‘వందే భారత్ ‘ అని ఒక కొత్త రకం రైలు ను దేశం లో ప్రవేశపెడుతున్నారు . ఇది ‘రాజధాని…. శతాబ్ది’ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్సప్రెస్ ల కు ఎక్కువ…., బుల్లెట్ ట్రైన్ కు బాగా తక్కువ. మనవరకు మనకు ఇదో వండర్. మహా వృక్షాలు లేనిచోట ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్టుగా.. గంటకు 180 కిలోమీటర్ల వేగం తో ఇది పరిగెడుతుంది. కానీ, మన రైల్వే ట్రాక్ లు బాగా సుకుమారం గా ఉంటాయి. అందుకని, 130 కిలోమీటర్ల వేగాన్ని మించి తట్టుకోలేవు. ( జపాన్ లో బుల్లెట్ ట్రైన్ అత్యధిక వేగం 603 కిలోమీటర్లు. చైనా లో బుల్లెట్ ట్రైన్ అత్యధిక వేగం సుమారు 500 కిలో మీటర్లు…130 కిలోమీటర్ల వేగానికే మనకి పూనకాలు వచ్చేస్తున్నాయి…. ఏదో చింపేస్తున్నామని )
ఈ 130 కిలో మీటర్ల వేగానికే మనం ఉబ్బితబ్బిబ్భై పోతున్నాం. ‘భారత్ వెలిగి పోతోంది’ అంటున్నాం. ఒక ‘ వందే భారత్’ రైలు ను సికింద్రాబాద్ – విశాఖపట్నం మార్గానికి కేటాయించిన కేంద్రం…., రెండు తెలుగు రాష్ట్రాలకు ఏదో పెద్ద వరం ప్రసాదించింది అన్నట్టుగా కేంద్ర మంత్రులు, పెద్దలు మాట్టాడుతున్నారు.
ఈ రైలు తొలి ప్రయాణాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి పచ్చ జండా ఊపి ‘:గ్రీన్ సిగ్నల్ ‘ ఇచ్చారు. అది చూసి ఇక్కడ, సికింద్రాబాద్ లో పచ్చ జండా ఊపడానికి భారత రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీ నుంచి వచ్చారు. తెలంగాణ గవర్నర్ తమిళి సై, ఇంకో మంత్రి కిషన్ రెడ్డి, చాలా మంది నేతలు కూడా జండాలు ఊపారు. ఈ ఏ సీ రైలు లో ప్రయాణికుల వసతులు… అహో అద్భుతం.. అధరహో…అంటూ వక్తలు తన్మయత్వానికి లోనై, పులకించిపోయారు .
ఈ రైలు లో ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్ళ లో లాగా పడుకుని వెళ్ళడానికి కుదరదు. కూర్చునే వెళ్ళాలి. మామూలు చైర్ కార్, ఎక్జిక్యూటివ్ చైర్ కార్ అని రెండు తరగతులు ఉన్నాయి. చైర్ కార్ కు అయితే ; సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి 1665 రూపాయలు. ఇది ఏ. సీ. మొదటి తరగతి బెర్త్ ( పడుకుని వెళ్ళ వచ్చు. రగ్గు, దిండు, టవల్ కూడా ఇస్తారు ) ధర కంటే కూడా అధికం. ఇక, ఎక్జిక్యూటివ్ చైర్ కార్ అయితే ఏకం గా 3120 రూపాయలు టికెట్ ధర గా నిర్ణయించారు. ఈ రైలు లో వసతులు విమానం లో లాగా ఉన్నాయని మన నేతలు సంబరపడి పోయారు. ప్రఖ్యాత సినీ నిర్మాతలైన నాగిరెడ్డి -చక్రపాణి వద్దకు ఓ ఔత్సాహిక నటుడు వచ్చి, ” నేను అచ్చు ఎన్ టీ రామారావు లాగా నటిస్తాను సర్. ఓ అవకాశం ఇవ్వండి ” అని ప్రాధేయ పడ్డాడట. ” ఎన్ టీ రామారావే ఉంటే… మళ్ళీ నువ్వెందుకు… ” అని వారు చమత్కరించారట.
