Suryaa.co.in

Andhra Pradesh

వాల్మీకి-బోయలను ఎస్టీల్లో చేర్చండి

– వాల్మీకి, బోయ కులాలను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదికి లేఖ రాసిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
వాల్మీకి-బోయకులాలను ఎస్టీల్లో చేర్చాలని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. లేఖ సారాంశం ఇదీ..
• ఆంధ్రప్రదేశ్‌ మైదాన ప్రాంతాల్లో నివసిస్తున్న వాల్మీకి/బోయలు పేదరికంతో బాధపడుతున్నారు.
• ఈ వర్గాలు సాంప్రదాయకంగా వేట, అటవీ ఉత్పత్తులు సేకరించడం ద్వారా తమ జీవనోపాధిని కొనసాగిస్తున్నాయి.
• 2016లో, ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకీ/ బోయల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.
• విస్తృతమైన ఫీల్డ్ వర్క్ ఆధారంగా ఒక సంవత్సరం పాటు చేసిన వివరణాత్మక పరిశోధన తర్వాత, వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్ తెగగా గుర్తించడంలో జాప్యం జరిగిందని కమిటీ గుర్తించింది.
• ఆంధ్రప్రదేశ్ ఎస్సీ/ఎస్టీ కమిషన్ వివిధ జిల్లాల్లో పర్యటించి వాల్మీకులు/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది.
• వాల్మీకి/బోయలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చడానికి వివిధ కమిషన్లు చేసిన సిఫార్సులను మీ దృష్టికి తీసుకొస్తున్నాను.
• 1961 లో, సెన్సస్ కమిషన్ కు చెందిన డిప్యూటీ రిజిస్ట్రార్ జనరల్ రాయ్ బర్మన్ వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేశారు.
• 1961-62లో, ఆంధ్రప్రదేశ్ ట్రైబ్స్ ఎన్క్వయిరీ కమిషన్ వాల్మీకి/బోయలను భూమిపుత్రులుగా నిర్ధారించి ఎస్టీలుగా గుర్తించాలని సూచించింది.
• తరువాత అనంతరామ కమిషన్ అనుకూలమైన సిఫార్సులు చేసినప్పటికీ, వాల్మీకి/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చలేదు.
• రాయలసీమ మరియు కోస్తా ఆంధ్రలోని వాల్మీకి/బోయలు ఒకటేనని పేర్కొంటూ 1964 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
• 1968 లో, వాల్మీకులు/బోయలను ప్రాంతాలతో సంబంధం లేకుండా ఎస్టీ జాబితాలో చేర్చబడ్డారు.
• దురదృష్టవశాత్తు, ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న వాల్మీకులు మాత్రమే ఎస్టీ జాబితాలోకి వస్తారని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 1977 జూలై 27 న ఉత్తర్వులు జారీ చేసింది.
• వాల్మీకి/బోయలపై వివిధ కమిటీలు గతంలో చేసిన సిఫారసులను నాటి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.
• ఇది పశ్చిమ కనుమలు, ఈశాన్య ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకులు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసించే బోయల మధ్య విభేదాలకు దారితీసింది.
• 1991 లో, భారత ప్రభుత్వం వాల్మీకులు మరియు నాయక్, నాయక, బేడా, బేడార్ మొదలైన ఉప సమూహాలను ఎస్టీ జాబితాలో చేర్చింది.
• ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో వాల్మీకులు/బోయలు సాంప్రదాయకంగా బలమైన సామాజిక, వైవాహిక సంబంధాలు కలిగి ఉన్నారు.
• కర్ణాటకలో వీరిని ఎస్టీ జాబితాలో చేర్చారు.
• కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వాల్మీకులు/బోయల స్థితి గందరగోళంగా ఉంది.
• ఈ నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని గత ప్రభుత్వం ఈ సమస్యను శాస్త్రీయంగా పరిష్కరించడానికి ప్రయత్నించి వాల్మీకులు/బోయలను భారత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలని సిఫార్సు చేసింది.
• డిసెంబర్ 01, 2017 న, ఆంధ్రప్రదేశ్ కేబినెట్ వాల్మీకీ/బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది.
• వాల్మీకులు/ బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉభయ సభలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసిన సందర్భంలో ఏపీ శాసనసభ మరియు ఏపీ శాసన మండలిలో వివరణాత్మక చర్చ జరిగింది.
• నాటి టిడిపి ప్రభుత్వం ఈ తీర్మానాలన్నింటినీ క్రోడీకరించి 15 డిసెంబర్ 2017 న భారత ప్రభుత్వానికి పంపడం జరిగింది.
• తరువాత, భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరిన్ని వివరాలను కోరగా సెప్టెంబర్ 5, 2018 న నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వివరాలను పంపడం జరిగింది.
• దురదృష్టవశాత్తు, ఈ ప్రతిపాదన భారత ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.
• వాల్మీకీ/ బోయల దశాబ్దాల పోరాటానికి సంఘీభావంగా వారిని ఎస్టీ జాబితాలో చేర్చాలని టిడిపి కృతనిశ్చయంతో ఉంది.
• వారి న్యాయమైన ఆకాంక్షలను నెరవేర్చాలని వారి తరపున, భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.
• గత మూడు సంవత్సరాలుగా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోవడంతో నేను మీకు ఈ వివరణాత్మక అభ్యర్థనను పంపుతున్నాను.
• మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా, ఈ అభ్యర్థనకు మీ నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఆశిస్తున్నాను.
• పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని వాల్మీకులు/బోయలను ఎస్టీలుగా గుర్తించాలని మిమ్మల్ని కోరుతున్నాను.

LEAVE A RESPONSE