– రైతుల ఉక్కుసంకల్పం ముందు ప్రభుత్వ కుట్రలు పటాపంచలయ్యాయి
– హైకోర్టు తీర్పుతోనైనా ముఖ్యమంత్రి కళ్లు తెరవాలి
– అమరావతి రైతులకు వర్ల రామయ్య అభినందనలు
అమరావతి: అమరావతి రాజధాని కోసం 807 రోజులుగా మీరు చేస్తున్న ఉద్యమం ఫలించింది…మీ కష్టం వృధాపోలేదు… దేశచరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా సుదీర్ఘకాలం మీరు సాగించిన న్యాయమైన పోరాటానికి న్యాయదేవత అశీస్సులతోపాటు తిరుమల వెంకన్న, ముక్కోటి దేవతల దీవెనలు ఉన్నాయని నిరూపితమైందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పేర్కొన్నారు.
అమరావతిపై ఉన్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలమేరకు వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ, కృష్ణాజిల్లా పరరిషత్ మాజీ చైర్ పర్సన్ గద్దే అనూరాధ గురువారం రైతుల దీక్షా శిబిరానికి చేరుకొని వారికి తమ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి రైతులకు టిడిపి నేతలు స్వీట్లు తినిపించారు.
ఈ సందర్భంగా వర్ల రామయ్య మాట్లాడుతూ అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు…అయినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమం కొనసాగించి పట్టుదలతో రాజధానిని సాధించుకున్నారని తెలిపారు. ఎస్సీ రైతులపైనే ఎస్సీ ఎట్రాసిటీ కేసులు బనాయించి జైళ్లలో పెట్టించారు…దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న మహిళా రైతుల పొత్తిళ్లపై ఖాకీలతో తొక్కించారు…న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతులకు కనీసం భోజనం చేసేందుకు వసతికూడా లేకుండా చేశారు.
అయితే అవన్నీ అమరావతి రైతుల ఉక్కు సంకల్పాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా అమరావతి రాజధానిపై కుట్రలు, కుతంత్రాలు మాని అక్కడ గతప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి స్థిరమైన, ప్రగతిశీలమైన పాలన కొనసాగించాలని వర్ల రామయ్య విజ్జప్తిచేశారు. ఇప్పటికే మూడేళ్లలో కాలయాపనచేయడంతో అభివృద్ధలో రాష్ట్రం పొరుగు రాష్ట్రాలకంటే వెనుకబడి పోయింది, విభజిత రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ లాంటి అమరావతిని త్వరితగతిన పూర్తిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు కృషిచేయాలని వర్ల రామయ్య కోరారు.