నిజానికి సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య ఓ పది సూపర్ ఫాస్ట్ రైళ్లు ఉన్నాయి. ఓ పది విమానాలు నడుస్తున్నాయి. ఆ రైళ్ళల్లో… ధనికులతో పాటు, గోచీ పాత రాయుళ్ళు కూడా వెళ్ళవచ్చు. ధనికులకే అయితే, విమానాలు ఉన్నాయి. మరి, ఈ ‘వందే భారత్ ‘ ఎందుకు అనేది అర్ధం కాదు. ఈ ‘వందే భారత్’ రైలు చార్జీలు… ఇతర రైళ్ళ చార్జీల కంటే ఎక్కువ…., విమాన చార్జీ కంటే కొంచెం తక్కువ. మరి, ఈ ట్రైన్ లో ఎవరు ప్రయాణించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు? బాగా డబ్బులు ఉన్నవారు, వ్యాపార… పారిశ్రామిక… ఉన్నతాధికార వర్గాల వారి కోసమా? వారు అంతా వైజాగ్ కు ఓ గంటలో చేరుకోడానికి; హైదరాబాద్ నుంచి పది విమానాలు ఉన్నాయి. ప్రయాణ సమయం ఒక గంటే! దేశమంతా 475 ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశ పెట్టాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
చిత్రం ఏమిటంటే….; దేశం లోని 130 కోట్లకు పైబడిన జనాభాలో 110 కోట్లకు పైబడిన జనాభా ప్రయాణానికి ఇవి ఉపయోగ పడవు. వీటిల్లో జనరల్ కోచ్ లు లేవు. స్లీపర్ క్లాస్ బోగీలు లేవు.. దేశ జనాభా దాకా ఎందుకు… తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు తొమ్మిదిన్నర కోట్ల జనాభాలో సుమారుగా ఏడున్నర, ఎనిమిది కోట్ల మందికి ఈ ‘ వందే భారత్ ‘ రైలు…. ప్రయాణానికి పనికి రాదు. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించాల్సిన వారిలో ఎక్కువమంది – ఏ రైలు లో జనరల్ బోగీలు ఎక్కువగా ఉన్నయ్యో చూసుకుని, దానిపైకి ఎగబడతారు. రైలు ప్లాట్ ఫారం మీదికి రాక ముందే… టవల్స్, హ్యాండ్ కర్చీఫ్ లు వేసేసి సీట్లు ఆక్రమించేస్తారు. సీట్ల మీదో… సీట్ల కిందో… ఆ కూర్చునే బల్లల మధ్యనో, టాయిలెట్స్ దగ్గరో… నడవడానికి ఉన్న జాగా లోనో….తలుపుల దగ్గరో… నిలబడో… కూర్చునో….హేండిల్స్ పట్టుకుని వేలాడుతూనో ప్రయాణిస్తుంటారు. ఇటువంటి జనాభా మన దేశం లో ఎనభై శాతానికి తక్కువ లేకుండా ఉంటారు.
మరి, కేంద్ర ప్రభుత్వం ఎవరిని లక్ష్యంగా పెట్టుకుని, ఈ ‘వందే భారత్’ రైళ్లను ప్రవేశ పెడుతున్నది? కేవలం ఎగువ మధ్య తరగతుల వారికోసమే ఈ రైళ్లు కదా ! అంటే – పన్నులు నిజాయతీ గా చెల్లించే మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేదలు, దారిద్ర్య రేఖ కు దిగువున ఉన్న వారు… కేంద్ర పాలకుల దృష్టిలో లేరు. ఒక్కో ‘వందే భారత్ ‘ రైలు నిర్మాణానికి సుమారు 120 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది. మొత్తం 475 ‘వందే భారత్ ‘ రైళ్లను పట్టాలు ఎక్కించాలని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు.(ఇప్పటికి పట్టాలు ఎక్కించింది మాత్రం ఎనిమిదే.) ఈ 475 రైళ్ళ నిర్మాణానికి దాదాపు 60వేల కోట్ల రూపాయల మొత్తం వ్యయం అవుతుంది . కానీ, అవి – మన జనాభాలో 110-115 కోట్ల మంది ప్రజల ప్రయాణావసరాలకు ఉపయోగ పడవు. అదీ మన పాలకుల ప్లానింగ్. మన జనానికి పనికి రాకపోయినా ఫరవాలేదు కానీ, ప్రచారానికి పనికి రావాలి అనేది పాలకుల ఆలోచనా విధానం.
