-స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ ఏపీలో అద్వాన పరిస్థితులు
-అమ్మపోతే అడవి కొనబోతే కొరివి
-ఏపీ నుంచి తెలంగాణకు వలస వెళ్లే పరిస్థితి
-నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కి కులాలను అంటగట్టడం సభవేనా అని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణంరాజు రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కుల వివక్ష అంటూ లేని ఈ ఇద్దరు నాయకులకు కులాన్ని అంట కట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను గంపగుత్తగా ఒకరికే వేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. సమాజంలో 18 నుంచి 20 శాతం మంది కాపులు ఉన్నట్లుగా, తన అభిమానులలోను 20 శాతం మంది కాపులు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు.
ఇక చంద్రబాబు నాయుడు కమ్మ కుల పక్షపాతి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక సాక్షి దినపత్రికలో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్సీగా లోకేష్ ను అభివర్ణించడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసిన రఘురామకృష్ణంరాజు, దేశంలోనే సంపన్నుడైన శాసన సభ్యు డు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సాక్షి దినపత్రికలో ప్రచూరించాలని సూచించారు. 2009 లో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి 90 కోట్ల రూపాయల ఆస్తి పన్ను కట్టే స్థాయికి ఎలా చేరుకున్నాడని ప్రశ్నించారు.
దేశం స్వాతంత్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం ఎలా ఉందంటే… రాష్ట్రంలో అద్వాన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. సి ఆర్ డి ఏ అమ్మకానికి పెట్టిన ప్లాట్ లకు బిడ్లు వేసే నాధుడే లేరని అన్నారు. మూడు ప్లాట్లకు మాత్రమే బిడ్లు వచ్చాయంటే, రాష్ట్రంలో అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్న చందంగా పరిస్థితి నెలకొందని వాపోయారు.. సి ఆర్ డి ఏ ఇచ్చిన వ్యాపార ప్రకటన పరిశీలిస్తే , రాష్ట్ర ముఖచిత్రం స్పష్టమవుతుందని రఘురామకృష్ణంరాజు అన్నారు..
సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో, ప్రజలు తెలంగాణకు వలస పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ప్రసంగంలో అన్ని అబద్ధాలే చెప్పారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి ఒకరకంగా ధన్యవాదాలు చెప్పాలని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర వజ్రోత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో తనని నియోజకవర్గానికి రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనే మహానుభావుడు కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
ఈ ప్రభుత్వ బుద్ధి మారాలని కోరుకుందామన్న ఆయన, ప్రస్తుత పాలకుల ప్రవృత్తి మారితే మంచి పరిష్కారం లభిస్తుందని చెప్పారు..ఎంతోమంది మహానుభావుడు కష్టపడి దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువస్తే, రాష్ట్రంలో మాత్రం మనము స్వాతంత్రాన్ని కోల్పోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలకుల బుద్ధి మారాలని ఎవరికీ వారు అల్లూరి సీతారామరాజు లాగా పోరాడుతారో, లేకపోతే తనలాగా గాందేయవాదులుగా ఉద్యమిస్తారో నిర్ణయించుకోవాలన్నారు.
రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు మచ్చుకైనా లేవు
రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు రాష్ట్రంలో మచ్చుకైనా లేవని రఘురామకృష్ణం రాజు అన్నారు. చట్టాలు చేసే అత్యున్నతమైన పార్లమెంటులో రాజ్యాంగాన్ని అనుసరించమని సరళమైన భాషలో, ఎవరి మనసు నొప్పించకుండా మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పినందుకు, దేశద్రోహం కేసు పెట్టి.. కాళ్లు కట్టి, చేతులను వెనక్కి విరిచిపట్టి, గొడ్డును బాదినట్టు బాదారని ఆవేదన వ్యక్తం చేశారు. గొడ్డును కూడా బాధడానికి వీల్లేదని చట్టాలను చేసుకున్నామని, జంతువులను కూడా హింసిస్తే కేసులు నమోదు చేస్తారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
మనుషులనే కాదు, పశువులను కూడా హింసించరాదని దేశం, ప్రపంచమంతా చట్టాలు చేసుకుని నాగరికత వైపు అడుగులను వేస్తున్నదని గుర్తు చేశారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా ఒక ఎంపీని లాక్కెల్లి కనివిని ఎరుగని విధంగా హింసించారన్నారు. ఈ వ్యవహారమంతా ఉన్నత స్థాయి పోలీస్ అధికారి పర్యవేక్షణలో కొనసాగగా, ఒక దుర్మార్గుడు అయిన రాజకీయ నాయకుడి చూసి ఆనందించారని విమర్శించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తెలుగులోనే ఉండాలని, ఇంగ్లీషు ను కావాలంటే పెట్టుకోవచ్చు నని పేర్కొనడం జరిగిందని, కానీ ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కూడా తెలుగులో బోధించకుండా కుట్రలు చేశారన్నారు. ప్రాథమిక పాఠశాలలను, ఉన్నత పాఠశాలలో విలీనం చేయడం వల్ల, దూరంగా ఉన్న పాఠశాలలకు సకాలంలో చేరుకోకపోతే విద్యార్థులకు గైర్హాజరు వేస్తున్నారని, దీనితో వారికి అమ్మ ఒడి పథకం అందడం లేదన్నారు.
