Suryaa.co.in

Political News

ఇవే జగన్ కు శాపాలు అయ్యాయా ?

గత ఎన్నికల్లో బలమైన స్లోగన్ వినిపించింది. జగన్ ను గెలిపించాలని బలమైన నినాదాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. అంతకుమించి సీఎం గా జగన్ ను చూడాలని సగటు వైసీపీ అభిమాని కోరుకున్నాడు. కేవలం నలుగురు నాయకులు పై ఆధారపడి సీనియర్ నేతలు మాటలు పెడచెవిన పెట్టారని వాలంటీర్ వ్యవస్థతో నాయకత్వాన్ని నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

జగన్ తర్వాత వైసీపీలో నెంబర్ టూ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. పార్టీ కోసం హార్ట్ ఫుల్ గా పని చేసే వారిలో ముందంజలో ఉండేవారు. వైసిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పని చేస్తూ వచ్చారు.కానీ అధికారంలోకి వచ్చిన తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎంటరయ్యారు. వై వి సుబ్బారెడ్డి కి ప్రమోట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని అందలమెక్కించారు. విజయ్ సాయి రెడ్డి లాంటి నేతలను నిర్లక్ష్యం చేశారు.

అంతెందుకు నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి నమ్మకస్తులను దూరం చేసుకున్నారు. ఆర్థికంగా అండగా నిలిచే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లిపోవడంతోనే నెల్లూరులో వైసీపీ పతనం ప్రారంభమైంది. అటు ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసుల రెడ్డిని సైతం దూరం చేసుకున్నారు. ఎన్నికలకు ముందు కొందరు నాయకులను చేజేతులా దూరం చేసుకున్నారు జగన్.

వాలంటీర్ వ్యవస్థతో కిందిస్థాయి క్యాడర్ ను దూరం పెట్టారు. సచివాలయ వ్యవస్థతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. గత ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషి చేసిన ఏ వర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. పేరుకే మంత్రులు కానీ అందరూ డమ్మీలే. ఏ నిర్ణయం తీసుకోవాలన్న సజ్జలే తీసుకోవాలి. చివరికి ఉద్యోగ సంఘాల నాయకులతో సైతం ఆయనే చర్చలు జరపాలి. ప్రభుత్వం తరఫున ప్రకటనలు చేయాలి. అటు క్షేత్రస్థాయిలో నాయకుడికి నాయకత్వానికి మధ్య వారధి కూడా సజ్జలే.

ఇసుక విధానం, మద్యం విధానం చివరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైసీపీకి చావు దెబ్బతీసాయి. నవరత్నాల్లో అన్ని చేసామని చెప్పారే కానీ.. హామీ ఇచ్చిన మద్య నిషేధం గురించి కనీస స్థాయిలో కూడా ఆలోచన చేయలేదు. ఇవన్నీ ప్రతికూల పరిస్థితులే. వై నాట్ 175 అన్న నినాదం ముమ్మాటికీ తప్పిదమే. ఆ నినాదం ఇస్తూ అభ్యర్థులను మార్చడం మరో తప్పిదం. తనను చూసి ఓటేస్తారని నేను బటన్లు నొక్కుతానని మీరు ప్రజలకు చెప్పండి అని అనడం కూడా జగన్ పతనానికి, సొంత పార్టీ నాయకుల్లో పట్టు పోవడానికి ఒక కారణం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన తీసుకునే నిర్ణయాలు శాపంగా మారాయి.

ప్రత్యర్థులను నిర్వీర్యం చేయాలన్న ఆలోచన సైతం జగన్ కు మైనస్ గా మారింది. ఎన్నికలకు ముందు చంద్రబాబును టచ్ చేయడం ఆయనకు సానుభూతి కల్పించినట్టు అయింది. కేవలం సంక్షేమాన్ని నమ్ముకొని అభివృద్ధిని విడిచిపెట్టడం కూడా ఒక మైనస్. ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు ఓటు వేస్తారని భావించడం కూడా ఒక అనాలోచితమే.

స్థానిక సంస్థల ఎన్నికలు, ఉప ఎన్నికల్లో గెలుపును బలంగా భావించారు. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఉద్యోగ ఉపాధ్యాయుల విషయంలో సైతం అనాలోచిత నిర్ణయాలతో ముందుకు సాగారు. పట్టుదలతో ముందుకు పోయి వారిని ప్రత్యర్థులుగా మార్చుకున్నారు. ఇవన్నీ వైసీపీకి మైనస్ లే. సీఎం జగన్ కు శాపాలు అయ్యాయి.

– రవి

LEAVE A RESPONSE