ఈ అరవై వేల కోట్ల రూపాయలు ఆకాశం నుంచి ఊడి పడవు. ‘వందే భారత్ ‘ లో ప్రయాణించే ఆర్ధిక స్థోమత ఏమాత్రం లేని పేదలు, ఎగువ పేదలు ( అంటే దిగువ మధ్య తరగతి ప్రజలు ), దిగువ పేదలు చెల్లించే పన్నుల లోనుంచే – కేంద్ర పెద్దలు – ఎగువ మధ్య తరగతి వారి ప్రయాణ సరదాల కోసం ‘వందే భారత్’ రైళ్లను దేశం మీదికి వదులుతున్నారు. జపాన్, చైనా, దక్షిణ కొరియా లోని రైలు ట్రాక్ లు 300 నుంచి 600 కిలోమీటర్ల వేగాన్ని కూడా తట్టుకోగలవు. అందుకే, ఆ పట్టాల మీద బుల్లెట్ ట్రైన్ లు 600 కిలో మీటర్ల వేగం తో పరుగెడుతున్నాయి. మన రైల్ ట్రాక్ లు మాత్రం 130 కిలో మీటర్ల వేగాన్ని మించి తట్టుకోలేవు.అందుకే, ‘ వందే భారత్’ రైలు 180 కిలోమీటర్ల వేగం తో నడవ గలిగినప్పటికీ, 130 కిలోమీటర్ల వేగానికే పరిమితం చేశారు.
‘ వందే భారత్ ‘ అయినా, లేక మరో పథకం అయినా…. కేంద్ర ప్రభుత్వ పెద్దల ప్రాధాన్యత, ఆలోచనా విధానం ఏమిటనేవి ఇక్కడ పాయింట్. ఈ అరవై వేల కోట్ల రూపాయల వ్యయం తో… దేశం లోని 80% పేదలు – దేశం లోని ఆ మూల నుంచి ఈ మూలకు ప్రయాణించ గలిగిన పూర్తి స్థాయి స్లీపర్ క్లాస్, జనరల్ బోగీల రైళ్ళ ను ఓ నాలుగొందలు ప్రవేశపెడితే, వారికి ఎంత వెసులుబాటు!? కార్మికులు, ఇతర లేబరు దేశం లో ఎక్కడ అవసరం అయితే… వారు అక్కడికి సులభం గా… చౌకగా… వేగం గా ప్రయాణించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించగలిగితే, దేశం లో మౌలిక సదుపాయాలు ఇబ్బిడి ముబ్బిడి గా పెరగవా? దానివల్ల, పారిశ్రామికీకరణ పెరిగి…; ప్రభుత్వానికి ఆదాయం పెరగదా ? మన దేశ విస్తీర్ణంలో పదో వంతు కూడా లేని ఇండోనేసియా లోని మౌలిక సదుపాయాలు….., భవనాలు, రోడ్లు, బ్రిడ్జి లు చూట్టానికి రెండు కళ్ళూ చాలవు.
ఎందుకు ఇలా… అన్నది మన ప్రభుత్వాల అధినేతలు ఎప్పుడూ ఆలోచించిన భావన కలగదు. ఆత్మ స్తుతి, పరనింద, ‘నేను…నా భార్య…. నా పిల్లలు…. నా చుట్టాలు…. నా పార్టీ – తరువాత, రాజకీయం’. ఇవే మన నేతలకు గీటు రాళ్లు అనే భావన సమాజం లో బాగా స్థిర పడి పోయింది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చి వేస్తారనే గంపెడు ఆశతో – కాంగ్రెస్ ను చరిత్ర చెత్త బుట్ట కు పరిమితం చేసి నరేంద్ర మోడీ ని దేశం అక్కున చేర్చుకున్నది. అయినప్పటికీ, దేశ రాజకీయ నడకలో ఏమాత్రం మార్పు లేదు. అప్పుడు ఎలా నడిచిందో…. ఇప్పుడూ అలాగే నడుస్తున్నది. కాకపోతే, నీతులు అదనం ఇప్పుడు. ఢిల్లీ నుంచి బెజవాడ దాకా నీతులే నీతులు. కానీ, పాలనా పరంగా,దేశ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉన్నదో ఓ సారి పరిశీలిస్తే –
* దేశ జనాభా లో ధనికులైన ఒక్క శాతం మందిలో…. అంటే – సుమారు ఒక కోటి, ముప్పై లక్షల మంది వ్యక్తుల చేతిలో…. దేశం మొత్తం సంపదలో 40% చిక్కుకుపోయి ఉంది.
