Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో వాహనాల్లేని పోలీస్ స్టేషన్లు 135

– దేశంలోనే అత్యధికం
– చర్యలు తీసుకోకపోతే నిధుల్లో కోత
– హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం

ఆంధ్రప్రదేశ్‌లోని 135 పోలీసు స్టేషన్లకు ఎలాంటి వాహనాలూ లేవని హోం వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. రాష్ట్రంలో ఉన్న 1,021 స్టేషన్లకు గాను 886కి మాత్రమే వాహన సౌకర్యం ఉన్నట్లు వెల్లడించింది. పోలీసు వ్యవస్థ ఆధునీకరణపై పార్లమెంటుకు సమర్పించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌లోని 135 పోలీసుస్టేషన్లకు ఎలాంటి వాహనాలూ లేవని పార్లమెంటరీ స్థాయీ సంఘం పేర్కొంది. రాష్ట్రంలో 1,021 స్టేషన్లకుగాను 886కి మాత్రమే వాహన సౌకర్యం ఉన్నట్లు వెల్లడించింది. పోలీసు వ్యవస్థ ఆధునికీకరణపై పార్లమెంటుకు సమర్పించిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. దేశవ్యాప్తంగా 16,833 స్టేషన్లలో 257కి వాహనాలు లేకపోగా అందులో 52% ఆంధ్రప్రదేశ్‌లోనే ఉండటం గమనార్హం.

దీనిపట్ల స్థాయీ సంఘం అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని స్టేషన్లకు తగిన వాహనాలు, కమ్యూనికేషన్‌ పరికరాలు అందించేలా కేంద్ర హోం శాఖ చర్యలు తీసుకోవాలని, లేదంటే పోలీసు ఆధునికీకరణకు రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో కోత పెట్టాలని సిఫార్సు చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రతి స్టేషన్‌కు 12 కెమెరాలు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు 966 కెమెరాలు ఏర్పాటు చేసింది. మరో 15,700 ఏర్పాటు దశలో ఉన్నాయి. తమిళనాడులో ఐపీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దానివల్ల పోలీస్‌స్టేషన్‌ లోపల ఏం జరుగుతోందో, బాధితులు ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారో సీనియర్‌ అధికారి పరిశీలించడానికి వీలవుతోంది.

ప్రతి స్టేషన్‌లో కనీసం ఒకటి రెండు చోట్ల ఐపీఆధారిత సీసీకెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. కోర్టు ప్రాంగణాల్లో 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలు పెట్టించాలి.
ఏపీ పోలీసుల పరిధిలో ఒక్కోటి చొప్పున సైబర్‌, ఉమెన్‌ సెల్స్‌, 2 సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్స్‌ ఉన్నాయి. జిల్లాకో సైబర్‌ సెల్‌ ఏర్పాటు చేసేలా కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సూచించాలి. సైబర్‌నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించేలా హాట్‌స్పాట్లను మ్యాపింగ్‌ చేయాలి.
రాష్ట్రంలో అన్నిరకాల పోలీసు సిబ్బంది లక్షకు 141.06 మంది పనిచేయాల్సి ఉండగా, ప్రస్తుతం 113.68 మంది మాత్రమే ఉన్నారు. మంజూరైన పోస్టుల కంటే 19.41% తక్కువగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇది 21%. పోలీసు నియామకాల కోసం ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించేలా హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించాలి.

జాతీయ స్థాయిలో మహిళా పోలీసు సిబ్బంది సగటున 10.30% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 5.85%కే పరిమితమైంది. అన్ని స్థాయిల్లో మహిళల భాగస్వామ్యం 33% ఉండేలా హోం శాఖ రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేయాలి. మహిళా కానిస్టేబుళ్ల కోసం అదనపు పోస్టులు సృష్టించేలా చూడాలి. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు మహిళా సబ్‌ ఇన్స్‌పెక్టర్లు, 10 మంది మహిళా కానిస్టేబుళ్లు, 24 గంటలూ పనిచేసే ఉమెన్‌ హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేయాలి. పూర్తిగా మహిళలతోనే జిల్లాకో పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటు చేసేలా చూడాలి.
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 11, తెలంగాణలో 9 కమిషనరేట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వీటి సంఖ్య రెండింటికే (విశాఖపట్నం, విజయవాడ) పరిమితమైంది. పది లక్షల జనాభా ఉన్న నగరాల్లో కమిషనరేట్‌ వ్యవస్థ ఏర్పాటు చేయడం మంచిది.

అన్ని రాష్ట్రాలూ పోలీసు వ్యవస్థలో దర్యాప్తు, శాంతిభద్రతల విభాగాలను విభజించేలా ఉత్తర్వులివ్వాలి. చిన్న నేరాల దర్యాప్తు బాధ్యతలను ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్‌ స్థాయి సిబ్బందికి అప్పగించవచ్చు. పెద్ద కేసులను మాత్రం సీనియర్‌ అధికారులు పర్యవేక్షించాలి. కేసుల దర్యాప్తును పరిశీలించేందుకు ఎస్పీ, ఐజీ, డీఐజీ స్థాయి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లేలా ఉత్తర్వులివ్వాలి. ముఖ్యమైన కేసుల దర్యాప్తు, అధికారుల పనితీరు గురించి ఎస్పీ, డీఎస్పీలు నెలవారీ నివేదికలు సమర్పించాలి. ప్రతిభ కనబరిస్తే పారితోషికాలు, ఆలస్యం చేస్తే జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టాలి.

LEAVE A RESPONSE