తరలించుకు పోయే మృత్యువాగదు..!

ఈ బుర్రే పెద్ద ఇనపెట్టె..
కదిలే కాసుల భాండాగారం..
ఆయన చదువుకున్న డిగ్రీ
లక్ష్మీదేవి
స్వహస్తంతో
రాసి ఇచ్చిన పట్టా..
జీవితమంతా డబ్బుతోనే చెట్టాపట్టా..!

రాకేశ్ ఝుంఝున్వాలా..
ఆ పేరు చెబితే స్టాక్ మార్కెట్
తైతక్కలాడదా..
షేర్ల ధరలు షికార్లు చెయ్యవా..
ఏ ట్రబుల్ లేకుండా
అయ్యాడు బిగ్ బుల్..
భారతీయ స్టాక్ మార్కెట్టుకు
అతగాడే సక్సెస్ఫుల్ లేబుల్!

రాకేశ్ ఝుంఝున్వాలా..
అయిదు వేల రూపాయల
పెట్టుబడితో
మొదలైన వ్యాపారం..
నలభై వేల కోట్లకు
చేరిన ప్రయాణం
లక్ష్మీదేవి కొంగు పట్టుకు తిరిగిన ప్రస్థానం..
ఒకనాటికి అయింది
అంతులేని ఆస్తుల సంస్థానం..
అపర కుబేరుల ఆస్థానం..
మాలచ్చిమికి నిజస్థానం!

రాకేశ్ ఝుంఝున్వాలా..
షేర్ల ధరలు అతను
చెప్పినట్టే వింటాయి..
తన మాటే శాసనమన్నట్టు
ఫిక్స్ అయిపోతాయి..
ఆయన ఊహలనే రెక్కలుగా
చేసుకుని ఎగిరే షేర్లు..
వాటి నడుమే నిత్యం
రాకేశ్ ఆలోచనల షికార్లు!

రాకేశ్ ఝుంఝున్వాలా..
చిన్నప్పుడే వ్యాపారం చేస్తానంటే ఆగమన్నా
సిఎ అయ్యాక
ఓకే చెప్పిన అయ్య..
ఇవ్వనన్నాడు మదుపు..
మిత్రులనూ
అడగొద్దని అదుపు..
ఆదుకుంది ఐదువేల రూపాయల
తన పొదుపు..
వాటితోనే మెరిసింది మెరుపు!.

సిరి రా మోకాలడ్డలేదు..
పెట్టుబడికి వెనకాడలేదు..
టైటాన్ తన ఇంట్లోనే బైఠాయించింది..
విమానాలూ
జమానాలో చేరాయి..
హోటళ్ళు నక్షత్రాలై
మెరిసాయి..
సంపదలు ఆయన ముంగిట చేరి మురిసాయి..!

ఆ రోజు రానే వచ్చింది..
ఏదీ వెంటరాని పయనం..
కోట్లు పెట్టి వైద్యం చేయించుకునే
సత్తా ఉన్నా
అంతా మిథ్య..
వాలిపోయింది సంధ్య..
ఆహా ఓహో ప్రశంసలు..
తాను వినలేని పరామర్శలు..

రాకేశ్ ఝుంఝున్వాలా..
లేడని తెలిసి విస్తుపోయినా
సెన్సెక్స్…కాసేపే..
ఫోన్ పే..గూగుల్ పే..
ఫౌల్ ప్లే..మామూలే..
నీ జీవితానికే
ఇక ఉండదు రీ ప్లే..
ఎంత పిలిచినా ఎక్కడ
నీ రిప్లై..!

ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286

Leave a Reply