* దేశ జనాభా లో అట్టడుగు నుంచి పైకి -50% జనాభా – అంటే, సుమారు 65…70 కోట్ల మంది ప్రజల చేతిలో – దేశ సంపదలో కేవలం మూడు శాతం మాత్రమే ఉంది.
ఈ రెండు అంకెలను చూస్తే… ఈ దేశాన్ని మన పాలకులు ఎటు దీసుకువెడుతున్నారో అర్ధమవుతుంది. అప్పుడు,’ వందే భారత్’ లాటి పేదల ప్రయాణ అవసరాలకు ఒక్క శాతం కూడా ఉపయోగ పడని పబ్లిసిటీ పధకాలను పట్టుకుని జెండాలు ఎందుకు ఊపుతున్నారో అర్ధం అవుతుంది. దేశం లోని పదిమంది అత్యంత పెద్ద ధనికులపై ఓ 5 శాతం పన్ను అదనం గా విధిస్తే గనుక ; దేశం మొత్తం మీద స్కూళ్ల నుంచి డ్రాప్ అవుట్ అయిన పిల్లలను తిరిగి వెనక్కి తీసుకు వచ్చి, వారిని చదివించ వచ్చునని ఓ ఆర్ధిక మదింపు సంస్థ – తన అధ్యయనం లో అభిప్రాయ పడింది. గౌతమ్ అదాని అనే గుజరాతీ వ్యాపారి పై ఒక్క శాతం అదనపు పన్ను విధిస్తే, ప్రభుత్వానికి వచ్చే ఒక లక్షా డెబ్భయ్ వేల కోట్ల తో 50 లక్షల మంది ప్రాధమిక విద్యా ఉపాధ్యాయులను ఓ ఏడాది పోషించవచ్చు అని ఆ అధ్యయన నివేదికలో పేర్కొన్నారు. కానీ, మన పాలకులు ఆ పని చేయరు. మరి, ఆ పారిశ్రామికులే మన రాజకీయ మహా పోషకులు కదా! వారికి చిన్నపాటి నొప్పి కలిగించే పని కూడా ఏదీ చేయరు.
కరోనా సమయం లో మన దేశం లో మధ్య తరగతి జీవులు, పేదలు, కూలీలు, కార్మికులు, చిన్న ఉద్యోగులు ఎదుర్కొన్న బాధలు వర్ణనాతీతం కదా! కూలీలు, లేబరు – పిల్లా పాప లను చంకల్లో ఎత్తుకుని వందలాది కిలోమీటర్లు నడిచి వెళ్లారు. మార్గమధ్యం లో చనిపోయిన వారు చనిపోయారు. వారికి ఉపశమనం కలిగించడానికి – మన పాలకులు తీసుకున్న చర్యలు – సముద్రం లో కాకి రెట్ట లా వారికి ఏమాత్రం ఉపయోగపడలేదు.
కానీ, మన దేశం లోని బిలియనీర్ల సంపాదన మాత్రం – కరోనా సమయం లో – రోజుకు -మూడు వేల ఆరు వందల కోట్ల వంతున పెరగడానికి చేయగలిగింది అంతా చేశారు. కేంద్రం పుణ్యమా అని కరోనా సమయం లో దేశం లోని బిలియనీర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈ దేశం లో పేదలను, అల్పాదాయ వర్గాలను పాలకులు పట్టించుకోరు అని చెప్పడానికి, ఈ ‘ వందే భారత్’ రైళ్లు ఓ ఉదాహరణ.
ఈ పేదలను మన పాలకులు ఒకే ఒక సందర్భం లో పట్టించుకుంటారు. రెండు చేతులూ పైకెత్తి నమస్కారాలు పెడతారు. కృత్రిమంగా కనిపించే దొంగ నవ్వులు నవ్వుతుంటారు. వారి పిల్లల్ని ఎత్తుకుని ఆడిస్తారు. వారి ముక్కులు తుడుస్తారు. వారి భుజాలపై చేతులు వేసి ఆప్యాయతలు ఒలకబోస్తారు. ఆ సందర్బమే – ఎన్నికలు. అవి ఒక్క సారి అయిపోయిన తరువాత, ఈ పేదలు….. రైలు పట్టాల పక్కగా నిలబడి , గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగం తో వెళ్లే ‘ వందే భారత్ ‘ రైళ్లను గుడ్లప్పగించి చూస్తూ ఉండడమే.