నేటి పరిస్థితులకు అనుగుణంగా శ్రీ శ్రీ పాట…
ఆంధ్రప్రదేశ్ లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు గతంలో శ్రీ శ్రీ రచించిన పాడవోయి భారతీయుడా… అనే పాట అతికినట్టు సరిపోతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. తనకు ఊహా తెలిసినప్పటి నుంచి, ఆ పాట వింటున్నానని చెప్పారు. స్వాతంత్ర వజ్రోత్సవాల వేడుక సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా ప్రసంగం చేశారని ఎద్దేవా చేశారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారన్నారు.. జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి వంటి పథకాలు గతంలో లేవా అని ప్రశ్నించారు. పేర్లు వేరైనా ఈ పథకాలు గత ప్రభుత్వాలు కూడా అమలు చేశాయని పేర్కొన్నారు.
ప్రజలని మనం గొర్రెలని అనుకుంటామని, వాళ్లు కూడా గొర్రెల నటిస్తారని చెప్పారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరిట వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కూడా కొనసాగించారని గుర్తు చేశారు. ఇక 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారన్నారు. అయితే ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం పదిహేను వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు వాటి విలువ 3 లక్షల కోట్ల రూపాయలుగా మారిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఇళ్ల నిర్మాణం చేపట్టారని ఇటీవల పార్లమెంట్లో ప్రశ్నించగా, కేవలం మూడు ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లుగా సమాధానం చెప్పారని పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణం చేపడితే, నేటికీ వాటికి అతిగతి లేదన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం కూడా కమిషన్లను కొట్టివేశారని రఘురామకృష్ణంరాజు అన్నారు.
రైతు భరోసా కేంద్రాల నిర్మాణానికి 90% నిధులు కేంద్రానివే..
రాష్ట్రంలో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్రాలకు 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందజేస్తుందని, అయినా రైతు భరోసా కేంద్రాలను తామే నిర్మించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యాలు కొనుగోలు చేస్తున్నామని, వెంటనే డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగు నెలలైనా దాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు అందలేదని చెప్పారు.
ఇక మిల్లర్ల దాష్టికాలు దారుణాల గురించి చెప్పనవసరం లేదన్నారు. ఇంటింటికి కార్యక్రమంలో ప్రజలంతా ఇవే ప్రశ్నలను లేవనెత్తుతున్నారని పేర్కొన్నారు. తాను కూడా ఇదే విషయాలను ఎన్నోమార్లు ఉదాహరణలతో సహా వివరించారని గుర్తు చేశారు. రైతులకు 13500 రూపాయలు ఇస్తున్నామన్నది అర్థసత్యమని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఇందులో సగం కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నదని చెప్పారు. హాస్పిటల్లో ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారని పేర్కొనడం విస్మయాన్ని కలిగించిందన్నారు. చాలా ఆసుపత్రుల్లో వైద్యులు లేక నర్సులు, కాంపౌండర్లు, వాచ్ మల్లే వైద్యం చేస్తున్న సంఘటనలు ఉన్నాయన్నారు.
