నారు. స్వగ్రామం కాకపోయినప్పటికీ ఏళ్లుగా వీఆర్ఏగా వ్యవహరిస్తూ మండలానికి వచ్చే ఎమ్మార్వో, గ్రామ రెవెన్యూ అధికారులకు తీపి మాటలు చెప్పి తాను అనకున్న భూములను తన వారి పేరుతో వశం చేసుకుంటున్నారు.

ఆఖరికి కొండను కూడా వదలకుండా అనువంశికం కింద ఆన్ లైన్ చేయించుకున్నారు. ఇతగాడి తంతంగం చూసిన ఆ గ్రామస్తులు నిలదీయగా…మీవేమైనా పెట్టుకున్నానా…ప్రభుత్వ భూములు పెట్టుకున్నా, వాటిపై మా ఎస్సీలకు హక్కులు ఉన్నాయి. నన్ను ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు పెట్టి బొక్కలో వేయిస్తా అని బెదిరిస్తూ మాట్లాడుతున్నారు. ఎకరాలకు ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేరుతో ఆన్ లైన్ చేయించుకుని ఈ పాసు పుస్తకాలు పొంది అప్పనంగా బ్యాంకు ద్వారా రుణాలు పొందారు. ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలోనే జరిగాయి.

అంతకు ముందు కూడా తనతో సన్నిహితంగా వుండే వారి పేరుపై పదుల సంఖ్యలో ప్రభుత్వ భూములను దగ్గరుండి ఎమ్మార్వోలతో ఆన్ లైన్ చేయించారు. అయితే తన నిజస్వరూపానాన్ని తెలుసుకున్న కొందరు ఎమ్మార్వోలు దూరంపెట్టారు. అయినప్పటికీ తాను సచ్చీలుడన్నట్లు, ఎటువంటి అక్రమాలకు పాల్పడనట్లు మాట్లాడుతుంటూరు. తాను వీఆర్ఏగా వ్యవహరించే గ్రామంలో ఎక్కువగా అగ్రవర్ణాలు ఉన్నారు. తన జోలికి, తన భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ పరోక్షంగా హెచ్చరికలు చేయడం, తన బంధువులు సబ్ కలెక్టర్ ఆఫీసు, పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్నారని, అంతు చూస్తానని బెదిరిస్తారు.

పిల్లలకు ఇచ్చే సర్టిఫికేట్లలోనూ చేతివాటమే

తన డబ్బుల కక్కుర్తితో ఆఖరికి చిన్నపిల్లలను కూడా వదలడం లేదు ఆ మహానుభావుడు. కుల, ఆదాయ, ఇతర సర్టిఫికేట్ల కోసం వచ్చేవారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సంతకానికి ఎమ్మార్వో రూ.15 వందలు తీసుకుంటారని, నేనైతే వెయ్యి రూపాయలతో చేయిస్తానని చెప్పి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తారని టాక్. దీనిపై గతంలో ఎమ్మార్వో దృష్టికి వెళ్లగా పిలిచి మందలించారు. అయినా కుక్కతోక వంకరే అన్నట్లుగా తన బుద్ధి మాత్రం మార్చుకోవడం లేదు.

ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు వసూలు

ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలాయాల్లో కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయని, కొంత మేర డబ్బులు పెట్టుకుంటే వచ్చేలా చేస్తానని చెప్పి అమాయక యువకుల నుంచి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పించాలని, లేదంటే తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధిత యువకులు అడగ్గా…నువ్వు నాకు డబ్బులిచ్చి నట్లు ఆధారాలు ఏంటి, నేను నీకు నోటు ఏమైనా రాసిచ్చానా అని ఎదురు దబాయింపులకు దిగడం చేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ఉసూరుమంటూ వెనక్కి వచ్చామని బాధితులు మొరపెట్టుకున్నారు.

పేర్లు చెప్పి పైసలడగడం

ఇదంతా ఒకెత్తైతే ఇది మరో ఎత్తు. ఉద్యోగుల పేర్లు చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వివిధ గ్రామాలకు చెందిన వీఆర్ఏలు, సర్వేయర్ల పేర్లు చెప్పి పండుగలు, ప్రత్యేక అవసరాలు ఉన్నాయంటూ రూ.5 నుంచి రూ.15 వేల వరకూ వసూలు చేసినట్లు ఆరోపణులున్నాయి. తమ పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారేంటని ఓ సర్వేయరు, వీఆర్వో నిలదీయగా అబ్బే అదేం లేదు అంటూ జారుకున్నారని తెలిసింది.

మరోసారి తమ పేరు వాడితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో వారిపై చాడీలు చెప్పి బద్నాం చేసేందుకు ప్రయత్నించారు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న అతగాడి అక్రమాల పుట్ట పగలకపోవడానికి కారణం ఏంటో తెలియదు. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరించడంపై ఆయన విధులు నిర్వర్తించే గ్రామస్తులు, ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A RESPONSE