ఇది ఊహకు అందని ఫలితం. ఇది కలలో సైతం ఊహించని పతనం. వైసీపీ గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలే వాడాలి. ఉత్తరాంధ్రలో వైసీపీకి రెండంటే రెండు సీట్లు మాత్రమే జనాలు ఇచ్చారు. గుడ్డిలో మెల్ల అన్నట్లుగా అరకు ఎంపీ సీటు దక్కింది. ఉత్తరాంధ్రలో వైసీపీ 2019 ఎన్నికల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లకు గానూ 28ని గెలుచుకుని సత్తా చాటింది. అది అప్పటిదాకా ఏ రాజకీయ పార్టీకి దక్కని రికార్డు.
ఇపుడు కూడా రెండు సీట్ల గెలుచుకుని మరో రికార్డు వైసీపీ సృష్టించింది. ఇది కూడా ఏ రాజకీయ పార్టీకీ అందని రికార్డే. కనీసం 2019 లో మాదిరిగా అయినా జిల్లాకు మూడు వంతున తొమ్మిది సీట్లను అయినా వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఆ రెండూ కూడా పాడేరు, అరకు. ఈ సీట్లు వైసీపీకి 2014 నుంచి వస్తున్నాయి. ఎవరు ఏమి చేసినా ఎంతలా హ్యాండ్ ఇచ్చినా అరకు పాడేరు మాత్రం వైసీపీకి అండగా నిలబడి ఆ మాత్రం పరువు కాపాడాయని అంటున్నారు.
అలాగే అరకు ఎంపీ సీటుని వరసగా గెలుచుకోవడం మూడోసారి. అలా ఈ మూడు చోట్లా హ్యాట్రిక్ విజయం వైసీపీకి దక్కింది అని సంబరపడాలో లేక మొత్తానికి మొత్తం ఉత్తరాంధ్రా ఊడ్చిపెట్టుకుని పోయిందని చింతించాలో అర్ధం కాని పరిస్థితి అని అంటున్నారు. గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ సీట్లను స్వీప్ చేసి పారేసిన వైసీపీ ఈసారి ఆ క్రెడిట్ ని కూటమికి ఇచ్చింది.
అలాగే శ్రీకాకుళంలో ఉన్న పది సీట్లకు ఎనిమిదింటిని గెలిచి టీడీపీ కంచుకోటలో పాగా వేశామన్న ఆనందాన్ని అయిదేళ్ళకే ఆవిరి చేసుకుని ఆ జిల్లానూ స్వీప్ చేసే చాన్స్ అదనంగా ఇచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పదిహేను అసెంబ్లీ సీట్లలో మాత్రం రెండు వదిలేసి 13 సీట్లనూ అప్పగించేసింది. విశాఖ సిటీ అలాగే రూరల్ జిల్లాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్లా వైసీపీ ఘోర పరాజయం మూటకట్టుకుంది. అలాగే ఉత్తరాంధ్రలో అయిందింట నాలుగు ఎంపీ సీట్లను కూడా వైసీపీ కోల్పోయింది. గతసారి నాలుగు గెలిస్తే ఈసారి ఒక్కటే దక్కింది.
– రవి