రాష్ట్రంలో 16 హాస్పిటల్లో మూడుసార్లు శంకుస్థాపన చేసిన ఘనత , ఈ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు. ఇక విద్యావ్యవస్థను అద్భుతం చేశామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి, 12 వేల టీచర్ ఉద్యోగాలను కాలగర్భంలో కలిపారని మండిపడ్డారు. రాజ్యాంగంలో పొందుపరిచినట్లుగా మాతృభాషలో విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము తన మాతృభాషని ఎంతో గౌరవిస్తారని, స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, చివరకు తన మాతృభాష ఒరియాలో ప్రసంగించారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగు వాడినని చెప్పుకోవడానికి గర్వపడాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజలే మర్చిపోయిన కులాల పేరిట కార్పొరేషన్లను ఏర్పాటు చేసి కులాల మధ్య కుంపట్లకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ప్రాంతీయ ప్రాముఖ్యత లేని రీజనల్ ఫీలింగ్స్ ను రెచ్చగొట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
అప్పుల ఊబిలో చిక్కుకున్నాం
గత ఏడాది కాలంగా 11,140 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలను డిస్కములు చెల్లించవలసి ఉన్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అప్పుల ఊబిలో రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుపోయిందని ఆయన అన్నారు. మహారాష్ట్ర తమిళనాడు వంటి రాష్ట్రాలు అప్పుల జాబితాలో మనకంటే ముందున్నప్పటికీ, మన రాష్ట్ర విస్తీర్ణంతో పోల్చితే అప్పుల లో మనమే ముందుంటామని చెప్పారు. ఇదే మాదిరిగా తమిళనాడులోని విద్యుత్ బోర్డు, తన విద్యుత్ సంస్థలకు బకాయిలు చెల్లించనందుకు తాను న్యాయ పోరాటం చేస్తుండగా, జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు అందజేసి, తనపై దిక్కుమాలిన కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక రాష్ట్రంలో గుడ్ మార్నింగ్ అని చెప్పి పెన్షన్లు ఇస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు ప్రధానమంత్రి మోడీ డిజిటల్ ఇండియా అంటుంటే, మిమ్మల్ని పింఛన్లకు నగదు ఎవరు ఇవ్వమన్నారని ప్రశ్నించారు. నగదు చెల్లింపులు చేయడం ద్వారా, పింఛన్ కారులు అధికంగా మద్యాన్ని సేవించే అవకాశం ఉన్నదన్నారు. రాష్ట్రంలో 45 వేల కోట్ల రూపాయల నగదు బదిలీలు జరుగుతున్నాయని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
గతంలో బీసీ ఎస్సీ లకు మేలు చేసే ఎన్నో అద్భుతమైన పథకాలు ఉండగా వాటన్నింటినీ ఎత్తివేయడమే కాకుండా, స్వయం సహాయక సంఘాలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అప్పు చేసి తెస్తున్న ప్రతి రూపాయి, ప్రజలపైనే భారం పడుతుందన్న రఘురామకృష్ణంరాజు, తానేదో ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటూ, ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని, తద్వారా తనని తాను మోసం చేసుకుంటున్నారని, ఇది కరెక్ట్ కాదని చెప్పారు.
జగన్మోహన్ రెడ్డిని అభినందిస్తున్న…
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆ దుష్ట చతుష్టయం, అ దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, తమ పార్టీకి చెందిన బీసీ ఎంపీ మాధవ్ పై నిందనలను మోపారని జగన్మోహన్ రెడ్డి అంటారని అనుకున్నారని, కానీ అలా అననందుకు అభినందిస్తున్నానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. నగ్న వీడియో ఎంపీ మాధవ్ దేనని ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ తేల్చి చెప్పిందని, అయినా ఈ సన్మానాలు ఏమిటని ప్రశ్నించారు.
చిరంజీవిని పిలిచి భోజనం పెట్టినట్లుగా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎంపీ మాధవ్ ను పిలిచి భోజనం పెట్టి పత్రికలకు ఫోటో విడుదల చేస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఎంపీ మాధవ్ నగ్న వీడియోను ల్యాబ్ కు పంపి, నివేదిక అందే వరకు సన్మానాలను, బిరుదులు ఇవ్వడం ఆపాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. పార్టీ పరంగానే మాధవ్ కు స్వాగతం పలకడం ఏమిటన్న ఆయన, ఈ చర్యల ద్వారా, సమాజానికి, ముఖ్యంగా మహిళలోకానికి మనం ఏమి సందేశం ఇస్తున్నామని ప్రశ్నించారు. ఇక ఉపాధ్యాయులను 9 గంటలకే పాఠశాలకు హాజరై యాప్ ద్వారా అటెండెన్స్ వేయాలని ఉత్తర్వులు జారీ చేయడం, వారిని వేదించడం కాక మరేమిటి అని నిలదీశారు.