ఏపీ డీజీపీని శుక్రవారం టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు కలిశారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం అందేశారు.
దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి అరుంధతి సినిమాలో పశుపతిలా లక లక బెక బెక అంటూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాడని పేర్కొ న్నారు. పీఆర్వో కృష్ణమోహన్ రాసి ఇచ్చే బూతుల మాటలు చదువుతున్నాడని, అవన్నీ వీడియోలతో సహా పెన్ డ్రైవ్ సీఈఓ కార్యాలయంలో అందజేసినట్లు వివరించారు.
గతంలో పార్టీ కార్యాలయం మీద దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి ఇంకా వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని, ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ వైసీపీ నాయకులను గూండా లను తీసుకెళ్లిన ఘటనపై ఇంతవరకు అరెస్టులు లేవని చెప్పారు. మొన్న ఒక వృద్ధురాలు చనిపోతే దాన్ని కూడా శవరాజకీయం చేస్తూ కార్యాలయాలకు, ఇళ్లకు వస్తామంటున్నారని వివరించారు.
మూడు రాజధానులు కోసం మీ పాదయాత్రలు ఏమయ్యాయి అని నందిగామలో అడిగితే అక్కడ మొండితోక జగన్మోహన రావు, వైసీపీ నాయకులు రాడ్లు, ఇటుక రాళ్లు, కర్రలు పెట్టి తలలు పగలగొట్టారని, ఇప్పటికీ వారు ఆసుపత్రిలో ఉన్నారని తెలిపారు. ఎవరు కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘించి తప్పులకు పాల్పడవద్దని, తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసే విధంగా పరిస్థితులు తీసుకురానీయవద్దని కోరారు.